Minister KTR : రాష్ట్రానికి పెట్టుబడుల వెల్లువ-ముగిసిన కేటీఆర్ అమెరికా టూర్

ఐటీ, పురపాలక శాఖమంత్రి కేటీఆర్ అమెరికా పర్యటన ముగిసింది. రాష్ట్రంలో పెట్టుబడుల కోసం విదేశాల్లోని పలు సంస్ధలతో ఆయన జరిపిన చర్చలు సఫలం అయ్యాయి.

Minister KTR : రాష్ట్రానికి పెట్టుబడుల వెల్లువ-ముగిసిన కేటీఆర్ అమెరికా టూర్

Telangana MInister KTR

Minister KTR :  ఐటీ, పురపాలక శాఖమంత్రి కేటీఆర్ అమెరికా పర్యటన ముగిసింది. రాష్ట్రంలో పెట్టుబడుల కోసం విదేశాల్లోని పలు సంస్ధలతో ఆయన జరిపిన చర్చలు సఫలం అయ్యాయి. చివరి రోజు భారీ పెట్టుబడుల వరదతో మంత్రి కేటీఆర్ అమెరికా పర్యటన ఫలప్రదంగా ముగిసిందని చెప్పవచ్చు.  చివరి రోజు పర్యటనలో తెలంగాణలో 4 సంస్థలు పెట్టుబడి పెట్టటానికి సంసిధ్దత వ్యక్తం చేశాయి.

హైదరాబాద్ లోని లైఫ్ సైన్సెస్, ఫార్మా కంపెనీల్లో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు అడ్వెంట్ ఇంటర్నేషనల్  కంపెనీ రెడీ అయింది. లైఫ్ సైన్సెస్ రంగానికి తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యత, కల్పిస్తున్న మౌలిక వసతులు తమ విస్తరణ, ఎదుగుదలకు ఎంతో ఉపయోగపడతాయని ఆ కంపెనీ తెలిపింది.

అమెరికా పర్యటనలో ఉన్న తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కే.తారకరామావు న్యూయార్క్ లోని అడ్వెంట్ ఇంటర్నేషన్ కంపెనీ ప్రధాన కార్యాలయంలో ఆ సంస్థ మేనేజింగ్ పార్టనర్ జాన్ మాల్డోనాడోతో సమావేశమయ్యారు. ఇండియాలోని ఇతర నగరాలతో పాటు హైదరాబాద్ లో అడ్వెంట్ కంపెనీ వ్యాపార వ్యూహాలు, విస్తరణ ప్రణాళికలపై ఈ మీటింగ్ లో చర్చించారు. హైదరాబాద్ కేంద్రంగా ఉన్న ఆర్.ఏ చెమ్ ఫార్మా లిమిటెడ్ (RA Chem Pharma Ltd), అవ్రా ల్యాబొరేటరీస్ (Avra Laboratories) లో మెజార్టీ వాటాలు కొనేందుకు 1750 కోట్ల రూపాయాలు పెట్టుబడులు పెట్టాలన్న అడ్వెంట్ కంపెనీ నిర్ణయాన్ని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ స్వాగతించారు.
Also Read : Naveen Patnaik: ఒడిశా మున్సిపల్ ఎన్నికల్లో అధికార బీజేడీ క్లీన్ స్వీప్: దరిదాపుల్లో కూడా లేని బీజేపీ, కాంగ్రెస్

“హైదరాబాద్ ఫార్మా, లైఫ్ సైన్సెస్ రంగంలో భారీగా పెట్టుబడులు పెట్టాలన్న అడ్వెంట్ నిర్ణయం నాకు సంతోషాన్ని కలిగించింది. అడ్వెంట్ కంపెనీతో   కలిసి తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తుంది. ఇతర లాభదాయక పెట్టుబడి అవకాశాలను కంపెనీ అన్వేషిస్తుందన్న నమ్మకం నాకుంది. ఇందుకు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలను అందిస్తాము”- అని మంత్రి కేటీఆర్ అన్నారు.

న్యూజెర్సీ కేంద్రంగా ఉన్న స్లేబ్యాక్ ఫార్మా కంపెనీ హైదరాబాద్ ఫార్మా రంగంలో భారీ విస్తరణ ప్రణాళికలు ప్రకటించంది. రాబోయే మూడు సంవత్సరాల్లో సుమారు 1500 కోట్ల రూపాయలను పెట్టుబడి పెట్టనుంది. సిజిఎంపి (CGMP)ల్యాబ్ తో పాటు అత్యాధునిక తయారీ కేంద్రాన్ని హైదరాబాద్ లో ప్రారంభించబోతుంది. గడిచిన ఐదు సంవత్సరాల్లో హైదరాబాద్ ఫార్మాలో స్లేబ్యాక్ కంపెనీ సుమారు 2300 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టింది.

