Ladies Finger : బెండసాగులో యాజమాన్యం, సస్యరక్షణ

పల్లాకు తెగులు సోకితే అధిక నష్టం వస్తుంది. ఈ తెగులు సోకిన ఆకులు ఈనెలు పసుపు రంగులోకి మారిపోతాయి. కాయలు గిడసబారి తెల్లగా మారతాయి.

Ladies Finger : బెండసాగులో యాజమాన్యం, సస్యరక్షణ

Bendi Crop

Ladies Finger : కూరగాయల పంటల సాగులో రైతులకు అధిక అదాయాన్ని సమకూర్చేదిగా బెండసాగును చెప్పవచ్చు. ఏడాది పొడవునా మార్కెట్లో బెండకు మంచి డిమాండ్ ఉంటుంది. ఈ నేపధ్యంలో చాలా మంది రైతులు బెండసాగు వైపు మొగ్గు చూపుతున్నారు. తక్కువ నీటితో , తక్కువ ఖర్చుతో బెండసాగును రైతులు చేపట్టవచ్చు. సరైన యాజమాన్య పద్దతులు, మెళుకువలు పాటిస్తే మంచి దిగుబడులు పొందవచ్చు.

ఉదజని సూచిక 6.8 వరకు ఉండే నెలలకు బెండసాగుకు అనుకూలంగా ఉంటాయి. ఇసుక నేలల్లో సైతం బెండసాగు చేయవచ్చు. ఒండ్రు నేలలు, తేలికపాటి నల్లరేగడి నేలలు, గడప నెల్లలోనూ మంచి దిగుబడి తీయవచ్చు. బెండసాగుకు అధిక దిగుబడినిచ్చే విత్తనరకాలను రైతులు ఎంచుకోవాల్సి ఉంటుంది. సాధారణ రకాలైన పర్భని కాంత్రి, అర్క అనామిక, అర్క అభయ, పూసా సవాస, పూసా ముఖమలి, పంజాబ్ , పి7, పి8 రకాలతోపాటు, హైబ్రీడ్ రకాలైన వర్ష, విజయ, విశాల్, నాథ్ శోభ, మహికో హైబ్రిడ్, నం 6,7,8,10 ప్రియ, సుప్రియ, ఐశ్వర్యం మిస్టిక్, తులసి రకాలను ఎంపిక చేసుకోవచ్చు.

విత్తన శుద్ధికి సంబంధించి కిలో బెండ విత్తనానికి 5గ్రా ఇమిడా క్లోఫ్రిడ్, 10గ్రా ట్రైకోడెర్మా విరిడితో కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి. నాటడానికి 24 గంటల ముందు ట్రైకోడెర్మా ఎస్పీపీ 4 నుండి 10గ్రా కిలో విత్తనానికి, సుడోమోనాస్ ఎస్పీ 10 గ్రాములు కేజీ విత్తనానికి సమపాళ్లో కలుపుకుని విత్తన శుద్ది చేసుకోవాలి. విత్తుకునే ముందు భూమిని నాలుగైదు సార్లు కలియదున్నాలి. ఆకరి దుక్కిలో ఎకరానికి ఎనిమిది నుండి పది టన్నుల పశువుల ఎరువు, 30 కిలోల భాస్వరం , పొటాష్ వేసుకోవాలి. బెండసాగులో నీటి యాజమాన్య పద్దతులు పాటించాలి. వాతావరణ పరిస్ధితులను బట్టి నీటితడులు ఇవ్వాలి. పూత, కాయ దశల్లో మొక్కలు నీటి యద్దడికి గురికాకుండా చూసుకోవాలి.

సస్యరక్షణ చర్యలు ;

బెండలో బూడిద తెగులు ఎక్కవగా కనిపిస్తుంది. దీని వల్ల ఆకులు పచ్చబడి రాలిపోతాయి. దీని నివారణకు లీటర్ నీటికి 3గ్్రా కరిగే గంధకపు పొడి లేదా 1మి.లీ డైనోకాప్ లేదా 2మి.లీ హెక్సాకొనజోల్ కలిపి పిచికారీ చేయాలి.

పల్లాకు తెగులు సోకితే అధిక నష్టం వస్తుంది. ఈ తెగులు సోకిన ఆకులు ఈనెలు పసుపు రంగులోకి మారిపోతాయి. కాయలు గిడసబారి తెల్లగా మారతాయి. అర్క అనామిక, అర్క అభయ్ రకాలు ఈ తెగులు బారిన పడవు. దీని నివారణకు లీటర్ నీటికి 2.5గ్రా క్లోరోథలానిల్, లేదా 2.5గ్రా మాంకోజబ్ లేదా 1గ్రా కార్బండజిమ్ కలిపి పిచికారీ చేసుకోవాలి.

మొవ్వ, కాయతొలిచే పురుగు అధికంగా కనిపిస్తుంది. ఇది పంటను వివిధ దశల్లో ఆశించి నష్టం కలుగజేస్తుంది. దీని నివారణకు కాయలు కోసిన తరువాత లీటర్ నీటిలో 3గ్రా, కార్బరిల్ లేదా 2మి.లీ క్వవినాల్ ఫాస్ కలిపి 10రోజుల వ్యవధిలో రెండు సార్లు పిచికారీ చేయాలి.

ఎండు తెగులు నివారణ కోసం లీర్ నీటిలో 3గ్రా కాపర్ ఆక్సిక్లోరైడ్ కలిపి ఆ ద్రావణాన్ని మొక్కల మొదళ్ల వద్ద పోయాలి. దుక్కిలోనే ఎకరానికి 100 కిలోల వేపపిండిని కలిపి వేసుకుంటే ఎండుతెగులును నివారించుకోవచ్చు.

పేను బంక , తామర పురుగులు కనిపిస్తే లీటరు నీటిలో 1గ్రా. ఎసిఫెట్ లేదా 2మి.లీ డైక్లోరోఫాస్ కలుపుకుని పిచికారీ చేయాలి.