మాస్క్ ఉంటేనే బస్సు ఎక్కేది.. నిలబడొద్దు!

  • Published By: srihari ,Published On : May 26, 2020 / 01:31 AM IST
మాస్క్ ఉంటేనే బస్సు ఎక్కేది.. నిలబడొద్దు!

బస్సుల సామర్థ్యానికి మించి ప్రయాణికులను అనుమతించేది లేదని ఆర్టీసీ స్పష్టం చేసింది. ప్రయాణికుల రద్దీనిబట్టి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని క్షేత్రస్థాయి అధికారులను అప్రమత్తం చేసింది. ప్రత్యేకించి పల్లెవెలుగు బస్సుల్లో కొన్ని మార్గాల్లో సీటింగ్ సామర్థ్యానికి మించి ప్రయాణికులను ఎక్కిస్తున్నారు. దీనికి సంబంధించి వ్యవహారం రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ దృష్టికి వచ్చింది. దీంతో ఆయన అధికారులను ఆదేశించారు. కరోనా నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రూపొందించిన మార్గదర్శకాలను విధిగా అమలు చేయాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. 

మార్గదర్శకాల అమలు విషయంలో రాజీ పడితే ఉపేక్షించేది లేదని పువ్వాడ అన్నారు. హైదరాబాద్ మినహా రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బస్సులు నడుపుతున్న విషయం తెలిసిందే. రోజు వారీగా మూడు వేల వరకు బస్సులను నడుపుతోంది. అధికశాతం బస్సుల్లో సగం కూడా ఆక్యుపెన్సీ ఉండటం లేదు. మాస్క్ లేకుండా ప్రయాణికులను ఎక్కించుకోకూడదని సిబ్బందిని ఆర్టీసీ ఆదేశించింది. ఆకస్మిక తనిఖీల్లో మాస్క్ లేకుండా ప్రయాణికులు బస్సులో కనిపిస్తే సంబంధిత సిబ్బంది బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించింది. మాస్క్ లేకుండా బస్సు ఎక్కరాదని, బస్సులు ఎక్కేముందు శానిటైజర్‌తో కానీ సబ్బు నీళ్లతో కానీ చేతులు శుభ్రం చేసుకోవాలంటూ బస్ పాయింట్లలో మైకుల ద్వారా ప్రయాణికులను చైతన్యం చేయాలని అధికారులను ఆదేశించింది ఆర్టీసీ. 

హైదరాబాద్ ఆర్టీసీ జోన్ పరిధిలో సుమారు 8 వందల బస్సులను నిలిపివేశారు. అద్దె ప్రాతిపదికన కొన్ని ప్రైవేట్ బస్సులను నడిపించారు. డ్రైవర్లు, కండక్టర్లు అవసరానికి మించి ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ క్రమంలోనే వారిని వివిధ విభాగాలు, కార్యాలయాల్లో అటెండర్లుగా తీసుకోవాలని నిర్ణయించారు. ఆసక్తి చూపే సిబ్బంది నుంచి దరఖాస్తులు తీసుకోవాలని సూచించింది. జూన్ ఆరో తేదీలోగా జాబితాను సిద్ధం చేయాలని సంబంధిత ఉత్తర్వుల్లో తెలిపారు. 

Read: విదేశాల నుంచి తెలంగాణకు వచ్చినా తెలుగువారికి తప్పని తిప్పలు