Mamata Banerjee : UPA లేదు,ప్రత్యామ్నాయం అవసరం..పవార్ తో భేటీ తర్వాత దీదీ

దేశంలో కాంగ్రెస్ స్థానాన్ని భర్తీ చేసేందుకు తృణముల్ కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తోంది. దేశవ్యాప్తంగా పార్టీని విస్తరించేందుకు టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ కృషి చేస్తున్నారు. ఇప్పటి

Mamata Banerjee : UPA లేదు,ప్రత్యామ్నాయం అవసరం..పవార్ తో భేటీ తర్వాత దీదీ

Didi

Mamata Banerjee : దేశంలో కాంగ్రెస్ స్థానాన్ని భర్తీ చేసేందుకు తృణముల్ కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తోంది. దేశవ్యాప్తంగా పార్టీని విస్తరించేందుకు టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ కృషి చేస్తున్నారు. ఇప్పటికే ఆయా రాష్ట్రాల్లోని ముఖ్య కాంగ్రెస్ నేతలకు గాలం వేసిన టీఎంసీ.. వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి టీఎంసీని బీజేపీకి ప్రత్యామ్నాయంగా మార్చే ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా మమతా బెనర్జీ ఇటీవల పలు రాష్ట్రాల్లో పర్యటిస్తూ పలు పార్టీలకు చెందిన ముఖ్య నేతలతో సమావేశమై చర్చలు జరుపుతున్నారు. గత నెలలో మేఘాలయ మాజీ ముఖ్యమంత్రి ముకుల్ సంగ్మా సహా 12 మంది ఎమ్మెల్యేలు తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో చేరడంతో..మేఘాలయ ఎన్నికల్లో పోటీ చేయకుండానే టీఎంసీ ప్రధాన ప్రతిపక్షంగా మారింది.

టీఎంసీని విస్తరించే  క్రమంలో మంగళవారం ముంబై పర్యటనలకు వెళ్లి మంత్రి ఆదిత్య ఠాక్రే,శివసేన ఎంసీ సంజయ్ రౌత్ ని కలిసి పలు రాజకీయ అంశాలను చర్చించిన మమతా బెనర్జీ..బుధవారం మధ్యాహ్నాం ఎన్ సీపీ అధినేత శరద్ పవార్ ని ఆయన నివాసంలో కలిశారు.

శరద్ పవార్ తో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన మమత…శ‌ర‌ద్ ప‌వార్ సీనియ‌ర్ నేత‌ని, ఆయ‌న‌తో రాజ‌కీయ అంశాలు చ‌ర్చించాన‌ని..ప‌వార్ అభిప్రాయాల‌తో తాను పూర్తిగా ఏకీభ‌వించాన‌ని చెప్పుకొచ్చారు. కేంద్రంలో 2014కు ముందు రెండు సార్లు అధికారం చెలాయించిన కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ కూటమి ఇప్పుడు మనుగడలో లేదని కాంగ్రెస్ ల‌క్ష్యంగా దీదీ విమ‌ర్శ‌లు గుప్పించారు. ప్రస్తుతం దేశంలో నియంతృత్వం కొనసాగుతోందని, దానిపై ఎవరూ పోరాడటం లేదని అన్నారు. ఈ నేపథ్యంలో బలమైన ప్రత్యామ్నాయానికి ఆవశ్యకత ఏర్పడిందని చెప్పారు.

ఈ సందర్భంగా శరద్ పవార్ మాట్లాడుతూ..ప్రస్తుత నాయకత్వానికి బలమైన ప్రత్యామ్నాయాన్ని ప్రజల ముందు ఉంచాలన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా పోరాడే ఏ పార్టీనైనా ముందుకొస్తే.. స్వాగతిస్తామన్నారు. అది కాంగ్రెస్ పార్టీకీ వర్తిస్తుందని స్పష్టం చేశారు. జాతీయ స్థాయిలో భావసారూప్యత కలిగిన పార్టీలు సంయుక్త నాయకత్వాన్ని ఏర్పాటు చేయాలన్నది మమత ఆలోచన అని.. ప్రత్యామ్నాయ నాయకత్వాన్ని అందించాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. తాము ఆలోచించేది ఈ ఒక్కరోజు కోసం కాదని.. రాబోయే ఎన్నికల కోసమని, దానికి ఏర్పాట్లు చేయాల్సి ఉంటుందన్నారు.

ఇక,తాజా పరిణామాలపై స్పందించిన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్.. కాంగ్రెస్ లేకుండా బీజేపీని ఓడించాలనుకోవడం కేవలం కలేనని,దేశ రాజకీయాల వాస్తవితక ఏంటో ప్రతి ఒక్కరికీ తెలుసని వ్యాఖ్యానించారు.

ALSO READ UP Election : శ్రీకృష్ణా..యూపీ ఎన్నికల్లో బీజేపీ ప్రధాన ప్రచార అస్త్రం ఇదే!