కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారా? ఈ మూడు సైడ్ ఎఫెక్ట్‌లు కనిపిస్తే టీకా పని చేసినట్టే

కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారా? ఈ మూడు సైడ్ ఎఫెక్ట్‌లు కనిపిస్తే టీకా పని చేసినట్టే

These 3 side-effects may mean your vaccine is working: ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో ప్రజలకు కరోనా వ్యాక్సిన్ ఇస్తున్నారు. రోజూ లక్షలాది మంది టీకా తీసుకుంటున్నారు. అయితే టీకా తీసుకున్న వారిలో అత్యధికులు బాగానే ఉన్నారు. కొద్దిమందికి మాత్రం స్వల్పంగా సైడ్ ఎఫెక్ట్ లు వస్తున్నాయి. ఈ సైడ్ ఎఫెక్ట్ లు ఆందోళనకు గురి చేస్తున్నాయి. పైగా, కొంతమంది టీకా తీసుకున్న తర్వాత చనిపోయారనే వార్తలు ఆందోళనను మరింత పెంచుతున్నాయి. అయితే వారి మరణానికి, వ్యాక్సిన్ కి ఎలాంటి సంబంధం లేదని వైద్య ఆరోగ్య నిపుణులు తేల్చి చెబుతున్నారు. అయినా సైడ్ ఎఫెక్టులు ప్రజలను కలవరపెడుతున్నాయి. ఈ అనుమానాలు, సందేహాలు, భయాలు.. ప్రజలను ప్రభావితం చేస్తున్నాయి. వ్యాక్సిన్ తీసుకోకపోవడమే మంచిదని కొందరు ఫీల్ అవుతున్నారు.

కాగా, కరోనా వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత అది పని చేసిందా లేదా అనే సందేహం అందరిలోనూ ఉంది. టీకా తీసుకున్నాక సైడ్ ఎఫెక్ట్ లు వస్తే మంచిదా లేక ప్రాణాలకు ప్రమాదమా అని తెలుసుకోవాలని అంతా ఆసక్తి చూపుతున్నారు. దీని గురించి అమెరికా అంటువ్యాధుల నివారణ నిపుణుడు ఆంటోనీ ఫౌసీ క్లారిటీ ఇచ్చారు. అన్ని సైడ్ ఎఫెక్టులు ప్రమాదం కావన్న ఆయన.. టీకా తీసుకున్న తర్వాత ప్రధానంగా మూడు రకాల సైడ్ ఎఫెక్టులు కనిపిస్తే.. మంచి పరిణామం అని, వ్యాక్సిన్ పని చేసినట్టే అని చెబుతున్నారు. ఆ సైడ్ ఎఫెక్టులు కనిపిస్తే రోగనిరోధక శక్తిని బిల్డ్ చేసినట్టే అని తెలిపారు.

టీకా తీసుకున్న వారిలో సైడ్ ఎఫెక్ట్ లు వస్తేనే టీకా సమర్ధవంతంగా పని చేసినట్టుగా భావించవచ్చని ఫౌసీ అన్నారు. ఏవైనా ప్రభావాలు కనిపిస్తే ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారాయన. పైగా, అన్ని రకాల సైడ్ ఎఫెక్ట్ లూ ప్రాణాంతకమేమీ కాదని, అది వ్యాక్సిన్ శరీరంలో పని చేస్తోందనడానికి సంకేతమని స్పష్టం చేశారు. ఏ వ్యాధికి టీకాను తీసుకున్నా కొన్ని రకాల సైడ్ ఎఫెక్ట్ లు సర్వ సాధారణమని చెప్పిన ఆయన, ఇవి ఎటువంటివైనా రెండు నుంచి మూడు రోజుల్లోనే సమసిపోతాయని వెల్లడించారు.

కరోనా టీకాను తీసుకున్న తర్వాత శరీరంలో ఉండే సాధారణ రోగ నిరోధక శక్తి స్పందిస్తుందని, దీని ప్రభావంతో శరీరానికి నొప్పులు, స్వల్పంగా జ్వరం, జలుబు వంటివి రావచ్చని ఫౌసీ అన్నారు. ముఖ్యంగా కండరాల నొప్పులు, తలనొప్పి రావడం, నీరసంగా అనిపించడం సంభవిస్తే, వ్యాక్సిన్ ప్రభావం శరీరంపై చూపిస్తున్నట్టుగానే భావించాలని, ఇవేవీ ఇబ్బంది పెట్టేంతగా ఉండబోవని ఆయన వివరించారు.

ప్రజలకు ఇప్పటివరకూ అందుబాటులోకి వచ్చిన అన్ని టీకాలూ కరోనా వైరస్ పై పని చేస్తున్నాయని, వీటిల్లో అత్యంత సమర్థవంతంగా పనిచేసే టీకా ఏంటన్న విషయం తేలాలంటే సమయం పడుతుందని డాక్టర్ ఆంటోనీ ఫౌసీ అన్నారు. ఇదే సమయంలో టీకా తీసుకునే సమయానికే వివిధ రకాల అనారోగ్య సమస్యలు ఉంటే మాత్రం వారు మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత జ్వరం వచ్చి ఐదు రోజులైనా తగ్గకపోయినా, జీర్ణ సమస్యలు రోజుల తరబడి కొనసాగుతున్నా వెంటనే డాక్టర్లను సంప్రదించాలని ఆయన సూచించారు.