UP Election 2022 : అప్నాదళ్, నిషాద్ పార్టీలతో పొత్తు ప్రకటించిన బీజేపీ

వచ్చే ఏడాది జరుగనున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులకు బీజేపీ చురుకుగా పావులు కదుపుతోంది. అప్నాదళ్, నిషద్ పార్టీలతో తాజాగా పొత్తులు ఖరారు చేసింది.

UP Election 2022 : అప్నాదళ్, నిషాద్ పార్టీలతో పొత్తు ప్రకటించిన బీజేపీ

Bjp

UP Election 2022 వచ్చే ఏడాది జరుగనున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులకు బీజేపీ చురుకుగా పావులు కదుపుతోంది. అప్నాదళ్, నిషద్ పార్టీలతో తాజాగా పొత్తులు ఖరారు చేసింది. శుక్రవారం నిషాద్‌ పార్టీ జాతీయ అధ్యక్షుడు డాక్టర్‌ సంజయ్‌ కుమార్‌ నిషాద్‌తో సమావేశమైన బీజేపీ అగ్రశ్రేణి నాయకత్వం సీట్ల భాగస్వామ్యానికి సంబంధించి చర్చించింది. అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని ఆ రెండు పార్టీలు నిర్ణయానికి వచ్చాయి. దీనికి సంబంధించిన వివరాలను యూపీ బీజేపీ ఎన్నికల ఇన్‌చార్జి ధర్మేంద్ర ప్రధాన్‌ మీడియాకు వెల్లడించారు.

పలు పార్టీలు తమతో కలిసి పోటీ చేసేందుకు సంసిద్ధత వ్యక్తం చేశాయని, అయితే, గతంలో మాదిరిగానే నినిషాద్‌ పార్టీ, అప్నాదళ్‌తో తమ బంధం కొనసాగుతుందని చెప్పారు. అప్నాదళ్, నిషద్ పార్టీలతో కుదిరిన ఎన్నికల ఒప్పందంతో వచ్చే ఎన్నికల్లో బీజేపీ మరింత బలం పుంజుకోనుందని చెప్పారు. యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలో ప్రజా సమస్యల పరిష్కారం జరిగిందని, తాను యూపీలో పర్యటించి ప్రజలను కలుసుకున్నానని, గతంలో కన్నా ఎక్కువ సీట్లలో బీజేపీని ప్రజలు గెలిపిస్తారనే బలమైన నమ్మకం తనకు ఉందని ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు.

ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో నిషద్ పార్టీ,అప్నాదళ్ తో కలిసి యూపీ ఎన్నికల్లో బీజేపీ పోటీ చేయనుందని యూపీ బీజేపీ చీఫ్ స్వతంత్ర దేవ్ సింగ్ తెలిపారు. బీజేపీ, అప్నాదళ్, నిషద్ పార్టీల మధ్య సీట్ల షేరింగ్‌‌పై వివరాలు చెప్పేందుకు స్వతంత్ర దేవ్ సింగ్ నిరాకరించారు.

కాగా,నిషాద్‌ పార్టీతో పొత్తు కారణంగా యూపీలో నిషాద్‌ కమ్యూనిటీ ఓటర్లు బీజేపీకి మద్దతు ఇస్తారని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. నిషాద్‌ పార్టీ 10 కంటే ఎక్కువ సీట్లను ఆశిస్తున్నట్లు సమాచారం. తాము గౌరవప్రదమైన సీట్లను ఆశిస్తున్నామని, అయితే, 14 వెనుకబడిన తరగతుల వారికి రిజర్వేషన్లు తీసుకొస్తామని కేంద్రం, రాష్ట్రప్రభుత్వం హామీ ఇవ్వడమే తమకు ముఖ్యమని నిషాద్‌ పార్టీ అధినేత డాక్టర్‌ సంజయ్‌ కుమార్‌ నిషాద్‌ అన్నారు.

మరోవైపు,గురువారం రాత్రి సీఎం యోగి అధికారిక నివాసంలో బీజేపీ కోర్‌ కమిటీ సమవేశం జరిగింది. యోగి ఆదిత్యనాథ్‌తోపాటు రాష్ట్ర ఇంఛార్జీ రాధా మోహన్‌సింగ్‌, రాష్ట్ర అధ్యక్షుడు స్వతంత్రదేవ్‌ సింగ్‌, రాష్ట్ర ఎన్నికల ఇంఛార్జీ ధర్మేంద్ర ప్రధాన్‌, ఉప ముఖ్యమంత్రి కేశవ్‌ ప్రసాద్‌ మౌర్య, డాక్టర్‌ దినేశ్‌ శర్మ, రాష్ట్ర ప్రధానకార్యదర్శి సునీల్‌ బన్సల్‌ తదితరులు హాజరయ్యారు. ఈ సమావేశంలో రానున్న అసెంబ్లీ ఎన్నిలక ప్రచారం, కార్యక్రమాలతో పాటు పార్టీలతో ఎన్నికల పొత్తు విషయాలపై చర్చించినట్లు తెలుస్తోంది.

READ Delhi Court : కోర్టులో గ్యాంగ్‌‌స్టర్‌‌ల మధ్య కాల్పులు, జితేందర్ గోగి హతం