మంత్రి కె.తారకరామారావు తో సమావేశం తరువాత స్లేబ్యాక్ ఫార్మా వ్యవస్థాపకులు, సీఈఓ అజయ్ సింగ్ ఈ భారీ పెట్టుబడి ప్రకటన చేసింది. 2011లో కంపెనీ ప్రారంభించినప్పటి నుంచి సాధించిన పురోగతి, విజయాలను ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ కు సీఈఓ అజయ్ సింగ్ వివరించారు. అమెరికన్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుంచి జెనెరిక్ ఔషధాల తయారీ, అనుమతులు పొందడానికి అవసరమైన క్లిష్టమైన ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసిన ఘనత తమ కంపెనీకి ఉందన్నారు. హైడ్రాక్సీప్రోజెస్టెరాన్ 5 ఎం.ఎల్ జెనరిక్ ఔషధానికి సంబంధించిన అనుమతులను పొందడంతో పాటు అమెరికన్ మార్కెట్ లో తొలిసారి ప్రవేశపెట్టింది తమ కంపెనీనే అన్నారు.

మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ హైదరాబాద్ ఫార్మారంగంలో స్లేబ్యాక్ ఫార్మా అసాధారణ ఎదుగుదల,విస్తరణ ప్రణాళికలు అద్భుతంగా ఉన్నాయన్నారు. తెలంగాణలోని పారిశ్రామిక అనుకూల విధానాలు, లైఫ్ సైన్సెస్ రంగానికి హైదరాబాద్ లో ఉన్న అనుకూలతలను ఉపయోగించుకుని స్లేబ్యాక్ కంపెనీ మరిన్ని విజయాలను సాధిస్తుందన్న నమ్మకం తనుకు ఉందన్నారు. ఇప్పటికే హైదరాబాద్ లోని అనేక లైఫ్ సైన్సెస్ కంపెనీలు తమ విజయాలతో ప్రపంచం దృష్టిని ఆకర్షించడం తనకు సంతోషాన్ని కలిగిస్తోందని కేటీఆర్ చెప్పారు.

లైఫ్ సైన్సెస్ రంగానికి తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతకు ఆ రంగంలోని దిగ్గజ కంపెనీలు ఆకర్షితమవుతున్నాయి. భారీ పెట్టుబడులతో తమ విస్తరణ ప్రణాళికలను ప్రకటిస్తున్నాయి. తాజాగా ఈ లిస్ట్ లోకి అమెరికాకు చెందిన యునైటెడ్ స్టేట్స్ ఫార్మాకొపియా చేరింది. రెండు లక్షల వేల డాలర్ల అదనపు మూలధన పెట్టుబడితో నిరంతర ఔషధ తయారీ (ఫ్లో కెమిస్ట్రీ) కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. ఈ అధునాత ల్యాబ్ ఏర్పాటుతో ఔషధ తయారీ ప్రక్రియ మరింత సమర్థవంతంగా, వేగంగా పూర్తయ్యే అవకాశం ఉంటుంది. మంత్రి కేటీఆర్ తో యునైటెడ్ స్టేట్స్ ఫార్మాకొపియా చీఫ్ ఫైనాన్స్ ఆఫీసర్, ఇండియా ఆపరేషన్స్ హెడ్ స్టాన్ బుర్హాన్స్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్, రీజియన్స్, స్ట్రాటజీ అండ్ ఆపరేషన్స్ డాక్టర్ కె.వి. సురేంద్ర నాథ్ ల సమావేశం తరువాత ఆసంస్థ ఈ పెట్టుబడి ప్రకటన చేసింది.

అత్యాధునిక ప్రయోగశాలకు అవసరమయ్యే మౌలిక సదుపాయాలు, మూలధనం కోసం గడిచిన రెండు సంవత్సరాల్లో యుఎస్పి ఇండియా 5 మిలియన్ డాలర్లకు పైగా పెట్టుబడి పెట్టిందని 70 మందికి ఉద్యోగ అవకాశాన్ని కల్పించిందని మంత్రి కేటీఆర్ కు యుఎస్పి బృందం వివరించింది. ఇప్పుడు హైదరాబాద్ లో ఏర్పాటుచేయబోయే అడ్వాన్స్ డ్ ల్యాబ్ లో 50 మంది అనుభవజ్ఞులైన శాస్త్రవేత్తల బృందం పనిచేస్తుందన్నారు.

నిరంతర ఔషధ తయారీ ప్రక్రియలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కునేందుకు అవసరయ్యే కొత్త ప్రక్రియ, సాంకేతికతను ఈ బృందం అభివృద్ది చేస్తుందని తెలిపారు. 12,500 చదరపు అడుగుల విస్తీర్ణంలో జీనోమ్ వ్యాలీలో తాము ఏర్పాటుచేసే ఈ అత్యాధునిక ల్యాబ్ కు సింథటిక్, విశ్లేషణాత్మక సామర్థ్యం ఉంటుందని మంత్రి కేటీఆర్ కు చెప్పారు.

