నిర్లక్ష్యానికి భారీ మూల్యం.. బ్యాగ్ తెరిచారు, 18మందికి కరోనా

కరోనా వైరస్ మమమ్మారి చాలా డేంజర్. చాలా జాగ్రత్తగా ఉండండి. కరోనాతో గేమ్స్ వద్దు, లేదంటే భారీ మూల్యం

  • Published By: naveen ,Published On : May 30, 2020 / 06:40 AM IST
నిర్లక్ష్యానికి భారీ మూల్యం.. బ్యాగ్ తెరిచారు, 18మందికి కరోనా

కరోనా వైరస్ మమమ్మారి చాలా డేంజర్. చాలా జాగ్రత్తగా ఉండండి. కరోనాతో గేమ్స్ వద్దు, లేదంటే భారీ మూల్యం

కరోనా వైరస్ మమమ్మారి చాలా డేంజర్. చాలా జాగ్రత్తగా ఉండండి. కరోనాతో గేమ్స్ వద్దు, లేదంటే భారీ మూల్యం తప్పదని ప్రభుత్వాలు నెత్తీనోరు బాదుకుని చెబుతున్నాయి. అయినా కొందరు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ కరోనా బారిన పడుతున్నారు. ఇలాంటి ఘటన ఒకటి మహారాష్ట్రలోని థానేలో జరిగింది. 40 ఏళ్ల ఓ మహిళ ఇటీవల కరోనా వైరస్‌ లక్షణాలతో మృతిచెందింది. డాక్టర్లు ఆమె మృతదేహాన్ని ప్యాక్‌ చేసి బంధువులకు అప్పగించారు. దాన్ని తెరవకుండా నేరుగా అంత్యక్రియలు నిర్వహించాలని ఆదేశించారు. అయినా బంధవులు లైట్ తీసుకున్నారు. డాక్టర్లు చెప్పిన ఆదేశాలు గాలికొదిలేశారు. అంతిమ సంస్కారాల్లో ఆమె మృతదేహం ప్యాక్‌ చేసిన బ్యాగ్‌ను తెరిచారు. అంతే, బంధువుల్లో 18 మందికి వైరస్‌ సోకింది.

చనిపోయిన తర్వాత కరోనా నిర్ధారణ:
థానే జిల్లాలోని ఉల్లాస్‌ ‌నగర్‌లో మే 25న ఓ మహిళ(40) కరోనా లక్షణాలతో చనిపోయింది. డాక్టర్లు ఆమె మృతదేహానికి కరోనా పరీక్షలు నిర్వహించారు. తర్వాత గైడ్ లైన్స్ ప్రకారం డెడ్ బాడీని భద్రంగా ప్యాక్‌ చేసి బంధువులకు అప్పగించారు. దాన్ని తెరవకుండా నేరుగా అంత్యక్రియలు పూర్తి చేయాలని ఆదేశించారు. అయినా ఆమె బంధువులు అంతిమ సంస్కారాల కోసం ప్యాక్‌ చేసిన బ్యాగ్‌ తెరిచి మృతదేహాన్ని తాకి అంత్యక్రియలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సుమారు 100 మంది హాజరయ్యారు. ఆ తర్వాత వచ్చిన ఫలితాల్లో మృతురాలికి కరోనా పాజిటివ్‌గా తేలడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. 

మృతదేహం బ్యాగ్ తెరవొద్దని చెప్పినా వినలేదు:
అంత్యక్రియల్లో పాల్గొన్న 50 మందిని తొలుత క్వారంటైన్‌ చేయగా.. అందులో 18 మందికి శుక్రవారం(మే 29,2020) పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో ఇప్పుడు మిగతావారిని గుర్తించే పనిలో పడ్డారు అధికారులు. ఈ ఘటనను అధికారులు సీరియస్ గా తీసుకున్నారు. సంబంధిత బంధువులపై పోలీస్‌ కేసు నమోదు చేస్తామని చెప్పారు. అంత్యక్రియలకు సంబంధించిన నిబంధనలను వారు ఉల్లంఘించారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపింది. కరోనా ఎంత డేంజరో మరోసారి స్పష్టం చేసింది. సో, కరోనా విషయంలో ప్రభుత్వాలు, డాక్టర్లు చెప్పినట్టు నడుచుకోవాలి. నిబంధనలు, జాగ్రత్తలు పాటించాలి. ఏ మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించినా ఆ తర్వాత భారీ మూల్యం చెల్లించుకోకతప్పదు.

దేశంలో కరోనా పంజా:
దేశంలో క‌రోనా వైర‌స్ పంజా విసురుతోంది. రోజు రోజుకూ వేల సంఖ్యలో కొత్త పాజిటివ్ కేసులు న‌మోదవుతున్నాయి. వ‌రుస‌గా రెండ‌వ రోజు కూడా పాజిటివ్ కేసులు ఏడు వేలు దాటాయి. గ‌త 24 గంట‌ల్లో దేశంలో కొత్త‌గా 7వేల 964 పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. దేశంలో ఒకే రోజు అత్య‌ధిక స్థాయిలో పాజిటివ్ కేసులు న‌మోదు కావ‌డం ఇదే అత్య‌ధికం. ఇక మ‌ర‌ణించిన వారి సంఖ్య కూడా అత్య‌ధికంగా ఉంది. గ‌త 24 గంట‌ల్లో దేశంలో క‌రోనా వైర‌స్ వ‌ల్ల మ‌ర‌ణించిన వారి సంఖ్య 265గా న‌మోదైయి‌ట్లు కేంద్ర ఆరోగ్య‌శాఖ వెల్ల‌డించింది. దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య లక్ష 73వేల 763గా ఉంది. 80 వేల మంది వైర‌స్ నుంచి కోలుకున్నారు. దేశంలో కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో మహారాష్ట్ర టాప్ లో ఉంది. మహారాష్ట్రలో ఇప్పటివరకు 60వేల కేసులు నమోదయ్యాయి.

Read: వరుసగా రెండవరోజు 7వేలకు పైగా కరోనా కేసులు..