Vizag Steel Plant : లాభాల బాటలో విశాఖ ఉక్కు

లాభాలు రావడం లేదన్నారు.. ఇక భరించలేం అన్నారు.. ప్రైవేటీకరణ చేస్తామంటూ ప్రకటించారు.. కానీ, తలచుకుంటే రికార్డులు క్రియేట్ అవుతాయని నిరూపించారు విశాఖ ఉక్కు కార్మికులు.

Vizag Steel Plant : లాభాల బాటలో విశాఖ ఉక్కు

Vizag Steel Plant

Vizag Steel Plant : లాభాలు రావడం లేదన్నారు.. ఇక భరించలేం అన్నారు.. ప్రైవేటీకరణ చేస్తామంటూ ప్రకటించారు.. కానీ, తలచుకుంటే రికార్డులు క్రియేట్ అవుతాయని నిరూపించారు విశాఖ ఉక్కు కార్మికులు. గతంలో ఎప్పుడూ లేనంత టర్నోవర్‌ సాధించి.. కొత్త రికార్డులు క్రియేట్ చేశారు.. విశాఖ ఉక్కు బంగారు బాతు అని నిరూపించారు.

ఆంధ్రుల హక్కైన విశాఖ ఉక్కు.. రికార్డుల దుమ్ము దులిపింది. నష్టాల వస్తున్నాయని ప్రైవేటీకరణకు పూనుకున్న కేంద్రానికి షాకిస్తూ.. గతంలో ఎన్నడూ లేనంతగా అన్నివిభాగాల్లో టర్నోవర్ సాధించింది వైజాగ్ స్టీల్ ప్లాంట్. ఏడాది కాలం నుంచి నిరంతర పోరాటం చేస్తూనే.. ఉక్కు సంకల్పంతో ఉత్పత్తి పెంచారు కార్మికులు. ఉక్కు ఉత్పత్తి, అమ్మకాలు, ఎగుమతులు, ఇలా అన్ని విభాగాల్లో దుమ్మురేపింది విశాఖ స్టీల్‌ ప్లాంట్. ముడి ఉక్కు, హాట్ మెటల్, అమ్మకం ఉక్కు.. ఇలా అన్ని రకాల స్టీల్‌ ఉత్పత్తి పెరిగింది. గత ఏడాదితో పోలిస్తే కళ్లు చెదిరే అమ్మకాలు సాగించింది.

2020-21తో పోలిస్తే.. 2021-22లో స్టీల్ ప్లాంట్ సేల్స్ 56 శాతం పెరిగాయి. గతేడాది సేల్స్ టర్నోవర్ 17 వేల 956 కోట్లుగా ఉంటే.. ఈ ఏడాది 28 వేల 8 కోట్లకు పెరిగింది. బొగ్గు కొరత ఉన్నా.. కరోనా రెండో వేవ్ కల్లోలం సృష్టించినా.. ఇబ్బందులను అధిగమించి రికార్డు స్థాయి టర్నోవర్ సాధించింది. 2020-21లో 4.45 మిలియన్ టన్నుల ఉక్కు అమ్మకాలు జరిగితే.. 2021-22 ఆర్థిక సంవత్సరంలో 17 శాతం ఎక్కువగా 5.22 మిలియన్ టన్నుల అమ్మకాలు సాగించింది. 2020-21తో పోలిస్తే 2021-22లో ఉక్కు ఎగుమతులు భారీగా పెరిగాయి. 2020-21లో 4 వేల 95 కోట్ల విలువైన ఎగుమతులు జరిగితే.. 2021-22లో 5 వేల 607 కోట్ల విలువైన ఎగుమతులు జరిగాయి.
Also Read : AP New Districts : ఏపీలో 26 జిల్లాలు-తుది నోటిఫికేషన్ జారీ..రేపట్నుంచి కొత్త జిల్లాల పాలన
స్టీల్ ప్లాంట్ చరిత్రలోనే ఒక ఏడాదిలో తొలిసారి 28 వేల 8 కోట్ల అమ్మకాలు సాగించింది. 5.2 మిలియన్ టన్నుల ఉక్కు అమ్మింది. దేశీయంగానే అమ్మకాలతో 22 వేల 401కోట్ల ఆదాయం పొందింది. ఎగుమతులతో 5 వేల 607 కోట్లు సమకూర్చుకుంది. 670 కోట్ల మేర.. బై ప్రొడక్ట్ అమ్మకాలు సాగించింది. 5.773 మిలియన్ టన్నుల హాట్ మెటల్, 5.272 మిలియన్ టన్నుల ముడి ఉక్కు, 5.138 మిలియన్ టన్నుల సేలబుల్ స్టీల్‌ను ఉత్పత్తి చేసినట్టు తెలిపింది. ఇంతగా దూసుకెళ్తున్న విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటు పరం చేయొద్దంటున్నారు కార్మికులు. ప్రత్యేకంగా గనులు కేటాయిస్తే మరింత లాభాలు తెచ్చి పెడతామంటున్నారు. కేంద్ర ఖజానాకు బంగారు గుడ్లు పెట్టే బాతును.. ప్రైవేటు వ్యక్తుల చేతికి ఇవ్వొద్దని కోరుతున్నారు.