ఓల్డ్ మలక్ పేటలో ప్రారంభమైన రీపోలింగ్

  • Published By: bheemraj ,Published On : December 3, 2020 / 07:31 AM IST
ఓల్డ్ మలక్ పేటలో ప్రారంభమైన రీపోలింగ్

Old Malakpet Repolling start : హైదరాబాద్ లోని ఓల్డ్ మలక్ పేటలో రీపోలింగ్ ప్రారంభమైంది. గుర్తు మారడంతో రీపోలింగ్ నిర్వహిస్తున్నారు. డివిజన్ లోని 69 కేంద్రాల్లో పకడ్బండీ ఏర్పాట్లు చేశారు. అంతకముందు మాక్ పోలింగ్ నిర్వహించారు. సీపీఐ అభ్యర్థికి కంకి కొడవలి బదులు.. సీపీఎం సింబల్‌ అయిన సుత్తికొడవలిని ముద్రించడంతో వాయిదా పడిన పోలింగ్‌.. ప్రారంభం అయింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌ జరగుంది.



తాజాగా సీపీఐ అభ్యర్థి గుర్తును సరిచేసి.. అధికారులు కొత్త బ్యాలెట్లను ముద్రించారు. ఇవాళ 69 పోలింగ్ స్టేషన్లలో రీ పోలింగ్‌ జరగనుంది. ఇప్పటికే ఒకసారి తప్పు జరగడంతో అలాంటి తప్పు పునరావృతం కాకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు. బ్యాలెట్ పేపర్లను పోలింగ్ సిబ్బందికి ఇచ్చే ముందే ఒకటికి రెండు సార్లు చెక్‌ చేసుకున్నారు.



26వ డివిజన్‌లో మొత్తం ఏడుగురు అభ్యర్థులు బరిలో ఉన్నారు. సుమారు 26వ వార్డులో మొత్తం 54,655 మంది ఓటర్లు ఉన్నారు. పోలింగ్‌ వాయిదా వేసే సమయానికి దాదాపు 10 వేల వరకు ఓట్లు పోలయ్యాయి.

మంగళవారం ఓటేసినవాళ్లు కూడా గురువారం ఓటేయాలని ఎన్నికల అధికారులు తెలిపారు. వీరికి ఇప్పటికే ఎడమచేతి చూపుడు వేలికి సిరా ఉండటంతో ఎడమ చేతి మధ్యన వేలికి సిరా పెట్టనున్నారు.



ఓల్డ్‌ మలక్‌పేట్‌ డివిజన్ పరిధిలోని ఓటర్లంతా స్వేచ్ఛగా ఓటుహక్కు వినియోగించుకోవాలని అధికారులు కోరారు. మంగళవారం కొందరు ఓటర్లు.. బ్యాలెట్‌ పత్రాలను అడ్డంగా మడిచి బాక్స్‌లో వేశారని.. రీపోలింగ్‌లో అలాంటి పొరపాటు జరగకుండా ముందే అవగాహన కల్పించారు. అటు పోలింగ్ కేంద్రాల దగ్గర భద్రతను పోలీసులు కట్టుదిట్టం చేశారు.