Ladyfinger : రక్త సరఫరా మెరుగు పరిచి…శ్వాసకోశ సమస్యల్ని దూరం చేసే బెండకాయ

బెండలోని మ్యూకస్‌ వంటి పదార్థం కడుపులో మంట నుంచి ఉపశమనం కలిగిస్తుంది. మ్యూకస్‌ గ్యాస్ర్టిక్‌, ఎసిడిటీ సమస్యలకు చక్కని పరిష్కారం.

Ladyfinger : రక్త సరఫరా మెరుగు పరిచి…శ్వాసకోశ సమస్యల్ని దూరం చేసే బెండకాయ

Ladyfinger

Ladyfinger : బెండ ఉష్ణ సమశీతోష్ణ మండల ప్రాంతాల్లో ప్రపంచ వ్యాప్తంగా దీనిని పండిస్తారు. లేత బెండకాయలను కూరగా వండుతారు. బెండకాయల్లో ఎ, బి, సి విటమిన్లు, పలు పోషక పదార్థాలు ఉన్నాయి. బెండకాయలను కూరగాయగా, సలాడ్‌గా ఎండబెట్టి వరుగులను తయారుచేయడంలో వాడతారు. భారతదేశంలో వ్యాపార సరళిలో గుజరాత్‌, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, హర్యానా, పంజాబ్ రాష్ట్రాల్లో పండిస్తున్నారు. బెండను తినటం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.

బెండకాయలోని లెక్టిన్‌ అనే ప్రొటీన్‌ రొమ్ము కేన్సర్‌ వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఇందులోని ఫోలేట్లు అనేక రకాల కేన్సర్లను అడ్డుకొంటాయి. బెండకాయ గింజల్ని ఎండబెట్టి చేసిన పొడి మధుమేహానికి మందుగా పనిచేస్తుంది. ఈ గింజల్లోని పదార్థాలు యాంటీ ఆక్సిడెంట్లలా పనిచేస్తాయి. ఇందులోని కె-విటమిన్‌ ఎముకలకు ఎంతో మేలు చేస్తుంది. క్యాల్షియంను శోషించుకోవడానికి వీటిలోని ఇ-విటమిన్‌ దోహదపడుతుంది. అయితే బెండలో ఫ్రక్టేన్లూ, ఆక్సలేట్లూ, సొలమిన్లు ఉండడంవల్ల మొలలూ, మూత్రపిండ వ్యాధులు, కీళ్ల నొప్పులున్నవాళ్లు తగు మోతాదులో తీసుకోవాలి. బెండలోని ఐరన్‌, పొటాషియం, సోడియం వంటి ఎలక్ర్టోలైట్లు, బీటాకెరోటిన్‌, బి-కాంప్లెక్స్‌, విటమిన్‌-సి శరీరంలోని ద్రవాలను సమతులంగా ఉంచేలా చేసి, నాడీ వ్యవస్థ చురుగ్గా పనిచేయడానికి దోహదపడతాయి.

బెండలోని మ్యూకస్‌ వంటి పదార్థం కడుపులో మంట నుంచి ఉపశమనం కలిగిస్తుంది. మ్యూకస్‌ గ్యాస్ర్టిక్‌, ఎసిడిటీ సమస్యలకు చక్కని పరిష్కారం. దీన్లోని డయూరిటిక్‌ లక్షణాలు యూరినరీ ట్రాక్ట్‌ ఇన్‌ఫెక్షన్‌ని నయం చేయడంలో సహకరిస్తాయి. బెండకాయ డికాక్షన్‌ తాగితే జ్వరం తగ్గుతుంది. చిన్న చిన్న ముక్కలుగా కోసి, నీటిలో మరిగించి, చల్లారాక తాగితే శరీరంలో వేడి తగ్గుతుంది. డయాబెటిస్‌ నియంత్రణలోనూ పనిచేస్తుంది. బెండలోని పెక్టిన్‌ బ్లడ్‌ కొలెస్ర్టాల్‌ను తగ్గిస్తుంది. విటమిన్‌-సి ఆస్తమా తదితర శ్వాసకోశ సమస్యల్ని దూరంగా పెడుతుంది.

బెండకాయ నీటిని పరగడుపునే తాగితే ఎన్నో రకాల ప్రయోజనాలున్నాయి. ఆ నీటి తయారీకి ముందుగా రెండు బెండకాయలను తీసుకొని బాగా కడగాలి. వాటి మొదలు, చివర భాగాలను కట్‌ చేయాలి. తరువాత బెండ కాయలను నిలువుగా చీరాలి. వాటిని ఒక గ్లాసు నీటిలో వేసి, మూత పెట్టాలి. రాత్రంతా అలాగే ఉంచి, ఉదయాన్నే బెండ ముక్కలు తీసేసి నీటిని తాగాలి. దీనివల్ల పేగులు, జీర్ణాశయం శుభ్రమవుతాయి. రక్త సరఫరా మెరుగవుతుంది. గుండె ఆరోగ్యం బాగుంటుంది. మధుమేహం నియంత్రణలో ఉంటుంది. స్త్రీలకు రుతుక్రమ సమయంలో వచ్చే సమస్యలు నయమవుతాయి. నేత్ర సమస్యలను నివారిస్తుంది. కొవ్వు కరిగిస్తుంది. చర్మం కాంతిమంతంగా, జుట్టు దృఢంగా, ఒత్తుగా ఉంటుంది. రోగనిరోధకశక్తి పెరుగుతుంది.

బెండకాయ రసంలో వండిన కూరలో కన్నా అధిక పోషకాలు ఉంటాయి. దీన్ని సేవించడంవల్ల రక్తంలోని ఎర్ర రక్త కణాల సంఖ్య పెరుగుతుంది. అనీమియా నివారణకు ఔషధంలా పనిచేస్తుంది. బెండ రసంలో విటమిన్‌- సి, ఎ, మెగ్నీషియం ఉంటాయి. యాంటీ బ్యాక్టీరియల్‌, యాంటీ సెప్టిక్‌ గుణాలున్న ఈ రసంతో తీవ్రమైన దగ్గు, గొంతు నొప్పి వంటి సమస్యలకు చెక్‌ పెట్టవచ్చు. ఇందులో ఇన్సులిన్‌ గుణాలు అధికం. రోజూ తాగితే రక్తంలోని చక్కెర స్థాయిలు తగ్గుతాయి.