Taj Mahal: తాజ్ మహల్‌ని ఉచితంగా చూడొచ్చు.. నిజమైన సమాధిని చూసే అవకాశం!

తాజ్ మహల్ లోపల ఉన్న షాజహాన్, ముంతాజ్‌ల సమాధిని ప్రజల సందర్శన కోసం ఉంచే సందర్భం మొత్తం ఏడాదికి ఒకే ఒక్కసారి వస్తుంది.

Taj Mahal:  తాజ్ మహల్‌ని ఉచితంగా చూడొచ్చు.. నిజమైన సమాధిని చూసే అవకాశం!

Updated On : February 23, 2022 / 12:33 PM IST

Taj Mahal: తాజ్ మహల్ లోపల ఉన్న షాజహాన్, ముంతాజ్‌ల సమాధిని ప్రజల సందర్శన కోసం ఉంచే సందర్భం మొత్తం ఏడాదికి ఒకే ఒక్కసారి వస్తుంది. తాజ్ మహల్‌ను ఇష్టపడే వ్యక్తులకు ఈరోజు చాలా ప్రత్యేకం. సాధారణంగా ఈ సమాధి ఏడాది పొడవునా మూసి ఉంటుంది. అయితే, ప్రజలు మూడు రోజుల పాటు ఉర్స్‌ సందర్భంగా ఉచితంగా తాజ్‌మహల్‌లోకి వెళ్లి చూడవచ్చు.

ఈ నెల అంటే ఫిబ్రవరి 27వ తేదీ నుంచి మార్చి 1వ తేదీ వరకు పర్యాటకులు ఉచితంగా తాజ్‌‌మహల్‌‌ని చూడవచ్చని అధికారులు వెల్లడించారు. ఫిబ్రవరి 27వ తేదీ, 28 తేదీల్లో మధ్యాహ్నం 2 గంటల నుంచి సూర్యాస్తమయం వరకు పర్యాటకులు ఉచితంగా తాజ్‌‌మహల్ చూడవచ్చు. మార్చి 1 న మాత్రం పూర్తి సమయం.. అంటే ఉదయం నుండి సాయంత్రం వరకు తాజ్‌మహల్‌ని చూసేందుకు అనుమతిస్తారు.

తాజ్ మహల్‌లో ఈ వస్తువులు నిషేధం:
సిగరెట్లు, బీడీలు, గుట్కా, పొగాకు, పాన్ మసాలా సహా జెండాలు, బ్యానర్లు, పోస్టర్లు, 36 అంగుళాల కంటే పెద్ద డ్రమ్స్, బ్యాండ్లు, స్క్రూడ్రైవర్లు, లైటర్లు, కత్తులు మొదలైన వాటిపై నిషేధం విధించారు. తాజ్ మహల్, సూపరింటెండింగ్ ఆర్కియాలజిస్ట్ ఈమేరకు ఓ ప్రకటన చేశారు.

అదేవిధంగా కోవిడ్ తగ్గుముఖం పట్టినా కూడా పర్యాటకులందరూ కోవిడ్ రూల్స్ తప్పకుండా పాటించాలని సూచించారు. ఉర్సు సందర్భంగా ఆనవాయితీ ప్రకారం చాదర్‌ పోషి, శాండల్‌, గుసుల్‌, కుల్‌ తదితర కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు టూరిస్ట్‌ గైడ్స్‌ అసోసియేసన్‌ అధ్యక్షుడు షంసుద్దీన్‌ ఖాన్‌ వెల్లడించారు.

షాజహాన్, ముంతాజ్ అసలు సమాధి చూసేందుకు సందర్శకులకు సంవత్సరంలో ఒకసారి మాత్రమే అనుమతి లభిస్తుంది. కాగా తాజ్‌‌మహల్ సందర్శనకు భారతీయులు 50రూపాయలు మ్యూజియం చూసేందుకు 200రూపాయలు చెల్లించాలి. విదేశీయులు 1100రూపాయలు సాధారణ రోజుల్లో చెల్లించాల్సి వస్తుంది.