Huzurabad : హుజూరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి ఎంపికపై టీపీసీసీ సరికొత్త వ్యూహం

హుజూరాబాద్ బై పోల్.. తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. టీఆర్‌ఎస్‌, బీజేపీలు తమ అభ్యర్ధులను ప్రకటించాయి. బీజేపీ నుంచి ఈటల, టీఆర్ఎస్ నుంచి గెల్లు శ్రీనివాస్ బరిలో ఉన్నారు.

Huzurabad : హుజూరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి ఎంపికపై టీపీసీసీ సరికొత్త వ్యూహం

Congress

Congress candidate selection : తానొకటి తలిస్తే.. దైవం మరొకటి తలచినట్లు ఉంది ఆ జిల్లాలో ఓ పార్టీ పరిస్థితి. బైపోల్ బరిలో అధినాయకత్వం ఒకరిని దింపుదామనుకుంటే.. కేడర్ అందుకు మోకాలొడ్డింది. నాన్ లోకల్ అభ్యర్ధి తమకొద్దని కుండబద్ధలు కొట్టేసింది. మా జిల్లాలో అభ్యర్ధులు లేరా.. మేం పోటికి పనికి రామా అని ప్రశ్నించడంతో రాష్ట్ర నాయకత్వం తొలుత డైలమాలో పడింది. ఆ తర్వాత కొత్త ట్రెండ్ సెట్ చేస్తూ ఓ నిర్ణయం తీసుకుంది. ఇంతకీ ఆ నిర్ణయం ఏంటి? ఆ పార్టీ ఏది?

కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ బై పోల్.. తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. టీఆర్‌ఎస్‌, బీజేపీలు ఇప్పటికే తమ అభ్యర్ధులను ప్రకటించేశాయి. బీజేపీ నుంచి ఈటల రాజేందర్ బరిలో నిలవగా.. టీఆర్ఎస్ అభ్యర్ధిగా గెల్లు శ్రీనివాస్ యాదవ్‌ పోటీ చేస్తున్నారు. నోటిఫికేషన్ రాకున్నా వాళ్లిద్దరూ ఇప్పటికే ప్రచారంతో హోరెత్తిస్తున్నారు. అయితే బైపోల్ రేసులో.. కాంగ్రెస్ పార్టీ ఇంత వరకు తమ అభ్యర్ధిని ప్రకటించలేదు. కౌశిక్ రెడ్డి టీఆర్ఎస్‌లో చేరడంతో.. అభ్యర్ధి కోసం కాంగ్రెస్ వెతుకులాట ప్రారంభించింది. తొలుత తెరపైకి చాలా పేర్లు వచ్చినా.. చివరకు కొండా సురేఖ పేరు ఫైనల్ అనే ప్రచారం జరిగింది. అంతలోనే కొండా అభ్యర్ధిత్వానికి బ్రేక్ పడినట్లు గాంధీభవన్ నుంచి వార్తలు వచ్చాయి. కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ నేతల అభ్యంతరమే ఇందుకు కారణంగా తెలుస్తోంది.

కొండా సురేఖ అభ్యర్థిత్వాన్ని జిల్లాకు చెందిన ముఖ్య నాయకులతోపాటు….. ఎమ్మెల్యే టిక్కెట్‌ రేస్‌లో ఉన్న ఆశావహులు వ్యతిరేకించారు. నాన్‌ లోకల్‌ నాయకులకు కాకుండా… లోకల్‌ వారికే ప్రాధాన్యత ఇవ్వాలంటూ రేవంత్‌రెడ్డికి తమ అభిప్రాయాలు విన్నవించారు. ఇటీవలే జిల్లాకు వచ్చిన కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్‌ మాణిక్కం ఠాగూర్‌ ముందూ ఇదే డిమాండ్‌ పెట్టారు. దీంతో హస్తం అభ్యర్థిని ప్రకటించకుండానే సమావేశం ముగించుకుని వెనుదిరిగారు మాణిక్కం ఠాగూర్‌.

అభ్యర్థులను ఎంపిక చేయడానికి టీపీసీసీ సరికొత్త ప్లాన్‌ రూపొందించింది. హుజూరాబాద్‌ ఉప ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే ఆశావహుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. దరఖాస్తుతో పాటుగా 5వేల రూపాయల డిమాండ్‌ డ్రాఫ్ట్‌ తీయాలని కండిషన్‌ పెట్టింది. బయోడేటాతోపాటు.. పాస్‌పోర్టు సైజ్‌ ఫోటోను జతచేసి దరఖాస్తు ఫారాలను జిల్లా కాంగ్రెస్‌ కార్యాలయంలో అందించాలని ప్రకటించింది. దీంతో ఆశావహులంతా అప్లికేషన్స్‌తో క్యూ కడుతున్నారు. ఈనెల 1వ తేదీన మొదలైన ఈ ప్రక్రియ ఈనెల 5తో ముగియనుంది. అనంతరం వచ్చిన దరఖాస్తులను పరిశీలన చేసి.. సెప్టెంబర్‌ 10 తర్వాత అభ్యర్థి పేరును ప్రకటించే అవకాశముంది.

నిరుద్యోగుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించినట్టుగా… హస్తం పార్టీలోనూ అదే పాలసీని ఫాలో అవుతుండడం చర్చనీయాంశంగా మారింది. అయితే అభ్యర్థుల ఎంపికలో ఎలాంటి అంశాలను ప్రామాణికంగా తీసుకుంటారు, ఎంపికైన అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారా, లేదా అనే సందేహాలు కాంగ్రెస్‌ శ్రేణుల్లో నెలకొన్నాయి. రాజకీయాల్లో కొత్త ట్రెండ్‌ సెట్‌ చేయాలనుకుంటున్న హస్తం పార్టీకి.. ఈ విధానం కలిసి వస్తుందా, దరఖా స్తు చేసుకున్న వారిలోనే అభ్యర్థిని ఫైనల్‌ చేస్తారా లేక చివరి నిముషంలో కొత్త పేరును తెరపైకి తెస్తారా అన్నది మాత్రం ఈనెల 10 తర్వాతే తేలనుంది.