union budget 2023 live updates: పార్లమెంట్‌లో బడ్జెట్ ప్రవేశపెడుతున్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. Live Updates
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో నేడు సాధారణ బడ్జెట్ 2023-24ను ప్రవేశపెట్టనున్నారు. సరిగ్గా ఉదయం 11 గంటలకు ఆమె బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభిస్తారు.

union budget 2023 live updates: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో నేడు సాధారణ బడ్జెట్ 2023-24ను ప్రవేశపెట్టారు. సరిగ్గా ఉదయం 11 గంటలకు ఆమె బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభించారు. 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు పూర్తిస్థాయి బడ్జెట్ కావటంతో అన్ని వర్గాల ప్రజలు బడ్జెట్ పై ఆశగా ఎదురు చూస్తున్నారు. వ్యవసాయం, విద్య, రక్షణ , వైద్యం, పరిశ్రమలు, రైల్వేలు, దాదాపు అన్ని ముఖ్యమైన రంగాలకు ఎలాంటి కేటాయింపులు చేస్తుందని ఆశగా ఎదురు చూస్తున్నారు. దీనికితోడు బడ్జెట్ లో ఏ రంగానికి కేంద్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుందోనన్న ప్రశ్నలు అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
LIVE NEWS & UPDATES
-
ఏ వస్తువుల ధరలు పెరగుతాయి.. ఏవి తగ్గుతాయి..
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సాధారణ బడ్జెట్ ను పార్లమెంట్ లో సమర్పించారు. ఈ సార్వత్రిక బడ్జెట్ లో ఏయే వస్తువులు తక్కువ ధరకు లభిస్తున్నాయో, ఏయే వస్తువులు ఎక్కువ ఖర్చు అవుతున్నాయో కూడా చెప్పారు.
ధరలు తగ్గే వస్తువులు ..
మొబైల్ విడిభాగాలపై, టీవీలు, ఎలక్ట్రిక్ వస్తువులు, టీవీ ప్యానెళ్లపై కస్టమ్ డ్యూటీ తగ్గింపు చేశారు. దీంతో వీటి ధరలు భారీగా తగ్గే అవకాశం ఉంది. కిచెన్ చిమ్నీలు, హీట్ కాయిల్స్, కెమెరా లెన్స్ ధరలు తగ్గనున్నాయి. బయోగ్యాస్‌కు సంబంధించిన కొన్ని విడిభాగాలపై కస్టమ్ డ్యూటీ తగ్గించబడింది. అదేవిధంగా ఎలక్ట్రిక్ కార్లు, బొమ్మలు, సైకిళ్లు చౌకగా వస్తాయి.ధరలు పెరిగే వస్తువులు..
సింగరేట్ ధరలు భారీగా పెరిగాయి. వీటిపై సుంకం 16శాతంకి పెంపు చేశారు. బ్రాండెడ్ దుస్తుల ధరలు పెరగనున్నాయి. వాహనాలు టైర్లు, విదేశాల నుంచి దిగుమతి అయ్యే రబ్బరు ధరలు పెరగనున్నాయి. బంగా, వెండి ధరల విషయానికి వస్తే.. బంగారం, వెండి ధరలపై కస్టమ్స్ డ్యూటీ పెంచుతున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు.
-
ముగిసిన కేంద్ర ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రసంగం ..
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ 2023-24 సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ ను పార్లమెంట్ హాల్ లో ఉదయం 11 గంటలకు ప్రారంభించారు. 1.26 నిమిషాల పాటు ఆమె బడ్జెట్ ప్రసంగం సాగింది.
-
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో ప్రత్యక్ష పన్నుపై ప్రస్తావిస్తూ పన్ను పోర్టల్ లో రోజుకు 72లక్షల దరఖాస్తులు వస్తున్నాయని తెలిపారు. రీఫండ్ ప్రక్రియను 16రోజుల వరకు తీసుకొచ్చామని అన్నారు. ఇందులో మరింత మెరుగుపడే దిశగా ముందుకు సాగుతున్నామని ఆమె తెలిపారు. పన్ను చెల్లింపుదారుల ఫిర్యాదుల పరిష్కారం మెరుగుపడిందని అన్నారు. సాధారణ ఐటీ రిటర్న్ ఫారమ్ లు వస్తాయి, ఇది రిటర్న్ ఫైలింగ్ ను సులభతరం చేస్తుందని తెలిపారు.
-
వేతన జీవులకు భారీ ఊరట..
