డాక్టర్ ఆవేదన వైరల్..థియేటర్లలో 100 శాతం ప్రేక్షకులా?..మేమంతా అలసిపోయామనే కనికరమే లేదా?

డాక్టర్ ఆవేదన వైరల్..థియేటర్లలో 100 శాతం ప్రేక్షకులా?..మేమంతా అలసిపోయామనే కనికరమే లేదా?

‘We Are Tired’ doctor letter viral :సినిమా థియేటర్లలో 100 శాతం ప్రేక్షకులను అనుమతించేలా తమిళనాడు ప్రభుత్వం గత సోమవారం (జనవరి 4,2021) ఉత్తర్వులు జారీ చేసింది. ఓ పక్క ఇప్పటికీ పాత కరోనా కేసులు నమోదవుతున్నాయి.మరోపక్క కొత్తగా భయపెడుతున్న కొత్త కరోనా స్ట్రెయిన్ కేసులు పెరుగుతున్న ఈక్రమంలో సీఎం పళని ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయమపై చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఎంతమాత్రం సరైంది కాదనే వాదన వినిపిస్తోంది.

తమిళనాడు ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై కరోనా వారియర్ గా రోగులకు నిత్యం సేవలందించిన ఓ డాక్టర్ ఆవేదన వ్యక్తంచేశారు. డాక్టర్ అరవింద్ శ్రీనివాస్ రాసి లేఖ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ లేఖ అందరినీ ఆలోచింపచేస్తోంది. అరవింద్ శ్రీనివాస్ జవహర్‌లాల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్‌గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్(JIPMER) పుదుచ్చేరిలో రెసిడెంట్ డాక్టర్ గా విధులు నిర్వహిస్తున్నారు.

ఈక్రమంలో అరవింద్ శ్రీనివాస్ థియేటర్లలో 100 శాతం ఆక్యుపెన్సీపై ప్రభుత్వానికి బహిరంగ లేఖ రాశారు. ఆవేదనతో కూడిన ఈ లేఖను తమిళనాడు ప్రభుత్వంతో పాటు హీరో విజయ్, శింబును ఉద్దేశిస్తూ రాశారు.

ఆ లేఖ సారాంశం ఇలా ఉంది..నేను అలసిపోయాను. మేమంతా అలసిపోయాం. నాలాంటి వేలాదిమంది డాక్టర్లు, వైద్య సిబ్బంది కరోనా రోగులకు నిత్యం సేవలు చేస్తూ అలసిపోయారు. హెల్త్ కేర్ వర్కర్లు అలసిపోయారు. పోలీసు అధికారులు అలసిపోయారు. పారిశుద్ధ్య కార్మికులు అలసిపోయారు.

ఎవ్వరూ ఊహించని ఈ ఉపద్రవం వల్ల జరిగిన నష్టాన్ని వీలైనంత తగ్గించేందుకు కింది స్థాయి సిబ్బంది నుంచి అందరం చాలా చాలా శ్రమపడ్డాం. అది మా బాధ్యతగా భావించి శ్రమించాం. మేం పడిన కష్టాన్ని చూసేవారికి చాలా గొప్పగా అనిపించకపోవచ్చు. ఎందుకంటే మేం చేసే సేవలు అందరికి కనిపించటానికి మా ముందు ఎటులాంటి కెమెరాలు లేవు. మేం ఎలాంటి స్టంట్ సీక్వెన్స్‌లూ చేయలేదు. మేము హీరోలం కాదు. కానీ.. మేం ఊపిరి పీల్చుకోవడానికి కొంత టైమ్ కావాలి. ఈ ఉపద్రవం (కరోనా) ఇంతటితో పూర్తి అయిపోలేదు.

