వరంగల్ లో 9 మంది మర్డర్స్ మిస్టరీ : రంగంలోకి కేంద్ర హోం శాఖ..ఎవరు చంపేశారు ? 

  • Published By: madhu ,Published On : May 24, 2020 / 05:12 AM IST
వరంగల్ లో 9 మంది మర్డర్స్ మిస్టరీ : రంగంలోకి కేంద్ర హోం శాఖ..ఎవరు చంపేశారు ? 

వరంగల్‌ జిల్లా గొర్రెకుంటలో 9 మంది వలస కార్మికులది హత్యగా పోలీసులు నిర్థారణకు వచ్చారు. ఎవరో చంపి బావిలో పడేసి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. మరోవైపు గొర్రెకుంటలో 9 మంది డెత్‌ మిస్టరీపై కేంద్ర హోం శాఖ ఆరా తీసింది. వ్యవసాయ బావిలో తొమ్మిది మృతదేహాలు తేలిన ఘటన ఇంకా మిస్టరీగానే ఉంది. ఈ మేరకు సెంట్రల్‌ ఇంటెలిజెన్స్‌ ఎస్పీ, ఇద్దరు ఇన్‌స్పెక్టర్లు గొర్రెకుంటలోని బావిని పరిశీలించారు. తొమ్మిది మృతదేహాలు ప్రాణాలతో ఉండగానే బావిలో పడి చనిపోయినట్లు ఫోరెన్సిక్‌ ప్రాథమిక నివేదికలో తేల్చారు. 

దొరికిన రెండు సెల్ ఫోన్లు : – 
ఈ కేసులో మూడు రోజులు గడిచినా పెద్దగా పురోగతి లేదు. ఈ నేపథ్యంలో పలు కోణాల్లో విచారణ జరుపుతున్న పోలీసు ప్రత్యేక బృందాలు ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇందులో ఒకరు బుస్రా ఖాతూన్‌ ప్రియుడు యాకూబ్‌ కాగా, మరో ఇద్దరు బీహార్‌కు చెందిన కార్మికులు. యాకూబ్‌ను శుక్రవారమే అదుపులోకి తీసుకోగా,  శనివారం బీహార్‌కు చెందిన సంజయ్‌ కుమార్‌ యాదవ్, మంకుషాను అదుపులోకి తీసుకున్నారు. ఇదే సమయంలో ప్రత్యేక దర్యాప్తు బృందాలకు రెండు సెల్‌ఫోన్లు దొరికినట్లు సమాచారం. ఆ రెండింటిలో ఒకటి మక్సూద్‌ది కాగా, మరొకటి బుస్రా ఖాతూన్‌దిగా తెలుస్తోంది. ఆ రెండు ఫోన్ల కాల్‌డేటా వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. అయితే మక్సూద్‌ సెల్‌ఫోన్‌ వరంగల్‌ నగరానికి 30 కిలోమీటర్ల దూరంలో స్విఛ్‌ ఆఫ్‌ అయినట్లు తెలుస్తోంది. వర్ధన్నపేట మండలం నందనం వద్ద సెల్‌ సిగ్నల్‌ ట్రేస్‌ చేసినట్లు సమాచారం. 

పోలీసుల అదుులో ముగ్గురు అనుమానితులు : – 
ముగ్గురు ఆనుమానితులను అదుపులోకి తీసుకున్న సిట్‌ పోలీసులు, శనివారం గొర్రెకుంటలోని బావి వద్ద పలు కోణాల్లో పరిశోధన జరిపారు. సంజయ్‌కుమార్‌ యాదవ్, మంకుషాను సంఘటన వద్దకు తీసుకువచ్చి సీన్‌ రీ కన్‌స్ట్రక్షన్‌ తరహాలో పరిశీలించారు. మొదటి అంతస్తులో ఉండే ఇద్దరు బీహారీల గదిని అడిషనల్‌ డీసీపీ వెంకటలక్ష్మి నేతృత్వంలో పోలీసు బృందాలు పరిశీలించాయి. బంగ్లా మీది నుంచి ఎవరైనా బలవంతంగా బావిలో పడేయడం సాధ్యమేనా అన్న కోణంలో విచారణ జరిపారు. సుమారు గంట పాటు గొర్రెకుంటలో పరిశీలన చేశారు. మరోవైపు గొర్రెకుంట ఘటనపై పకడ్బందీగా దర్యాప్తు జరపాలని వరంగల్‌ పోలీసు కమిషనర్‌ను హోంశాఖ మంత్రి మహమూద్‌ అలీ ఆదేశించారు.

దొరికిన రెండు సెల్ ఫోన్లు : – 
బావిలో తేలిన 9 మంది మృతదేహాలు ఊపిరితిత్తుల్లోకి నీరు చేరడం వల్లే వారంతా చనిపోయారని పోస్టుమార్టం నివేదికలో ఎంజీఎం మార్చురీ ఫోరెన్సిక్‌ విభాగం హెడ్‌ డాక్టర్‌ రజామాలిక్‌ తెలిపారు. బావిలోనే తుది శ్వాస విడిచారని, అయినా వారి నమూనాలను సేకరించి ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపామని, వారిపై ఫుడ్‌ పాయిజన్‌ జరిగిందా.. లేదా అనేది తేలాలంటే ఫోరెన్సిక్‌ నివేదిక రావాలని తెలిపారు. నలుగురు మృతుల ఒంటిపై గాయాలు ఉన్నాయని నివేదికలో పొందుపరిచారు. ఈ నేపథ్యంలో పోలీసుల పరిశోధనకు సెల్‌ఫోన్‌ సంభాషణలు, కాల్‌డేటా కీలకంగా మారాయి. బుస్రా ఖాతూన్, ఆమెతో సంబంధాలు ఉన్నాయని అనుమానిస్తున్న యాకూబ్‌ ఫోన్‌ కాల్స్‌తో పాటు ఇతరులతో మక్సూద్‌ ఏం మాట్లాడాడనే విషయాలపై పోలీసులు దృష్టి సారించారు.

వరంగల్ MGM ఆసుపత్రిలో డెడ్ బాడీస్ : – 
తొమ్మిది మృతదేహాలు కూడా వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రి మార్చురీలోనే ఉన్నాయి. నిన్న మృతదేహాలను ఖననం చేస్తారని భావించినా.. మక్సూద్‌ బంధుమిత్రులు పశ్చిమ బెంగాల్‌ నుంచి వస్తున్నారనే సమాచారంతో మార్చురీలో భద్రపరిచినట్లు అధికారులు చెబుతున్నారు. ఇద్దరు బీహారీల మృతదేహాలకు వరంగల్‌ పోతన శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించాలని.. మిగిలిన ఏడుగురికి వరంగల్‌ ఖబరస్తాన్‌లో ఖననం చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.