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ లో వేతన జీవులకు భారీ ఊరట కల్పించారు. ఇన్‌కమ్ ట్యాక్స్ స్లాబుల్లో మార్పులు చేశారు. ప్రస్తుతం ఉన్న రూ. 5లక్షల ఆదాయపు పన్ను పరిమితిని రూ. 7లక్షలకు పెంచుతున్నట్లు ప్రకటించారు. అయితే, ఇది కొత్త ఆదాయపు పన్ను విధానాన్ని ఎంచుకున్న వారికి మాత్రమే వర్తిస్తుంది.
ఇన్‌కమ్ ట్యాక్స్ స్లాబుల్లో మార్పులు ఇలా..
రూ. 3 లక్షల వరకు ఆదాయంపై ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు.
3 నుంచి 6 లక్షల రూపాయల మధ్య ఆదాయంపై 5శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది.
6 నుంచి 9 లక్షల మధ్య ఆదాయంపై 10 శాతం.
9 నుంచి 12 లక్షల మధ్య ఆదాయంపై 15 శాతం.
12 నుంచి 15 లక్షల మధ్య ఆదాయంపై 20 శాతం.
15 లక్షల కంటే ఎక్కువ ఆదాయంపై 30 శాతం ఆదాయపు పన్నుచెల్లించాల్సి ఉంటుంది.2023-24 budget
-
మహిళల కోసం ప్రత్యేక పథకం..
ఆజాదీకా అమృత్ మహోత్సవ్ లో భాగంగా మహిళల కోసం కొత్త పొదుపు పథకం వస్తుందని ఆర్థిక మంత్రి తెలిపారు. ఇందులో రెండు సంవత్సరాల పాటు పెట్టుబడి పెట్టవచ్చునని, అంతేకాదు.. 2లక్షల వరకు గరిష్టంగా డిపాజిట్ చేయవచ్చునని తెలిపారు. డిపాజిట్ సొమ్ముపై 7.5 శాతం స్థిర వడ్డీ ఇవ్వబడుతుందని అన్నారు. ఏదైనా మహిళ, అమ్మాయి ఖాతా ద్వారా డిపాజిట్ చేయొచ్చు. దాని నుండి డబ్బును విత్‌డ్రా చేసుకునేందుకు షరతులు ఉంటాయి. ఈ బడ్జెట్‌లో మహిళా సంక్షేమానికి ఇదో పెద్ద ముందడుగు అని నిర్మలా సీతారామన్ తెలిపారు.
-
‘పొలిటికల్’ వెహికిల్ అనడంతో.. సభలో నవ్వులే నవ్వులు ..
పార్లమెంట్‌లో నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగం చేస్తుండగా సరదా సన్నివేశం చోటు చేసుకుంది. తుక్కు విధానం గురించి ఆమె ప్రకటన చేస్తూ పొల్యూటెడ్ వెహికల్ అనబోయి.. ‘పొలిటికల్’ అని పలికారు. దీంతో పార్లమెంట్ హాల్ లో ఉన్న అధికార, విపక్ష సభ్యులు ఒక్కసారిగా నవ్వారు. దీంతో.. కేంద్ర ఆర్థిక మంత్రి ప్రసంగంతో సీరియస్‌గా సాగుతున్నసభలో ఒక్కసారిగా ఆహ్లాదకర వాతావరణం నెలకొంది. వెంటనే పొరపాటును గమనించిన నిర్మలమ్మ సైతం నవ్వుతూ తప్పును సవరించుకుని తన ప్రసంగాన్ని కొనసాగించారు.
-
గ్రీన్ గ్రోత్‌పై ప్రభుత్వం దృష్టి ..
ప్రజలకు హరిత ఉద్యోగావకాశలు కల్పించామని, దేశ, విదేశీ పర్యాటకులు పర్యాటకంలో గణనీయమైన సహకారం అందించారని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్‌షిప్ ద్వారా టూరిజం ప్రమోషన్ కొత్త స్థాయికి తీసుకెళ్లబడిందని తెలిపారు. నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ కోసం ప్రభుత్వం రూ. 19700 కోట్లు కేటాయించిందని తెలిపారు. వెహికల్ రీప్లేస్‌మెంట్ పాలసీ ప్రకారం.. హరిత వాతావరణం కోసం కాలుష్య వాహనాలను మార్చడం, స్క్రాప్ చేయడం అవసరం అన్నారు. ఇందుకోసం.. పాత వాహనాలను మార్చడానికి వీలుగా, రాష్ట్రాలకు సహాయం అందించబడుతుందని తెలిపారు. దీనిద్వారా పాత అంబులెన్స్‌లను కూడా భర్తీ చేస్తారని, ఈ విధానం ద్వారా కాలుష్యాన్ని తగ్గించడంలో సహాయపడుతుందని కేంద్ర ఆర్థిక మంత్రి తెలిపారు.
