Organ Donation: మరణం తర్వాత కూడా జీవించే గొప్పదానం..8మందికి కొత్త జీవితమిచ్చే మహద్భాగ్యం

ఒక మనిషి చనిపోతూ కూడా చేసే అత్యంత దానం అవయవ దానం. మరణం తర్వాత కూడా మనం జీవించి ఉండగలిగే మహద్భాగ్యం అవయవదానం. మనిషి చనిపోయినా మరో 8మందికి కొత్త జీవితాన్నిచ్చే గొప్ప దానం అవయవదానం.

Organ Donation: మరణం తర్వాత కూడా జీవించే గొప్పదానం..8మందికి కొత్త జీవితమిచ్చే మహద్భాగ్యం

Organ Donation

Organ Donation : దానాలు ఎన్నో. కడుపు నింపే అన్నదానం మంచిదే. జీవితాలనిచ్చే విద్యాదానం మంచిదే. కానీ అవయవ దానం అలాకాదు.ఎంతోమందికి కొత్త జీవితాలనిస్తుంది. వాడిపోయిన జీవితాలను చిగురింపజేస్తుంది.ఆశలు అడుగంటిపోయినవారికి కొత్త ఆశలను చిగురింపజేస్తుంది. అదే అవయవ దానంలోని గొప్పదనం. డబ్బులిస్తే..అవసరం తీరిపోయాక మర్చిపోతారు. అదే అవయవ దానం అయితే కొత్త జీవితాలను ప్రసాదించినవారవతారు. ఒక మనిషి చనిపోతూ కూడా చేసే అత్యంత దానం అవయవ దానం. మరణం తర్వాత కూడా మనం జీవించి ఉండగలిగే మహద్భాగ్యం అని చెప్పొచ్చు.

ఒక మరణించిన వ్యక్తి అవయవాలను ఇతరులకు దానం చేయడం ద్వారా ఒకరి జీవితం ముగిసినప్పటికీ మరొకరి జీవితం రూపంలో మరో ప్రయాణాన్ని ప్రారంభించే అవకాశం ఉంది. మరణానంతరం ఎంతో విలువైన అవయవాలను మట్టిపాలు చేయటం కంటే మన అవయవాలను దానం చేయడం ద్వారా మరికొందరి జీవితాల్లో వెలుగులు నింపిన వారవుతాం. ఒక మనిషి అవయవాలను దానం చేయడం వలన వాటి అవసరం ఉన్న వారి ప్రాణాలు నిలబెట్టొచ్చు. భారతదేశంలో ప్రతి ఏటా దాదాపు 5 లక్షల మంది ప్రజలు అవయవ దాతలు లేక మరణిస్తున్నారని లెక్కలు చెబుతున్నాయి. కానీ అవయవ దానం చేస్తే ఎంతోమందికి కొత్త జీవితాలను ప్రసాదించవచ్చు. భారత్ ఒక మిలియన్ మందికి కేవలం 0.26 శాతం మంది మాత్రమే అవయవ దానం చేస్తున్నట్టు సమాచారం.

Read more : World Organ Donation Day : అవయవ దానం చేసిన మొట్టమొదటి వ్యక్తి ఇతనే

శరీరంలోని ఏ అవయవాలను దానం చేయవచ్చంటే..
అవయవ దానం రెండు రకాలు. ఒకటి మరణం తర్వాత చేసే అవయవ దానం. రెండవది సజీవ అవయవ దానం. ఒక వ్యక్తి అవసరమైన వారికి సహాయం చేయడానికి తన శరీరంలోని మూత్రపిండాలు, క్లోమం కొంత భాగాన్ని దానం చేయవచ్చు. అలాగే మరణించిన వ్యక్తి యొక్క గుండె, కాలేయం, కిడ్నీలు, పేగులు, ఊపిరితిత్తులు, పాంక్రియాస్‌ దానం చేయొచ్చు. కార్నియా, గుండె కవాటాలు, చర్మం, ఎముకలు తదితర అవయవాలను సహజ మరణం పొందిన వారి నుంచే తీసుకోవచ్చు.

