ఆ ఊరంతా గవర్నమెంట్ ఉద్యోగులే…ఒక్కో ఇంటిలో ఇద్దరు ముగ్గురు

ఆ ఊరంతా గవర్నమెంట్ ఉద్యోగులే…ఒక్కో ఇంటిలో ఇద్దరు ముగ్గురు

Government Employees Village : మన తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని గ్రామాలు పలు ప్రత్యేకతల్ని కలిగి ఉన్నాయి. ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లాలో మాధవరం గ్రామంలో ఇంటికో జవాను ఉంటాడు. ప్రతీ ఇంటినుంచి ఒకరు దేశం కోసం సైన్యంలోపనిచేసేందుకు వెళతారు. అలా మాధవరం గ్రామాన్ని జవాన్ల గ్రామం అంటారు. అలాగే మహారాష్ట్రలోని గిర్గావ్. మొదటి ప్రపంచ యుద్ధం మొదలుకొని నేటి వరకు ఈ గ్రామం నుంచి 280 మంది సైన్యంలో వివిధ హోదాల్లో పనిచేశారు. చేస్తున్నారు కూడా.

అలా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కుభీర్ మండలం రాజురా గ్రామానికి కూడా ఓ ప్రత్యేకత ఉంది. కుభీర్‌ నుంచి కేవలం 2 కిలోమీటర్ల దూరంలో ఉండే రాజురా గ్రామంలో ఇంటికో ప్రభుత్వ ఉద్యోగి ఉంటారు. జుమ్డ గ్రామపంచాయతీ అనుబంధ గ్రామంగా ఉన్న ఈ కుగ్రామంలో జనాభా కేవలం 300లు. ఓటర్లు 200. రాజురా గ్రామంలో రెండు వార్డులు ఉన్నాయి. గ్రామంలో కేవలం ఎస్సీ, బీసీ వర్గాల ప్రజలు మాత్రమే ఉన్నారు.

ఒక్కో ఇంట్లో ఇద్దరు ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగులు
రాజురా గ్రామంలో ఇంటికొక్కరే కాదు ఒక్కో ఇంట్లో ఇద్దరు, ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. అటెండర్‌ స్థాయి ఉద్యోగుల నుంచి పేరొందిన సైంటిస్టుల వరకూ ఉన్నారు. రాజురాలో 95 శాతం మంది చదువుకున్న వారే. అతి తక్కువమంది మాత్రమే నిరక్ష్యరాస్యులు ఉన్నారు. సంతకాలు చేయడం రానివారు కేవలం 5 శాతంమందే.

మొత్తం ఉద్యోగస్తులలో 8 మంది బీసీ వర్గానికి చెందిన వారు కాగా మిగిలిన వారు ఎస్సీ వర్గానికి చెందిన వారున్నారు. వీరిలో ఏడుగురు డాక్టర్లు, ఆరుగురు టీచర్లు, ఆర్మీలో 3, పంచాయతీ కార్యదర్శులుగా ఇద్దరు, ఇద్దరు ఎస్సైలు, ఇద్దరు సైంటిస్టులు, ఒకరు విజిలెన్న్‌ అధికారి కాగా మిగిలిన వారు అటెండర్లు, ఆశ, అంగన్‌వాడీ, లెక్చరర్లు తదితర ఉద్యోగాలలో ఉన్నారు.అలా అందరూ ప్రభుత్వ ఉద్యోగులే కావటం రాజురా గ్రామం ప్రత్యేకత. చిక్కాల ప్రభు అనే రైతుకు ముగ్గురు కొడుకులు. వారు ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగులే. ఒకరు ఎక్సైజ్‌ ఎస్సై, మరొకరు ఏఅర్‌ ఎస్సై, ఇంకొకరు పోస్టల్ లో పనిచేస్తున్నారు.

ప్రభ చిన్న కొడుకు చిక్కాల విజయ్‌ కానిస్టేబుల్‌ ఉద్యోగంలో చేరాడు. ఆ తరువాత ఆరు గడవగానే పంచాయతీ కార్యదర్శి ఉద్యోగం రాగానే కానిస్టేబుల్‌ ఉద్యోగానికి రాజీనామా చేసి పంచాయతీ సెక్రటరీ అయ్యాడు. అలా నెల రోజులు భైంసా రూరల్‌ మండలం మిర్జాపూర్‌లో పనిచేశారు. అదే సమయంలో ఏఅర్‌ ఎస్సై ఉద్యోగం వచ్చింది. మళ్లీ పంచాయతీ సెక్రటరీ ఉద్యోగానికి రిజైన్ చేసి ఏఅర్‌ ఎస్సైగా ఉద్యోగంలో చేరి ప్రస్తుతం అసిఫాబాద్‌లో ఉద్యోగం చేస్తున్నాడు.

అలాగే రాజురా గ్రామంలోని సంజు అనే వ్యక్తి విజిలెన్స్‌ అధికారిగాను..దామోదర్‌ అనే వ్యక్తి సైంటిస్ట్‌గా, జి.అనిల్‌కుమార్‌ అగ్రికల్చర్ సైంటిస్టుగా పనిచేస్తున్నారు. మమరో వ్యక్తి ప్రభాకర్‌ అదనపు కలెక్టర్‌గా ఇటీవల రిటైర్ అయ్యారు. రాజురా గ్రామం కేవలం ప్రభుత్వ ఉగ్యోగులే కాదు..వ్యవసాయానికి కూడా ప్రసిద్ధి చెందింది.

పెద్ద వారిని చూసి స్ఫూర్తితో..
రాజురా గ్రామం గురించి ఆ గ్రామస్తులంతా చాలా గొప్పగా చెప్పుకుంటారు. ఒకరిని చూసి మరొకరు స్ఫూర్తి పొందుతారు. కష్టపడి చదువుకుంటారు. ప్రభుత్వ ఉగ్యోగాల్లో స్థిరపడాలని పట్టుదలగా ఉంటారు. అలా మంచిర్యాల క్సైజ్‌ ఎస్సై గా పనిచేసే చిక్కాల విలాస్ మాట్లాడుతూ..మా రాజురా గ్రామంలో నా కంటే ముందు చదివి ఉద్యోగం సాధించిన వయస్సులో పెద్దవారిని స్ఫూర్తిగా తీసుకొని కష్టపడి చదివి ఎక్సైజ్‌ ఎస్సైగా ఉద్యోగం సాధించానని తెలిపాడు.

రెండు కిలోమీటర్లు నడుచుకుంటూ..వాగులు దాటి స్కూలుకు
అలాగే అగ్రికల్చర్ సైంటిస్ట్ స్థాయికి ఎదిగిన జి.అనిల్‌కుమార్‌ మాట్లాడుతూ..కష్టపడి చదివి ఉద్యోగం సాధించాను. మా రాజురా గ్రామంలో ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తిచేసి రెండు కిలోమీటర్ల దూరం నడిచి వెళ్లి ప్రభుత్వ హైస్కూలుకు వెళ్లి అక్కడ 10Th పూర్తి చేశాను. అప్పట్లో మా గ్రామానికి సరైన రోడ్డు సౌకర్యంకూడా లేదు. బురదలో నడిచి వెళ్లేవాడిని దారిలో రెండు వాగులు దాటాలి. అలా కష్ట నష్టాలకు ఓర్చుకుంటూ చదివి ఉద్యోగం సాధించానని తెలిపారు.