Autoimmune Diseases : ఆటో ఇమ్యూన్ వ్యాధులతో జాగ్రత్త! |Beware of autoimmune diseases!

Autoimmune Diseases : ఆటో ఇమ్యూన్ వ్యాధులతో జాగ్రత్త!

ఆటో ఇమ్యూన్ వ్యాధుల విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది. వ్యాధులకు సంబంధించి ముందస్తుగా లక్షణాలను గుర్తించిన వెంటనే వైద్యులను సంప్రదించటం మంచిది.

Autoimmune Diseases : ఆటో ఇమ్యూన్ వ్యాధులతో జాగ్రత్త!

Autoimmune Diseases : మనిషి శరీరం వ్యాధుల బారిన పడకుండా కాపాడటానికి అంతర్గతంగా ఒక రక్షణ వ్యవస్ధ ఉంటుంది. ఆరోగ్యాన్ని దెబ్బతీసే వైరస్ శరీరంలో ప్రవేశిస్తే దానిపై దాడిచేసి పోరాటం చేస్తుంది. అయితే కొన్నికొన్ని సందర్భాల్లో ఈ రక్షణ వ్యవస్ధ పొరబడి తన సొంత శరీరం మీదే దాడి చేస్తుంది. దీని ఫలితంగా అనేక వ్యాధుల బారిన పడాల్సి వస్తుంది. వీటిలో ధైరాయిడ్ సమస్యలు, సొరియాసిస్, రక్తహీనత, కండరాల నొప్పులు, మధుమేహం, ఎస్ ఎల్ ఇ వంటి అనేక ఆటో ఇమ్యూన్ వ్యాధులు వచ్చే ప్రమాదం ఏర్పడుతుంది. ఆటో ఇమ్యూన్ వల్ల వచ్చే కొన్ని వ్యాధుల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…

రూమటాయిడ్ ఆర్ధరైటిస్ ; ఇదొక ఇన్ ఫ్లమేటరీ అర్ధరైటిస్ అనేది జీవక్రియల్లో ఏర్పడే అసమతుల్యత వల్ల తలెత్తే ఆటో ఇమ్యూన్ డిసీజ్. శరీరంలో ఇరుపక్కల్లో ఉండే కీళ్లకు సమాంతరంగా ఇది వ్యాప్తి చెందుతుంది. కీళ్లు తీవ్రమైన వాపునకు గురికావటంతోపాటు, కీళ్ల కదలికలు పూర్తిగా స్ధంభిస్తాయి.

థైరాయిడ్ సమస్యలు ; శరీరంలో తయారైన యాంటీ బాడీలు ఒక్కో సారి థైరాయిడ్ గ్రంధికి వ్యాపిస్తాయి. ఈ క్రమానికి కొన్ని నెలల నుండి కొన్ని సంవత్సరాలు పడుతుంది. రేడియేషన్ తీసుకున్న కారణంగా కొందరిలో థైరాయిడ్ గ్రంధి దెబ్బతిని హైపోథైరాయిడిజం రావచ్చు. థైరాయిడ్
వ్యాధిలో మలబద్ధకం, డిప్రెషన్, నీరసం, అలసట, వెంట్రుకలు రాలిపోవడంతోపాటు గోళ్లు విరగడం, కాళ్లూ చేతుల్లో వాపు, గొంతు బొంగురుపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.

సొరియాసిస్ ; ఇది శరీరమంతా పొలుసులుగా వచ్చే ఒక దీర్ఘకాలిక చర్మవ్యాధి. స్త్రీలు, పురుషులు అనే తేడా లేకుండా, ప్రపంచ జనాభాలో మూడు శాతం మందిని వేధిస్తున్న వ్యాధి. ఈ వ్యాధి ఎక్కువగా మోచేతులు , మోకాళ్లు, తల , వీపు, అరిచేతులు, అరికాళ్లు, పొట్ట, మెడ, నుదురు, చెవుల వంటి ప్రాంతాల్లో వ్యాప్తి చెందుతుంది. చర్మం ఎర్రబడటం, జుట్టు రాలిపోవటం, కీళ్ల నొప్పులు, వంటి లక్షణాలు కనిపిస్తాయి. చర్మం పొడిబారి, చర్మం మీద పగుళ్లు ఏర్పడటంతోపాటు, రక్తస్రావం అవుతుంది.

మధుమేహం ; మధుమేహంలో టైప్ 1, టైప్ 2 రెండు రకాలు ఉన్నాయి. టైప్ 1 వ్యాధి 20 ఏళ్ల కన్నా ముందే మొదలవుతుంది. టైప్ 2 మధుమేహం 20 ఏళ్లు దాటాక వస్తుంది. ప్రపంచంలో ప్రతి ఇద్దరిలో ఒకరు ఈ మధుమేహం బారిన పడే ప్రమదం ఏర్పడుతుంది. ఆకలి, నీరసం, దాహం ఉండటం, అతిమూత్రం, చూపు మందగించటం, వేగంగా బరువు తగ్గటం, తరచూ తలనొప్పి, గుండె దడ, చెమటలు పోయటం, గాయాలు మానకపోవటం , కాళ్లూ చేతుల తిమ్మిర్లు వంటి లక్షణాలు ఈ వ్యాధిలో కనిపిస్తాయి.

ఎస్ఎల్ ఇ ; సిస్టమిక్ ల్యూపస్ ఎరిథిమెటసిస్ వ్యాధి గ్రస్తుల్లో శరీరంలోని పలు అవయవాలు వ్యాధిగ్రత్తంగా మారతాయి. జన్యుపరమైన, వాతావరణ పరమైన కారణాలతోపాటు మానసిక ఒత్తిళ్లు కూడా ఈ జబ్బుకు దారి తీస్తాయి. ముఖంపై దద్దుర్లు రావటం, చర్మం ఎర్రబడటం, నల్లటి మచ్చలు, కండరాల నొప్పులు, కీళ్ల నొప్పులు, పొలుసులు రావటం ఈ వ్యాధి లక్షణాలు. వీటితోపాటు శరీరమంతా వాపులు రావటం, బరువు పెరగటం వంటి లక్షణాలు బయటపడతాయి. దీర్ఘకాలంలో ఈ వ్యాధి కారణంగా మూత్రపిండాలు దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. గర్భిణీ స్త్రీలకు ఈ వ్యాధి సోకితే పిండమరణం, లేదా గర్భస్రావం జరిగే అవకాశం ఉంటుంది.

ఆటో ఇమ్యూన్ వ్యాధుల విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది. వ్యాధులకు సంబంధించి ముందస్తుగా లక్షణాలను గుర్తించిన వెంటనే వైద్యులను సంప్రదించటం మంచిది. వెంటనే చికిత్స ప్రారంభించటం వల్ల ఆటో ఇమ్యూన్ వ్యాధులను సమూలంగా నయం చేసేకునేందుకు వీలుకలుగుతుంది. ఏమాత్రం అశ్రద్ధ చేసినా ప్రమాదం వాటిల్లే అవకాశాలు ఉంటాయి.

×