కేరళ 4 సెలబ్రెటీలు : ఒకే కాన్పులో పుట్టారు.. ఒకేసారి పెళ్లికి రెడీ!

  • Edited By: sreehari , November 7, 2019 / 02:54 PM IST
కేరళ 4 సెలబ్రెటీలు : ఒకే కాన్పులో పుట్టారు.. ఒకేసారి పెళ్లికి రెడీ!
ad

అప్పట్లో కేరళలో ఇదో సంచలనం. 1995లో ఒకే కాన్పులో ఐదుగురు కవల పిల్లలు జన్మించారు. వీరిలో నలుగురు ఆడపిల్లలు అయితే ఒకరు అబ్బాయి. అందరూ కలిసి ఒకే రోజు స్కూల్లో చేరారు. ఒకే రోజు కాలేజీలో చేరారు. ఒకేసారి ఓటు వేశారు కూడా. అప్పటినుంచి కేరళలో ఈ ఐదుగురు సెలబ్రటీలుగా మారిపోయారు. చిన్నతనంలోనే తండ్రి మరణించడంతో అన్నీ తానై తల్లి పెంచి పోషించింది.

తల్లి చెంతనే పెరిగి పెద్దయ్యారు. ఎన్నో కష్టాలు పడ్డారు. ఒక్కొక్కరు తమకు నచ్చిన రంగంలో స్థిరపడ్డారు. ఇక మిగిలింది పెళ్లి. ఇప్పుడు ఆ నలుగురు అమ్మాయిలు తమ జీవితంలో మరో ఇన్నింగ్స్ ప్రారంభించబోతున్నారు. జీవితంలో అతి ముఖ్యమైన ఘట్టం.. పెళ్లి.. ఈ నలుగురు పెళ్లి చేసుకోబోతున్నారు. 

వచ్చే ఏడాది ఏప్రిల్ 26న గురువాయర్ లోని శ్రీకృష్ణ దేవాలయంలో ఒకేసారి నలుగురు అమ్మాయిలు పెళ్లి చేసుకోబోతున్నారు. తమ ఐదుగురిలో ఒకడైన తమ సోదరుడు మాత్రం సోదరీమణుల పెళ్లికి సంబంధించి ఏర్పాట్లపై బిజీగా ఉన్నాడు. తన సోదరీమణుల పెళ్లి అయ్యాకే తాను పెళ్లి చేసుకుంటానని  అప్పటివరకూ ఎదురుచూస్తానని అంటున్నాడు. 1995, నవంబర్ 18న ఈ ఐదుగురు జన్మించారు. వారి తండ్రి ఓ చిరువ్యాపారి.

తమకు పుట్టిన ఐదుగురి సంతానంలో ఉత్రాజా, ఉత్తార, ఉత్తామ, ఉత్ర, ఉత్రాజన్ అనే పేర్లు పెట్టారు. మలయాళం క్యాలెండర్ ప్రకారం.. ఉత్రమ్ నక్షత్రంలో జన్మించడంతో వారికి ఈ పేర్లు పెట్టారు. ఆ తర్వాత తమ ఇంటి పేరు పంచరత్నం అని పేరు మార్చేశాడు. ఐదు నక్షత్రాలైన తమ పిల్లలను పోషించడం అంతా ఈజీ కాదు. వారికి బట్టలు, బ్యాగ్, గొడుగు ఇలా అన్ని ఇచ్చేందుకు ఎన్నో ఇబ్బందులు పడ్డాడు. 

అవసరమైన అన్ని వస్తువులను ఒకేలా ఉండేలా చూసుకునేవాడు. కానీ, అతడి భార్యకు గుండెజబ్బు సమస్య ఉంది. ఆర్థిక సమస్యల్లో చిక్కుకుంది. ఈ ఐదుగురు పుట్టి 9ఏళ్లు గడిచింది. 2004లో తండ్రి ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకున్నాడు. తల్లి కుమిలిపోయింది. పిల్లల భారం తనపై పడింది. అప్పట్లో కొందరి సహాకారంతో ప్రభుత్వ ఉద్యోగం లభించింది. అలా వారిని కష్టపడి చదివించింది. 

ఒక బిడ్డ ఫ్యాషన్ డిజైనర్ అయితే మరో ఇద్దరు అనేస్తేసియా టెక్నిషియన్లుగా చేస్తున్నారు. మరో ఒకరు ఆన్ లైన్ రైటర్ గా ఉన్నారు. ఇక సోదరుడు ఉత్రాజన్ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ అయ్యాడు. కష్టాల నుంచి బయటపడి అందరూ తమ ఉద్యోగాల్లో సెటిల్ అయ్యారు. ఇక మిగిలింది పెళ్లి చేసుకోవడమే. ఒక్కొక్కరికి వరుడిని చూసి పెళ్లి నిశ్చయించారు. 2020లో పెళ్లి చేసుకోబోతున్నారు. ఆ తర్వాతే తన పెళ్లి అంటున్నాడు సోదరుడు.