Telangana HC: నేడు ప్రమాణ స్వీకారం చేయనున్న జడ్జీల ప్రస్థానం ఇదే!

తెలంగాణ హైకోర్టులో నూతనంగా నియమితులైన న్యాయమూర్తులు ఈరోజు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. పెరుగు శ్రీసుధ, చిల్లకూరు సుమలత, గురిజాల రాధారాణి, మున్నూరి లక్ష్మణ్, నూన్ సావత్ తుకారాంజీ..

Telangana HC: నేడు ప్రమాణ స్వీకారం చేయనున్న జడ్జీల ప్రస్థానం ఇదే!

Telangana Hc

Telangana HC: తెలంగాణ హైకోర్టులో నూతనంగా నియమితులైన న్యాయమూర్తులు ఈరోజు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. పెరుగు శ్రీసుధ, చిల్లకూరు సుమలత, గురిజాల రాధారాణి, మున్నూరి లక్ష్మణ్, నూన్ సావత్ తుకారాంజీ, అద్దుల వెంకటేశ్వరరెడ్డి, పట్లోల్ల మాధవీదేవి తెలంగాణ రాష్ట్ర హైకోర్టుకు నూతన న్యాయమూర్తులుగా ఎన్నికైన సంగతి తెలిసిందే. కాగా, ఈ న్యాయమూర్తులు నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. నూతన న్యాయమూర్తుల చేరికతో హైకోర్టులో సీజేతో కలిపి న్యాయమూర్తుల సంఖ్య 18కి చేరగా.. అందులో మహిళా న్యాయమూర్తుల సంఖ్య అయిదుకు చేరడం విశేషం.

కాగా, ఒకసారి నేడు ప్రమాణస్వీకారం చేయనున్న న్యాయమూర్తుల ప్రస్థానం ఇదే..

పి.శ్రీసుధ: 1962 జూన్‌ 6న నెల్లూరులో జన్మించిన ఈమె 1992లో న్యాయవాదిగా నమోదై 2002 ఆగస్టు 21న జిల్లా జడ్జిగా ఎంపికయ్యారు. నిజామాబాద్‌, హైదరాబాద్‌, వరంగల్‌, విజయవాడ, కరీంనగర్‌, విశాఖపట్నం, హైదరాబాద్‌ సిటీ సివిల్‌ కోర్టు చీఫ్‌ జడ్జిగా, జ్యుడిషియల్‌ అకాడమి డైరెక్టర్‌గా, వ్యాట్‌ అప్పీలెట్‌ ట్రైబ్యునల్‌గా విధులు నిర్వహించారు.

సి.సుమలత: 1972 ఫిబ్రవరి 5న నెల్లూరులో జన్మించిన ఈమె.. 1995లో తిరుపతి పద్మావతి మహిళా యూనివర్సిటీ నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందగా.. రైట్‌ టు టైమ్‌లీ జస్టిస్‌ అనే అంశంపై నాగార్జున యూనివర్సిటీ నుంచి పీహెచ్‌డీ పొందారు. జిల్లా జడ్జిగా 2007లో ఎంపికైన సుమలత కర్నూలు, మదనపల్లె, అనంతపురం, గుంటూరుల్లో పనిచేసి.. జ్యుడిషియల్‌ అకాడమి డైరెక్టర్‌గా విధులు నిర్వహించగా.. ప్రస్తుతం సిటీ సివిల్‌ కోర్టు చీఫ్‌ జడ్జిగా కొనసాగుతున్నారు.

డాక్టర్‌ గురిజాల రాధారాణి: 1963 జూన్‌ 29 గుంటూరు జిల్లా తెనాలిలో జన్మించిన సుధారాణి.. 1989లో న్యాయశాస్త్రంలో పట్టా పొంది న్యాయవాదిగా, ఏపీపీగా విధులు నిర్వహించారు. 2008లో జిల్లా జడ్జిగా నియమితులై సంగారెడ్డి, నల్గొండ, సికింద్రాబాద్‌ ఫ్యామిలీ కోర్టు, నాంపల్లి కోర్టుల్లో పనిచేశారు. ప్రస్తుతం రంగారెడ్డి జిల్లా కోర్టు ప్రిన్సిపల్‌ జడ్జిగా విధులు నిర్వహిస్తున్నారు.

