YS Sharmila: అందుకే వారిని తోసేశాను: వైఎస్ షర్మిల వ్యాఖ్యలు

YS Sharmila: తెలంగాణ పోలీసులను తోసేసిన ఘటన, తనను జైలులో పెట్టిన విషయంపై వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు.

YS Sharmila: అందుకే వారిని తోసేశాను: వైఎస్ షర్మిల వ్యాఖ్యలు

YS Sharmila

YS Sharmila: తన మీద దాడి చేస్తారేమోనన్న భయంతోనే తాను పోలీసులను తోసేశానని వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల (YS Sharmila) అన్నారు. పోలీసులను కొట్టిన కేసులో కోర్టులో బెయిల్ రావడంతో వైఎస్ షర్మిల చంచల్ గూడ జైలు నుంచి విడుదలై మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు.

“ఆత్మరక్షణ కోసం వారిని తోసేశాను. అది కూడా ఏదో పెద్ద తప్పయినట్లు, నేను నేరం చేసినట్లు చూపారు. నేను పోలీసులను తోసేసిన వీడియోలను బయటపెట్టారు. మరి పోలీసులు వచ్చి నన్ను బెదిరించిన వీడియోలను ఎక్కడైనా బయటపెట్టారా? వారికి కావాల్సిన విధంగా వారు వీడియోలను బయటపెట్టారు.

అంతమంది వచ్చి నాపై దాడి చేసినా, ఆ వీడియోలను బయటపెట్టలేదు. మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి భార్య, మా అమ్మ విజయమ్మ పోలీసు స్టేషన్ వరకు వచ్చారు.. తన బిడ్డను చూడాలని ఆమె అనుకోవడం కూడా తప్పా? రాజశేఖర్ రెడ్డి బిడ్డ మీ తాటాకు చప్పుళ్లకు భయపడదు.

మీరు నన్ను ఎంత తొక్కాలని చూస్తారో.. అంతకంటే ఎక్కువ రోశంతో పోరాడతాను. ఇందిరా పార్క్ వద్ద దీక్షకు వెళ్లాలనుకున్నాం, మరో చోటుకి వెళ్లాలనుకోలేదు. నన్ను అరెస్టు చేసేందుకు వారెంట్ కూడా లేదు. రోజుల తరబడి నన్ను అడుగు బయటపెట్టనివ్వడం లేదు” అని షర్మిల చెప్పారు.

“కేసీఆర్ ప్రతిపక్షం గొంతు నొక్కుతున్నారు. కావాలనే పోలీసులను వాడుకుని, నన్ను అరెస్ట్ చేశారు. ఇద్దరు మహిళా పోలీసులు మాత్రమే ఉన్నారు. మహిళా అని చూడకుండా నా మీద పడి దాడి చేశారు. నేను ఎవరి మీదా చెయ్యి చేసుకోలేదు. విజయమ్మ మహిళ పోలీస్ పై ఒక దెబ్బ వేశారు. దానికే విజయమ్మ బాంబులు వేసినట్లు చిత్రీకరించారు.

బోనులో పెట్టినప్పటికీ పులి పులే. రాజశేఖర్ రెడ్డి బిడ్డగా సమస్యలపై పోరాడుతాను. రాజశేఖర్ రెడ్డి రాజ్యం తెచ్చేంతవరకు పోరాడుతాను. కేసీఆర్ ఫ్యామిలీ ఇంతకు ఇంత అనుభవిస్తారు. సహనం పట్టి ఎంత కాలం ఉండాలి? సహనం నశించి పోలీసులను తోశాను. నన్ను హౌస్ అరెస్ట్ చేస్తున్నట్లు ఆర్డర్ కాపీ లేదు.

రాజ శేఖర్ రెడ్డి బిడ్డను చూసి కేసీఆర్ భయపడుతున్నారు. ఇంటికో ఉద్యోగం హామీ ఏమైంది? ఉద్యోగాలు లేవు. డబుల్ బెడ్ రూం ఎంత మందికి ఇచ్చారు. నా శరీరం తాకిన వీడియోలు.. పోలీసులు నాపై కన్నెర్ర చేసిన వీడియోలు ఎక్కడ కూడా బయట పెట్టలేదు” అని షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు.

YS Sharmila: పోలీసులపై దాడి కేసులో.. వైఎస్ షర్మిలకు బెయిల్ మంజూరు