Read more : ప్రపంచంలోనే ఫస్ట్ : హైదరాబాద్‌లో అరుదైన సర్జరీ.. 4 నెలల శిశువు కిడ్నీలో రాళ్లు తొలగింపు

అలాగే..బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి శరీర అవయవాలతో 8 మందికి ప్రాణం పోయొచ్చు. గుండె, కాలేయం, ఊపిరితిత్తులు, మూత్రపిండాలు, పాంక్రియాస్, చిన్న పేగును మార్పిడి చేయవచ్చు. వీటితో పాటు చర్మం, కార్నియా, ఎముక కణజాలం, గుండె కవాటాలు, రక్త నాళాలను అవసరమైన రోగులకు దానం చేయవచ్చు.ఏదైనా ప్రమాదం కారణంగా లేదా ఇన్ఫెక్షన్ కారణంగా కంటి చూపు కోల్పోయిన వారికి కార్నియాను రీప్లేస్ చేయడం ద్వారా తిరిగి చూపు ప్రసాదించవచ్చు. కాలిన గాయాల బాధితులకు చర్మం మార్పిడి చేస్తారు. గుండె బైపాస్ సర్జరీ చేయించుకునే వారికి దాతల నరాలను ఉపయోగిస్తారు.

ఏ వ్యక్తి అయినా అవయవ దానం చేయవచ్చు. దీనికి సంబంధించి వయస్సుపై ఎలాంటి నిబంధనా లేదు. నిర్బంధం అంతకంటే లేదు. నవజాత శిశువుల నుండి 90 ఏళ్ల వృద్ధులకు వరకు అవయవ దానాలు చేయొచ్చు. అలా చేసినవి విజయవంతమయ్యాయి. కానీ 18 ఏళ్లలోపు వారు తమ అవయవాలను దానం చేయాలనుకుంటే..వారి కుటుంబ సభ్యుల అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది.

ఏ అవయవ మార్పిడికి ఎంత సమయమంటే..
అవయవ దాత శరీరం నుంచి గుండెను తీసిన తర్వాత దాన్ని 4 గంటల్లోగా అవసరమైన వారికి అమర్చాలి. ఊపిరితిత్తులు కూడా అంతే. అదే మూత్రపిండాలను శరీరం నుంచి వేరు చేసిన 30 గంటల్లోగా మార్పిడి చేయొచ్చు. కాలేయం, పాంక్రియాస్‌ 12 గంటల్లోగా మార్పిడి చేయాలి.అయితే వ్యక్తుల శరీర స్వభావాలను బట్టి కొన్ని సైడ్‌ ఎఫెక్ట్స్ కూడా వస్తాయి.అమర్చిన శరీర భాగాన్ని స్వీకర్త శరీరం అంగీకరించక తన రోగ నిరోధక వ్యవస్థ దాన్ని తిరస్కరించి దాడి చేస్తుంది. ఇక దీన్ని నివారించడానికి నిపుణులు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. దీనికోసం కొన్నిసార్లు జీవిత కాలంపాటు అవయవ దానం తీసుకున్న వ్యక్తి మెడిసిన్స్ వాడాల్సి ఉంటుంది.

అవయవ దానం చేసేవారి కోసం భారత ప్రభుత్వం కొన్ని రూల్స్‌ను ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. లేదంటే చట్ట పరమైన చర్యలు తీసుకుంటారు. ఎవరైనా అవయవ దానం చేయాలనుకుంటే దాని కోసం వారు ప్రతిజ్ఞ ఫారమ్‌ను పూరించాల్సి ఉంటుంది. దీని వల్ల ఎటువంటి సమస్యలు రాకుండా ఉంటాయి చట్టపరంగా.అవయవ దానం గురించి అవగాహన కల్పించటానికి..అవయవ దానం చేస్తే ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలిపేందుకు ఆగస్టు 13న ప్రపంచ అవయవదాని దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం.