Wrestlers vs WFI: 2014లోనే రిటైర్ అవుదామనుకున్నాను: బ్రిజ్ భూషణ్
రాజకీయాల నుంచి ఎందుకు వైదొలగలేదో బ్రిజ్ భూషణ్ తెలిపారు.

Wrestling Federation chief Brij Bhushan
Wrestlers vs WFI: రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (WFI) చీఫ్, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ (Brij Bhushan Sharan Singh) కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయనపై మహిళా రెజ్లర్లు లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన ఇవాళ మీడియాతో మాట్లాడారు.
“రాజకీయాల నుంచి వైదొలగాలని 2014లోనే అనుకున్నాను. కానీ, 2014 లోక్‌సభ ఎన్నికల వేళ అమిత్ షా అందుకు నాకు అనుమతి ఇవ్వలేదు” అని బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ చెప్పారు. తనపై మహిళా రెజ్లర్లు చేస్తున్న ఆరోపణలపై బ్రిజ్ భూషణ్ స్పందిస్తూ… “ఎవరైనా అసత్యాలు చెప్పాలని నిర్ణయం తీసుకుంటే వారిని అలాగే ముందుకు వెళ్లనివ్వండి” అని అన్నారు.
కాగా, బ్రిజ్ భూషణ్ సింగ్ కు ఉత్తరప్రదేశ్ లో చాలా పాప్యులారిటీ ఉంది. బ్రిజ్ భూషణ్ ఆరు సార్లు ఎంపీగా గెలిచారు. అందులో 5 సార్లు బీజేపీ నుంచి, ఒకసారి సమాజ్ వాదీ పార్టీ నుంచి గెలుపొందారు. ఆయనకు హిందుత్వ ఇమేజ్ కూడా ఉంది.
వచ్చే ఏడాది లోక్ సభ ఎన్నికలు జరగాల్సి ఉన్న వేళ… బ్రిజ్ భూషణ్ పై రెజ్లర్లు చేస్తున్న ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. రెజ్లర్లు ఆరోపణలు చేస్తున్నా ఇప్పటికీ ఆయనపై బీజేపీ చర్యలు తీసుకోలేదు. జంతర్ మంతర్ వద్ద రెజ్లర్లు చేస్తోన్న ధర్నా కొనసాగుతోంది. రెజ్లర్ల నిరసనకు పలు పార్టీల నేతలు మద్దతు తెలిపారు.