-
నూతనంగా ఇల్లు కొనుగోలు, నిర్మాణం చేసుకోవాలని అనుకునే వారికి కేంద్ర ఆర్థిక మంత్రి శుభవార్త చెప్పారు. పీఎం ఆవాస్ యోజన పథకానికి ఈసారి బడ్జెట్ లో నిధులు పెంచారు. గత బడ్జెట్ పీఎం ఆవాస్ యోజనకు రూ. 48వేల కోట్లు కేటాయించగా, ఈ ఏడాది ఆ మొత్తాన్ని రూ. 79వేల కోట్లకు పెంచారు. వడ్డీ రేట్లు పెరిగిన వేళ గృహ కొనుగోలు దారులకు ఇది ఊరట కల్పించే అంశం.
-
రైల్వేకు రూ. 2.40 లక్షల కోట్లు..
రైల్వేకు రూ. 2.40 లక్షల కోట్లు ఇస్తున్నామని కేంద్ర ఆర్థిక మంత్రి తెలిపారు. ఇది రైల్వేకు అత్యధిక బడ్జెట్ అని అన్నారు. 2014 బడ్జెట్ తో పోల్చుకుంటే ఈ బడ్జెట్ తొమ్మిది రెట్లు ఎక్కువ అన్నారు. కొత్త రైల్వే లైన్ల నిర్మాణానికి పెద్దపీట వేస్తామని తెలిపారు. మౌలిక వసతుల అభివృద్ధికి 33శాతం అధికంగా నిధులు కేటాయిస్తున్నామని అన్నారు. మూలధనం వ్యయం కోసం బడ్జెట్‌లో 10 లక్షల కోట్లు కేటాయిస్తున్నట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు.
-
పంచాయతీల స్థాయిలో గిడ్డంగుల నిర్మాణం ..
రైతులు తమ ఉత్పత్తుల నిల్వకోసం పంచాయతీల స్థాయిలో మరిన్ని గిడ్డంగులు నిర్మాణం చేయడం జరుగుతుందని కేంద్ర ఆర్థిక మంత్రి తెలిపారు. అదేవిధంగా పీఎం మత్స్య సంపద యోజనకోసం అదనంగా రూ.6వేల కోట్లు, వ్యవసాయ రుణాలు రూ. 20లక్షల కోట్ల వరకూ లక్ష్యంగా పెట్టుకోవటం జరిగిందని తెలిపారు.
-
ఏడు అంశాలకు బడ్జెట్ ప్రాధాన్యం
సప్త రుషుల రీతిలో ఏడు అంశాలకు బడ్జెట్ ప్రాధాన్యం ఇస్తున్నట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు. వ్యవసాయ కోసం డిజిటల్ ప్రభుత్వ మౌలిక సదుపాయాలు, వ్యవసాయ రంగానికి రుణ సదుపాయం, మార్కెటింగ్ సదుపాయం, వ్యవసాయ స్టార్టప్స్ కు చేయూత, ప్రత్యేక నిధి ఏర్పాటు చేస్తామని తెలిపారు. అదేవిధంగా రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి చర్యలు, పత్తి సాగు పెరుగుదలకోసం ప్రత్యేక చర్యలు, పత్తికోసం ప్రత్యేకంగా మార్కెటింట్ సదుపాయం ఏర్పాటు చేయడం జరుగుతుందని నిర్మలా సీతారామన్ అన్నారు. అదేవిధంగా ఆత్మ నిర్భర్ భారత్ క్లీన్ పథకం కింద ఉద్వానవన పంటలకు చేయూత ఇవ్వటం జరుగుతుందని అన్నారు. చిరు ధాన్యాల పంటలకు సహకారం అందివ్వడంకోసం శ్రీఅన్న పథకం అమలు చేయడం జరుగుతుందని, ఇందులో రాగులు, జోన్నలు, సజ్జలు తదితర పంటలకు ప్రోత్సాహం అందివ్వటం జరుగుతుందని ఆర్థిక మంత్రి తెలిపారు. శ్రీఅన్న పథకం కోసం హైదరాబాద్ కేంద్రంగా పరిశోధనలు చేయడం జరుగుతుందని నిర్మలా సీతారామన్ తెలిపారు.
-
పర్యాటక రంగాన్ని ప్రోత్సహించేలా సంస్కరణలు చేస్తున్నామని నిర్మలా సీతారామన్ అన్నారు. క్లీన్ ప్లాంట్ పథకానికి రూ. 2వేల కోట్లు కేటాయిస్తున్నామని అన్నారు.
-
కిసాన్ సమ్మాన్ నిధిని పెంచుతున్నాం.
వ్యవసాయ రంగంలో రూ. 20లక్షల కోట్ల అభివృద్ధే లక్ష్యం. పాడి, మత్స్య రంగాల అభివృద్ధికి కృషి చేస్తున్నాం. చిరుధాన్యాల ఉత్పత్తిలో ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉన్నాం. చిరు ధాన్యాల ఎగమతుల్లో మనది రెండో స్థానం. రైతులు, మహిళలు, యువత, వెనుకబడిన వర్గాలకు బడ్జెట్ లో ప్రాధాన్యత ఇస్తున్నాం. కిసాన్ సమ్మాన్ నిధిని పెంచుతున్నామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. సహకార సంఘాలకు రూ. 2516 కోట్లు కేటాయింపు. ఫిషరీస్, డైయీరీ సొసైటీలకు అండగా సర్కార్.
-
భారతదేశం తలెత్తుకుని నిలబడుతోంది. అమృత కాలంలో ఇది తొలి బడ్జెట్. 2022 డిజిటల్ చెల్లింపులు బాగా పెరిగాయి. సమష్టి ప్రగతి దిశగా భారత్ కదులుతోంది. స్వచ్ఛ భారత్ లో భాగంగా 11.7 కోట్లతో టాయిలెట్స్ నిర్మాణం చేపట్టాం.
-
ప్రభుత్వం 220 కోట్ల కోవిడ్ వ్యాక్సిన్‌లను పొందింది. 44.6 కోట్ల మంది ప్రజలు పీఎం సురక్ష, పీఎం జీవన జ్యోతి యోజన ద్వారా లబ్ధి పొందారు. ప్రధాన మంత్రి కిషాన్ సమ్మాన్ నిధి ద్వారా కోట్లాది మంది రైతులు లబ్ధి పొందుతున్నారు. ప్రజా భాగస్వామ్యంతో ప్రభుత్వం సబ్ కా సాథ్, సబ్ కా వికాస్ ద్వారా ముందుకు సాగింది. 28 నెలల్లో 80 కోట్ల మందికి ఉచిత ఆహార ధాన్యాలు ఇచ్చాం.
-
ఈ బడ్జెట్ రాబోయే 25 సంవత్సరాలకు బ్లూ ఫ్రింట్. కొవిడ్ వ్యాక్సినేషన్ డ్రైవ్ దేశాన్ని కొత్త స్థాయికి తీసుకెళ్లింది. ప్రపంచం భారతదేశ బలాన్ని గుర్తించింది.
-
బడ్జెట్‌లో మేం ప్రతి వర్గాన్ని సంతృప్తి పర్చేందుకు ప్రయత్నించాం. ముఖ్యంగా యువతకు, అన్ని తరగతుల ప్రజలకు ఆర్థిక బలాన్ని అందించేందుకు కృషి చేశాం. ప్రపంచంలో మందగమనం ఉన్నప్పటికీ మన ప్రస్తుత వృద్ధి అంచనా దాదాపు 7శాతంగా ఉంది. భారతదేశం సవాలు సమాయాల్లో వేగంగా అభివృద్ధి చెందుతోంది.
-
కరోనా కాలంలో ఎవరూ ఆకలితో బాధపడకుండా చూశాం. ఉచిత ఆహార పథకం 2024 వరకు కొనసాగుతుంది.
-
భారత ఆర్థిక వ్యవస్థ వెలుగుతున్న నక్షత్రం..
పార్లమెంట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఒక వెలుగుతున్న నక్షత్రమని ప్రపంచం గుర్తించిందని అన్నారు. మన ఆర్థిక వ్యవస్థ 7శాతం చొప్పున వృద్ధి చెందుతుందని విశ్వసిస్తున్నామని, ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థలోనే అత్యధికం అని నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో ప్రస్తావించారు.