“నిరంతర ఔషధ తయారీ సదుపాయంతో యు. ఎస్. ఫార్మాకోపియా హైదరాబాద్ ఫార్మారంగంలో విస్తరించాలనుకుంటున్నందుకు సంతోషిస్తున్నాను. నూతన, సమర్థవంతమైన, సుస్థిరమైన సాంకేతిక పరిజ్ఞానాలలో పెట్టుబడులను ప్రోత్సహించడానికి మా తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఫార్మా కంపెనీలు మరింత సమర్థవంతంగా పనిచేయాలన్న మా ప్రభుత్వ ప్రయత్నాలను ఈ కొత్త ల్యాబొరేటరీ మరింత వేగవంతం చేస్తుందని ఆశిస్తున్నాను.యూఎస్పీ పెట్టుబడితో లైఫ్ సైన్సెస్ రంగంలో హైదరాబాద్ కు ఉన్న అగ్రస్థానం మరింత పదిలం అవుతుందని భావిస్తున్నాను ”¬అని మంత్రి కేటీఆర్ అన్నారు.

న్యూయార్క్ కేంద్రంగా ఉన్న క్యూరియా గ్లోబల్ (ఇంతకు ముందు AMRI Global ) హైదరాబాద్ లోని తన కేంద్రంలో పనిచేసే ఉద్యోగులను రాబోయే 12 నెలల్లో రెట్టింపు చేసే ఆలోచనలో ఉంది. ఇప్పటికే మన దేశంలో ఈ కంపెనీ 27 మిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టింది. ఇతర క్యూరియా గ్రూప్ సంస్థలు, థర్ట్ పార్టీ సంస్థల కోసం ఔషధ రసాయన శాస్త్రంలో తయారీ, ఒప్పంద పరిశోధన కార్యకలాపాలను ఈ సంస్థ నిర్వహిస్తుంది. క్యూరియా గ్లోబర్ వనరులతో మన దేశంలోని ఆ సంస్థ కేంద్రాలు పనిచేస్తున్నాయి. ఔషధ రసాయన శాస్త్రంలో ఈ గ్రూప్ కు మంచి పట్టుంది.

క్యూరియా సీనియర్ వైస్ ప్రెసిడెంట్, చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ ప్రకాష్ పాండియన్ తో మంత్రి కే. తారకరామారావు సమావేశం తరువాత కంపెనీ ఈ ప్రకటన చేసింది. మార్కెట్ లీడ్స్, సప్లై ఛైయిన్ సర్వీసెస్, బిజినెస్ ఎనాలిసిస్, లీగల్ సపోర్ట్ అండ్ ప్రాజెక్ట్ మేనేజ్ మెంట్, జనరల్ అడ్మినిస్ట్రేషన్, కన్సల్టెన్సీ సంబంధిత సర్వీసులు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఫైనాన్స్, అకౌంటింగ్, క్వాలిటీ, రెగ్యులేటరీ, కమర్షియల్ సర్వీసెస్, ప్రొక్యూర్ మెంట్, హ్యూమన్ రిసోర్సెస్, కస్టమర్ సర్వీస్, మార్కెటింగ్ & సేల్స్, ట్రైనింగ్, డేటా మెయింటెనెన్స్ సర్వీసెస్, ఎన్విరాన్ మెంట్, హెల్త్ & సేఫ్టీ (ఈహెచ్ ఎస్) వంటి రంగాల్లోని అన్ని క్యూరియా గ్రూపు సంస్థలకు సపోర్ట్ సర్వీస్ అందించడానికి గత ఏడాది హైదరాబాద్ లో గ్లోబల్ షేర్డ్ సర్వీస్ సెంటర్ ను ఏర్పాటుచేసినట్టు మంత్రికి ఈ సమావేశంలో తెలియజేశారు.

హైదరాబాద్ లోని గ్లోబల్ షేర్డ్ సర్వీస్ సెంటర్ లో ప్రస్తుతం 115 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారని, రాబోయే 12 నెలల్లో మరో 100 మందికి ఉద్యోగాలు కల్పిస్తామని కంపెనీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ప్రకాష్ పాండియన్ తెలిపారు.

ఈ సమావేశంలో మాట్లాడిన కేటీఆర్ క్యూరియా గ్లోబల్ అసాధారణ ఎదుగుదల, దాని విస్తరణ ప్రణాళికలు తనకు సంతోషాన్ని కలిగించాయన్నారు. క్యూరియా గ్రూప్ దార్శనికత, లక్ష్యాన్ని సాధించడంలో హైదరాబాద్ లోని గ్లోబల్ షేర్డ్ సర్వీసెస్, R&D కమ్ మాన్యుఫాక్చరింగ్ సెంటర్ కీలక పాత్ర పోషిస్తాయన్న నమ్మకం తనకు ఉందన్నారు. క్యూరియా గ్రూప్ కు తెలంగాణ ప్రభుత్వం అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తుందని కేటీఆర్ తెలిపారు.ఈ సమావేశాలలో  పరిశ్రమలు, వాణిజ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్, తెలంగాణ ప్రభుత్వ లైఫ్ సైన్సెస్ డైరెక్టర్ శక్తి ఎం నాగప్పన్ పాల్గొన్నారు.