Rahul Gandhi : పెగాసస్ తో “భారత ప్రజాస్వామ్య ఆత్మ”పై ప్రధాని మోదీ దెబ్బకొట్టారు

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోన్న‌ పెగాసస్‌ ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై పార్లమెంటులో చర్చించాలని కొన్ని రోజులుగా విపక్షాలు డిమాండ్‌ చేస్తున్న విష‌యం తెలిసిందే.

Rahul Gandhi : పెగాసస్ తో “భారత ప్రజాస్వామ్య ఆత్మ”పై ప్రధాని మోదీ దెబ్బకొట్టారు

Rahul

Rahul Gandhi దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోన్న‌ పెగాసస్‌ ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై పార్లమెంటులో చర్చించాలని కొన్ని రోజులుగా విపక్షాలు డిమాండ్‌ చేస్తున్న విష‌యం తెలిసిందే. అయితే విప‌క్ష పార్టీలు డిమాండ్ చేస్తున్న‌ప్ప‌టికీ కేంద్ర ప్ర‌భుత్వం అందుకు ఒప్పుకోవ‌ట్లేదు. దీంతో పార్లమెంట్ ఉభ‌య స‌భ‌ల్లో విప‌క్ష నేత‌లు ఆందోళ‌న‌ల‌కు దిగుతుండ‌డంతో గంద‌ర‌గోళం నెల‌కొంటోంది. ప్రతి రోజూ ఉభయసభల్లో వాయిదాల ప‌ర్వం కొన‌సాగుతోంది. పెగాసస్ వ్యవహారంపై పార్లమెంట్ లో చర్చ జరిగేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ మంగళవారం ఏడు ప్రతిపక్ష పార్టీలు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కు లేఖ కూడా రాసిన విషయం తెలిసిందే.

కాగా,బుధవారం(జులై-28,2021) లోక్‌స‌భ‌లో పెగాసస్ వ్య‌వ‌హారంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీతో పాటు విప‌క్ష ఎంపీలు క‌లిసి వాయిదా తీర్మానానికి నోటీసులు ఇచ్చారు. అంత‌కు ముందు పెగాసస్ వ్యవహారంపై ఉభ‌య స‌భ‌ల్లో అనుస‌రించాల్సిన వ్యూహాల‌పై14 ప్ర‌తిప‌క్ష పార్టీల నాయ‌కులు పార్ల‌మెంటు వ‌ద్ద స‌మావేశ‌య్యారు. ఈ భేటీలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కూడా పాల్గొన్నారు.

విపక్ష నేతలతో మీటింగ్ అనంతరం కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ విలేఖరులతో మాట్లాడుతూ…భారత ప్రజాస్వామ్యం యొక్క ఆత్మని దెబ్బకొట్టడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన ఫోన్లలోకి ఓ ఆయుధాన్ని ప్రవేశపెట్టారు. ఈ ఆయుధాన్ని నాతోపాటు , సుప్రీంకోర్టు, జర్నలిస్టులు ఇతర నాయకులపై ప్రయోగించారు. ఇంత జరిగినా కేంద్రం ఎందుకు ఈ విషయాన్ని సభలో ప్రస్తావించదు. పెగాసస్ వ్యవహారంపై పార్లమెంట్ లో చర్చ జరగాలని విపక్షాలు డిమాండ్ చేస్తుంటే ప్రభుత్వం మాత్రం మౌనంగా ఉండేందుకు ప్రయత్నిస్తోంది. పెగాసస్ వ్యవహారంలో విపక్షాలు అన్నీ ఒకతాటిపైకి వచ్చాయి. విపక్షాలు పార్లమెంటు కార్యకలాపాలకు అంతరాయం కలిగిస్తున్నామని కేంద్రం చెబుతోంది.. కానీ తమ ప్రశ్నలకు సమాధానం చెప్పమనే అడుగుతున్నామని రాహుల్ స్పష్టం చేశారు.

పార్లమెంటులో విపక్షాల గొంతు నొక్కేస్తున్నారని రాహుల్ గాంధీ తెలిపారు. పెగాసస్ స్పైవేర్​​ను కేంద్రం కొనుగోలు చేసిందా? లేదా? చెప్పాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ డిమాండ్​ చేశారు. ఇలాంటి ఆయుధాన్ని దేశంలోని ప్రజాస్వామ్య సంస్థలపై ఎందుకు ప్రయోగించారో ప్రధాని, అమిత్​ షా సమాధానం చెప్పాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. ఇక, రైతు చట్టాలు, దేశభద్రత సమస్యలపై విపక్షాలన్నీ ఏకతాటిపైకి వచ్చాయని శివసేన ఎంపీ సంజయ్​ రౌత్ స్పష్టం చేశారు.

మ‌రోవైపు, పెగాసస్‌ వ్యవహారంపై సంబంధిత‌ అధికారులను స‌మాచార సాంకేతిక‌తకి చెందిన పార్లమెంటరీ ప్యానెల్‌ ప్రశ్నించనుంది. కేంద్ర ఐటీ, హోంశాఖకు చెందిన పలువురు అధికారులు హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశించింది.