ఆ రోజుల్లో: అప్పటి ప్రేమలు ఏమైపోయాయ్!!

ఆ రోజుల్లో: అప్పటి ప్రేమలు ఏమైపోయాయ్!!

అంతా మారిపోతుంది. సమాజం తీరుతెన్నులే కాదు. భాగస్వాముల మధ్య అన్యోన్యత లోపిస్తుంది. ఇప్పుడు కేవలం ఫోన్‌లతోనూ, కంప్యూటర్లతోనూ కాలక్షేపం చేస్తూ మానవ సంబంధాల మీద అనుమానం పుట్టేంత దుస్థితి తలెత్తింది. కానీ, ఒకప్పటి మన కుటుంబ పెద్దలు వారి తొలి పరిచయాల గురించి వింటే మనం ఏం పోగొట్టుకున్నామో అర్థమవుతుంది. ఆ రోజుల్లో జరిగిన వారి తొలి పరిచయాలు, సిగ్గుతో కూడిన మాటలు తడబాటు, చేతులు పట్టుకుని మైళ్ల దూరం కాలం మరిచిపోయి నడవడాలు, బిడియంతో ఉత్తరాలు రాసుకుని స్నేహితుల ద్వారా మార్చుకోవడాలు ఇలా విన్న ప్రతిసారి ఏదో కొత్త అనుభూతి కలిగిస్తాయని వారు చెప్తే నిజమేనేమోననిపిస్తోంది. 

నేను సాధారణ ఈ కాలపు మనిషిని. కాలంతో తూకం వేస్తున్న విలువలను తూచా తప్పకుండా పాటిస్తూ గజిబిజీ నాగరికతలో కాసులతో కొని తెచ్చుకున్న ఆనందంతో సరిపెట్టుకునేవాడిని.  ఆ నాటి పరిచయాలు తెలియవు. అప్పటి అనుభూతులు అర్థం కావు. 

వాళ్లంతా చెప్తుంటే నాకంత కొత్తగా ఉంటుంది. ప్రేమ ఒకరిమీదే పుడుతుందట. చిన్న చిన్న తగవులు జరిగి భాగస్వామి అలకలో ఉన్నప్పుడు మనమిచ్చే ఓ చాక్లెట్ అంతటి ప్రభావం చూపిస్తుందన్న విషయం నాకెలా తెలుస్తుంది. ఫేవరేట్ ప్రదేశానికి వెళ్లి ఇద్దరికీ సంబంధించిన జ్ఞాపకాలను పదిలపరచుకోవాలన్న సంగతి ఎవరు నేర్పించలేదు కదా. వాదనలు జరిగినప్పుడు విడిపోవడమే కానీ, సహనంతో అపార్థాలను అర్థం చేసుకునే నిజమైన శక్తి ప్రేమకే ఉందని అనుభవలేమి కారణంగానే నాకు తెలియకుండా ఉండిపోయిందేమో. 

ప్రియమైన వారి శరీర స్పర్శలేని క్షణంలో ఏదో వెలితి. వారు కనిపించకపోతే ప్రపంచంలో ఒంటరిగా మిగిలిపోయానేమోననే భావన. క్షణాలను భారంగా లెక్కిస్తున్న మనస్సు, జాడ వెతుకుతూ కోట్ల దూరం ప్రయాణించాలని వేచి చూస్తున్న కళ్లు ఈ ఫీలింగ్స్ రావాలంటే అదృష్టం ఉండాలేమో. వారాంతాలు వస్తాయి పోతాయి. ప్రత్యేక దినాలు పలకరించి పోతాయి కానీ, మనస్సులో నిలిచిపోయే క్షణం ఎప్పుడొస్తుందో ఏమో.

ఇప్పుడంతా ఏదో కేఫ్‌లలో కలుసుకోవడం, మొబైల్ ఫోన్‌లతో గడపడంతోనే సరిపోతుంది. ఒక మనిషి కోసం మరొకరు సమయం వెచ్చించడం అనేది ఎంతో గొప్ప విషయంలా కనిపిస్తుంది. కానీ, అలా వేచి చూడడం, దూర ప్రయాణాలు కలిసి ప్రయాణించడం, దూరమై మళ్లీ కలిసే క్షణాల కోసం ఎదురు చూడడం హద్దులు లేని ప్రేమకు ప్రతీకలేనట. మరి పాత పద్ధతుల్లా కనిపిస్తున్నా ఎన్ని కష్టాలు పడితేనో అంతటి ప్రేమ దక్కేనో..