-
పార్లమెంట్ లో బడ్జెట్ ప్రవేశపెడుతున్న ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్
-
2023 - 24 కేంద్ర బడ్జెట్‌కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఉదయం 11గంటలకు లోక్‌సభలో నిర్మలా సీతారామన్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.
-
ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ ఐదోసారి వరుసగా బడ్జెట్ ప్రవేశ పెట్టనున్నారు. ఈసారికూడా కాగిత రహిత బడ్జెట్‌నే ప్రవేశపెట్టనున్నారు. కరోనా దృష్ట్యా గత రెండేళ్లుగా కాగిత రహిత బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. ఇదే సంప్రదాయాన్ని నిర్మల సీతారామన్ ఈసారీకూడా కొనసాగించనున్నారు. బడ్జెట్ ట్యాబ్‌ను ఎరుపు రంగు పౌచ్‌లో ఉంచి తీసుకొచ్చారు.
-
దేశంలోని అన్ని వర్గాల ప్రజల ఆమోదయోగ్యంగా 2023-24 బడ్జెట్ ఉంటుందని ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌధరీ తెలిపారు. అందరి అంచనాలకు తగ్గట్లే బడ్జెట్‌ను రూపొందించినట్లు ఆయన చెప్పారు.
-
ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఉదయం 11గంటలకు పార్లమెంట్ లో బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. ఈ మేరకు ఆమె పార్లమెంట్ భవనానికి చేరుకున్నారు. ప్రధాని మోదీతో ప్రత్యేకంగా భేటీ కానున్నారు. మరికొద్ది సేపట్లో పార్లమెంట్‌లో ప్రధాని మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ భేటీ ఉంటుంది. బడ్జెట్ కు ఆమోదం తెలపనున్న కేబినెట్. ఆ తరువాత పార్లమెంట్ లో నిర్మలా సీతారామన్ బడ్జెట్‌ను ప్రవేశపెడుతారు.
-
రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సమావేశమయ్యారు. ఆమెతోపాటు ఆర్థిక శాఖ సహాయ మంత్రులు భగవత్ కరాద్, పంకజ్ చౌదరి, ఆర్థిక మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారులు రాష్ట్రపతి భవన్‌కు వెళ్లి ద్రౌపది ముర్ముతో సమావేశమైన వారిలో ఉన్నారు. 2023-2024 బడ్జెట్ కు సంబంధించిన సమాచారాన్ని రాష్ట్రపతికి వారు తెలియజేశారు.
-
పార్లమెంట్ లో ఉదయం 11గంటలకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఈ సందర్భంగా, బడ్జెట్‌కు ముందు స్టాక్ మార్కెట్‌లలో సానుకూల స్పందన కనిపిస్తుంది. కొంతమేర లాభాలతో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 378.32 పాయింట్లు అంటే 0.64శాతం లాభంతో 59,928,22 వద్ద ట్రేడ్ అవుతోంది. నిఫ్టీ 109.95 పాయింట్ల లాభంతో 0.62 శాతంతో 17,772.10 వద్ద కొనసాగుతోంది.
-
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ రాష్ట్రపతి భవన్ కు బయల్దేరి వెళ్లారు. అక్కడ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు బడ్జెట్ కాపీని అందజేశారు.
Delhi | Finance Minister Nirmala Sitharaman all set to present the Union Budget 2023 at 11am today
This is the BJP government's last full Budget before the 2024 general elections. pic.twitter.com/m2NRMHW7Ut
— ANI (@ANI) February 1, 2023
-
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఉదయం 8.40 గంటలకు నార్‌బ్లాక్‌లోని కార్యాలయానికి చేరుకోనున్నారు. ఉదయం 9గంటలకు నార్త్ బ్లాక్ నుంచి రాష్ట్రపతి భవన్ కు బయలుదేరుతారు. ఉదయం 9.45 గంటలకు బడ్జెట్ కాపీతో రాష్ట్రపతిని కలుస్తారు. ఉదయం 10గంటలకు బడ్జెట్ ప్రతులతో పార్లమెంట్ భవనానికి చేరుకుంటారు. ఉదయం 10.15 గంటలకు క్యాబినెట్‌లో బడ్జెట్ అధికారికంగా ఆమోదం లభించిన తరువాత.. 11 గంటలకు ఆర్థిక శాఖ మంత్రి పార్లమెంట్ లో తన బడ్జెట్ ప్రంగాన్ని ప్రారంభిస్తారు.