మాస్క్ ధరిస్తే.. ఆక్సిజన్ స్థాయి తగ్గుతుందా? అపోహ.. నిజమా? ఈ డాక్టర్ తేల్చేశాడు!

మాస్క్ ధరిస్తే.. ఆక్సిజన్ స్థాయి తగ్గుతుందా? అపోహ.. నిజమా? ఈ డాక్టర్ తేల్చేశాడు!

కరోనా సమయంలో బయటకు వెళ్లాలంటే తప్పనిసరిగా మాస్క్ ధరించాల్సిందే. లేదంటే కరోనా మహమ్మరి బారిన పడే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు వైద్య నిపుణులు. ఇప్పుడు ప్రతిఒక్కరి జీవితంలో ఫేస్ మాస్క్ ఒక భాగమైపోయింది. ఎక్కడికి వెళ్లినా ముఖానికి మాస్క్ ధరించి వెళ్తున్నారు. అయితే మాస్క్ ల వల్ల ఎంతవరకు వైరస్ నుంచి సురక్షితం అనే విషయం ఆలోచిస్తే.. 100 శాతమని కచ్చితంగా చెప్పలేం. కానీ, నేరుగా వైరస్ ప్రభావానికి లోను కాకుండా మాస్క్ లు మనల్ని రక్షిస్తాయని చెబుతున్నారు.

మాస్క్ ల్లోనూ సాధారణ ఒక లేయర్ సురక్షితం కాదని, కనీసం రెండు నుంచి మూడు లేయర్లు ఉంటేనే శ్వాస కోశ బిందువులు నోటిని, ముక్కును చేరకుండా నిరోధించగలవు. వైరస్ నుంచి రక్షణ కోసం వినియోగించే మాస్క్‌లతో ఆక్సిజన్ స్థాయిలు తగ్గిపోతాయా? రక్తానికి అందాల్సిన ఆక్సిజన్ స్థాయిలు తగ్గిపోతాయనే వాదన కరెక్టేనా? ఇందులో ఎంత వాస్తవం ఉందనే ప్రశ్న తలెత్తుతోంది.

చాలామంది మాస్క్ ధరించేవారిలోనూ ఈ అపోహలు వినిపిస్తున్నాయి. మాస్క్ ఎక్కువ సమయం లేదా మాస్క్ మందంగా, బిగుతుగా ఉండేలా ధరిస్తే.. ఆక్సిజన్ స్థాయిలు ఒక్కసారిగా తగ్గిపోతాయనే అభిప్రాయాలు, సందేహాలు వ్యక్తమయ్యాయి. దీనిపై ఓ డాక్టర్ క్లారిటీ ఇచ్చాడు. ఈ అభిప్రాయాలన్నీ తప్పని తేల్చేశాడు.

ఐర్లాండ్‌లోని డబ్లిన్‌లో పనిచేస్తున్న Maitiu O Tuathail అనే వైద్యుడు ఫేస్ మాస్క్ ఆక్సిజన్ స్థాయిని తగ్గిస్తుందనే అభిప్రాయాలను కొట్టిపారేశాడు. వాస్తవానికి, మాస్క్ ధరించడం వల్ల ఎలాంటి ప్రభావం ఉండదని ప్రయోగాత్మకంగా చేసి నిరూపించాడు. దీనికి సంబంధించి ఒక వీడియోను కూడా రికార్డు చేశాడు. తన ముఖంపై ఆరు మాస్క్‌లు ధరించి.. రక్తంలో ఆక్సిజన్ saturation స్థాయిలను రికార్డ్ చేశాడు. ముఖంపై ఒక మాస్క్ పై మరొకటి ఇలా ఆరు మాస్క్ లను ధరించాడు.

అప్పుడు తనలోని ఆక్సిజన్ స్థాయి ఏమైనా తగ్గిందా లేదా అని పరీక్షించాడు. మాస్క్ వేసుకున్నప్పుడు, 98-99 శాతం స్థిరమైన ఆరోగ్యకరమైనదిగా మీటర్ చూపించింది. ఫేస్ మాస్క్‌లు ఆక్సిజన్ స్థాయిలపై ప్రభావితం చేస్తాయనే అపోహను పోగట్టడానికే తన ట్విట్టర్‌లో ఈ వీడియోను పోస్ట్ చేసినట్టు తెలిపాడు.

సోషల్ మీడియాలో వైరల్ అయ్యే తప్పుడు సమాచారాన్ని చూసి కంగారుపడిపోతున్నారని అన్నారు. ఇలాంటి అపోహాలను నమ్మొద్దని, తప్పనిసరిగా మాస్క్ ధరించాల్సిందిగా సూచించాడు. కరోనాకు మందులేదని, మాస్క్ ఒక్కటే వైరస్ బారినుంచే సురక్షితంగా ఉండేలా చేయగలదని సూచించారు.