పి.మాధవిదేవి: 1965 డిసెంబరు 28న హైదరాబాద్‌లో జన్మించిన ఈమె.. గుల్బర్గాలో ఎల్‌ఎల్‌బీ.. ఉస్మానియాలో ఎల్‌ఎల్‌ఎం చేశారు. హైకోర్టులో ప్రాక్టీస్‌ చేపట్టిన మాధవీదేవి 2005లో ఇన్‌కంట్యాక్స్‌ అప్పీలెట్‌ ట్రైబ్యునల్‌ జ్యుడిషియల్‌ సభ్యులుగా సర్వీసులో చేరారు. ముంబయి, బెంగళూరుల్లో పనిచేసి ప్రస్తుతం హైదరాబాద్‌లో విధులు నిర్వహిస్తున్నారు.

ఎం.లక్ష్మణ్‌: 1965 డిసెంబరు 24న వికారాబాద్‌ జిల్లా వేల్చల్‌ గ్రామంలో జన్మించిన ఈయన.. 1991లో న్యాయవాదిగా నమోదయ్యారు. హైదరాబాద్‌, రంగారెడ్డి కోర్టులతో పాటు హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్‌ చేయగా.. జిల్లా జడ్జిగా ఎంపికై మహబూబ్‌నగర్‌, నిజామాబాద్‌, నాంపల్లిలోని ఆర్థికనేరాల ప్రత్యేక కోర్టు, వరంగల్‌, ఖమ్మం జిల్లాల్లో పనిచేశారు. ప్రస్తుతం కార్మిక న్యాయస్థానం కోర్టులో విధులు నిర్వహిస్తున్నారు.

ఎన్‌.తుకారాంజీ: 1973 ఫిబ్రవరి 24న హైదరాబాద్‌లో జన్మించిన ఈయన.. 1996లో న్యాయవాదిగా నమోదయ్యారు. హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లా కోర్టులతో పాటు పలు ట్రైబ్యునళ్లలో న్యాయవాదిగా ప్రాక్టీస్‌ చేసిన తుకారాంజీ.. 2007 జిల్లా జడ్జిగా ఎంపికై విశాఖపట్నం, ఏలూరు, రాజమహేంద్రవరంలలో పనిచేశారు. ప్రస్తుతం నాంపల్లి మెట్రోపాలిటన్‌ సెషన్స్‌ న్యాయమూర్తిగా ఉన్నారు.

ఎ.వెంకటేశ్వరరెడ్డి: 1961 ఏప్రిల్‌ 15న మహబూబ్‌నగర్‌ జిల్లాలో జన్మించిన ఈయన.. గుల్బర్గా యూనివర్సిటీ నుంచి 1986లో న్యాయశాస్త్రంలో పట్టా పొంది 1987లో బార్‌ కౌన్సిల్‌లో పేరు నమోదు చేసుకున్నారు. 1994 జూనియర్‌ సివిల్‌ జడ్జిగా.. 2005లో సీనియర్‌ సివిల్‌ జడ్జిగా.. 2012లో జిల్లా జడ్జిగా పదోన్నతి పొందారు. ఆదిలాబాద్‌, రంగారెడ్డి జిల్లా జడ్జిగా, సీఐడీ సలహాదారుగా, తెలంగాణ రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ సభ్యకార్యదర్శిగా విధులు నిర్వహించగా.. తెలంగాణ హైకోర్టు మొదటి రిజిస్ట్రార్‌ జనరల్‌గా విధులు చేపట్టి అందులోనే కొనసాగుతున్నారు.