కరోనాతో సోకి ఇప్పటికీ ప్రజలు చనిపోతునే ఉన్నారు. ఇటువంటి ఈ సమయంలో థియేటర్లలో 100 శాతం ఆక్యుపెన్సీకి ప్రభుత్వం పర్మిషన్లు ఇవ్వడమంటే ఆత్మహత్యా యత్నమే..ఓ రకంగా చూస్తే ఇది నరహత్యలతో సమానం. సినిమాలు 100 శాతం ప్రేక్షకులతో కలిసి చూసేందుకు ఏ ప్రజాప్రతినిధి గానీ, హీరోలుగా చెప్పుకునే ఏ ఒక్కరూ సిద్ధంగా ఉండరు. దీనిపై మరోసారి ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం చాలా ఉందని ఆ లేఖలో డాక్టర్ పేర్కొన్నారు. మా ప్రాణాలపై కూడా కాస్త శ్రద్ధ పెట్టి కనికరం చూపండి. ఇంకా ఈ కరోనా ప్రమాదంలో ఎంతమంది ఉన్నారో విచారించాల్సిన అవసరముంది.
ఇట్లు..
అలసిసొలసిన, ఓ నిస్సహాయ వైద్యుడు

అని రాసి ఉంది. డాక్టర్ అరవింద్ శ్రీనివాస్ రాసిన ఈ లేఖను నెటిజన్లు సమర్థిస్తున్నారు. ఈ లేఖ పోస్ట్ స్క్రీన్ షాట్ ను షేర్ చేస్తూ..జాషువా మైఖేల్ అనే ట్విట్టర్ యూజర్ తాను రాష్ట్రం కోసం ప్రార్థిస్తున్నానని చెప్పారు.

తమిళ సినిమా అభిమానులు కూడా చాలా మంది ఈ యూజర్‌తో ఏకీభవించారు, ప్రభత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని తెలివిలేని చర్యగా పేర్కొన్నారు.

ఇదీ ఓ డాక్టర్ ఆవేదన ఇలా ఉంటే..మరోపక్క తమిళ సినీ పరిశ్రమకు చెందిన చాలామంది 100 శాతం ప్రేక్షకులను థియేటర్లకు అనుమతించాలన్న నిర్ణయాన్ని స్వాగతించారు. ఈ నిర్ణయంపై సినీ పరిశ్రమ హర్షం వ్యక్తం చేసినప్పటికీ కొంతమంది మాత్రం అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

కరోనా పూర్తి స్థాయిలో కట్టడి కాకుండానే థియేటర్లలోకి అందరినీ అనుమతిస్తే.. రెండున్నర గంటల పాటు మూసేసి ఉంచే అలాంటి చోట వైరస్ ప్రబలడానికి అవకాశమిచ్చినట్టవుతుందని ఇది మరింత ప్రమాదానికి దారితీయవచ్చని సూచిస్తూ..ఈ నిర్ణయం ఎంత మాత్రం సరైంది కాదని వాదిస్తున్నారు. సినిమాలు రిలీజ్ కాకుండా..షూటింగులు జరగకుండా నిలిచిపోవటంతో సినీ పరిశ్రమ నష్టాల్లో ఉంటే దాన్ని ఆదుకోవడానికి ప్రభుత్వం ప్రత్యామ్నయ మార్గాలపై దృష్టి పెట్టాలి గానీ.. ఇలా నిర్మాతల లాభాపేక్ష కోసం ప్రజల్ని బలిపెట్టకూడదని వాదిస్తున్నారు.

కాగా..‘మాస్టర్’ సినిమా విడుదల నేపథ్యంలో సీఎం పళనిస్వామిని విజయ్ కలిసిన రోజుల వ్యవధిలోనే థియేటర్లలో 100 శాతం ఆక్యుపెన్సీ నిర్ణయం రావడం చర్చనీయాంశంగా మారింది. తమిళ నటుడు అరవింద స్వామి మాత్రం ‘100 శాతం కంటే 50 శాతమే మేలుగా చెప్పుకున్న సందర్భాలు కొన్ని ఉన్నాయి. అందులో ఇది ఒకటి’ అని ట్వీట్ చేశాడు.