Prakash Raj : ‘మా’లో కాక రేపుతున్న ప్రకాశ్‌రాజ్‌ ట్వీట్‌

మా ఎన్నికల వ్యవహారం కాక రేపుతున్న సమయంలో ప్రకాశ్‌రాజ్‌ చేసిన ఓ ట్వీట్‌ మరింత హీట్‌ పెంచింది. జెండా ఎగరేస్తాం అంటూ ట్వీట్‌ చేయడం ఆసక్తికరంగా మారింది.

Prakash Raj : ‘మా’లో కాక రేపుతున్న ప్రకాశ్‌రాజ్‌ ట్వీట్‌

Prakashraj

Movie Artists Association : ‘మా’ ఎన్నికల వ్యవహారం కాక రేపుతున్న సమయంలో.. తాజాగా ప్రకాశ్‌రాజ్‌ చేసిన ఓ ట్వీట్‌ మరింత హీట్‌ పెంచింది. జెండా ఎగరేస్తాం అంటూ.. ప్రకాష్‌రాజ్‌ ట్వీట్‌ చేయడం ఆసక్తికరంగా మారింది. తెగేదాకా లాగొద్దంటూ పది రోజుల క్రితం ట్వీట్‌ చేసిన ప్రకాశ్‌రాజ్‌.. ఎలక్షన్స్‌ ఎప్పుడంటూ నెల క్రితం ట్వీటారు. ఇప్పుడు జెండా ఎగరేస్తామంటూ నర్మగర్భంగా చెప్పడం మావీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌లో హాట్‌ టాపిక్‌ అవుతోంది. ప్రకాశ్‌రాజ్‌ ట్వీట్స్‌ రెచ్చగొట్టేలా ఉన్నాయంటూ కొందరు సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి ఎన్నికలు జరిగేలోగా ‘మా’ వివాదం ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాల్సి ఉంది.

మా అసోసియేషన్ అధ్యక్ష ఎన్నికల బరిలో తాను దిగుతున్నట్టు ప్రకాశ్ రాజ్ ప్రకటించగానే మొదలైన రగడ….అనేక మలుపులూ తిరుగుతూ సాగుతోంది. ప్రకాశ్ రాజ్‌కు పోటీగా…మంచు విష్ణు బరిలో దిగుతానన్నారు. ఆ తర్వాత జీవితా రాజశేఖర్, హేమ, సీఎల్ నరసింహారావు రేసులోకొచ్చారు. ప్రకాశ్ రాజ్‌ పోటీలో ఉన్నట్టు ప్రకటించగానే..లోకల్-నాన్ లోకల్ వివాదం తెరపైకొచ్చింది. వెనువెంటనే విలక్షణ నటుడు..విశ్వనటుడంటూ మెగా కాంపౌండ్ మద్దతు ప్రకటించింది. వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్‌ వర్మ.. లోకల్ అంటూ ఎవరూ లేరని వాదన వినిపించారు. ప్రకాశ్ రాజ్ ప్యానల్ ప్రకటించేశారు.

మాలో అభివృద్ధి కార్యక్రమాలు జరగడం లేదని నాగబాబు అనడంతో అధ్యక్షులు నరేశ్ రంగంలోకి దిగారు. నాగబాబుపై విమర్శలు గుప్పించారు. ప్రకాశ్ రాజ్ గత చరిత్ర తవ్వితీశారు. ఈ వివాదం సాగుతుండగానే.. జీవిత రాజశేఖర్, హేమ రంగంలోకి దిగారు. తెలంగాణ వాదాన్ని తెరపైకి తెస్తూ సీవీఎల్ నరసింహరావు పోటీ ప్రకటన చేశారు. విజయశాంతి నరసింహారావుకు మద్దతు ప్రకటించారు. దీంతో సినిమా ఎన్నికలు పాంచ్ పటాకాగా మారాయి. మా బిల్డింగ్ నిర్మిస్తామనని విష్ణు హామీ ఇచ్చారు. ఎవరు ఎవరికి మద్దతిస్తున్నారన్నది బహిరంగంగా ప్రకటించకపోయినప్పటికీ.. అంతర్గతంగా అందరూ వర్గాలుగా చీలిపోయారు.

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అంపశయ్య మీద ఉందని నటుడు ఓ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. 20 ఏళ్ల నుంచి బిల్డింగ్ కడతామని హామీ ఇచ్చిన వాళ్లు..ఒక్క ఇటుక కూడ కొనలేకపోయారని ఎద్దేవా చేశారు. ఈ వివాదం కాస్త సద్దుమణగ్గానే హేమ ఆడియో బయటకు వచ్చింది. అధ్యక్ష బాధ్యతలు ఈ సారి మహిళలకు కేటాయించాలని హేమ పట్టుబడుతున్నారు. అధ్యక్ష పీఠం నుంచి దిగకుండా ఉండేందుకు నరేశ్‌ ప్రయత్నాలు చేస్తున్నారని ఆమె విమర్శించారు. ఈ ఏడాది ‘మా’ అధ్యక్ష ఎన్నికలు వాయిదా పడేలా కొంతమంది చూస్తున్నారని ఆమె ఆరోపించారు. 5 కోట్ల నిధుల్లో 3 కోట్లు మాత్రమే నరేశ్‌ ఇప్పటివరకూ ఖర్చు చేశారని.. మిగతావి ఏం చేశారని ప్రశ్నించారు.
ఎన్నికలు త్వరగా నిర్వహించేలా ఒత్తిడి తేవాలని కోరుతూ ఆమె మాట్లాడిన ఆడియో బయటకు రావడం కలకలంగా మారింది.

హేమ చేసిన వ్యాఖ్యలను మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌ అధ్యక్షుడు నరేశ్‌ ఖండించారు. అసోసియేషన్‌ గౌరవాన్ని దెబ్బతీసేలా హేమ మాట్లాడుతున్నారని మండిపడ్డారు. హేమపై క్రమశిక్షణ సంఘానికి ఫిర్యాదు చేశారు. హేమకు క్రమశిక్షణా సంఘం నోటీసులిచ్చింది.. కమిటీ నిర్ణయం ప్రకారం తగిన చర్యలు తీసుకుంటామన్నారు నరేశ్‌. ఇదేదో చేయి దాటబోతుందని గ్రహించిన చిరంజీవి మెగా ఎంట్రీ ఇచ్చారు. మా క్రమశిక్షణ సంఘం చైర్మన్‌ కృష్ణంరాజుకు ఓ లేఖ రాశారు. ఎన్నికలు నిర్వహించడానికి అనువైన సమయం ఉందని.. ఇంకా ఆపద్ధర్మ కమిటీతో కాలయాపన చేయడం సరికాదని.. త్వరలోనే కొత్త కమిటీ ఎన్నుకోవాలని కోరారు. కొత్త కమిటీకి 2024వరకు గడువు ఇవ్వాలని… ఆ తర్వాత ఎప్పటిలాగే రెండేళ్లకోసారి ఎన్నికలు జరపాలని సూచించారు.