SBI కస్టమర్లకు హెచ్చరిక : అకౌంట్లో డబ్బులు పోతే.. బ్యాంకుకు సంబంధం లేదు!

  • Published By: sreehari ,Published On : November 15, 2019 / 11:57 AM IST
SBI కస్టమర్లకు హెచ్చరిక : అకౌంట్లో డబ్బులు పోతే.. బ్యాంకుకు సంబంధం లేదు!

మీరు ఎస్బీఐ కస్టమర్లా? తస్మాత్ జాగ్రత్త. మీ అకౌంట్లో డబ్బులు పోతే బ్యాంకుతో సంబంధం లేదు. స్వయంగా ఎస్బీఐ బ్యాంకే ఈ సంచలన విషయాన్ని వెల్లడించింది. ఇప్పటికే ఎస్బీఐ.. తమ బ్యాంకు ఖాతాదారులకు హెచ్చరిస్తోంది. తెలిసో తెలియకో ఈ తప్పు చేయొద్దని ఖాతాదారులకు సూచిస్తోంది. లేదంటే.. మీ ఖాతాలో నగదు కోల్పోవాల్సిన పరిస్థితి వస్తుందని, ముందుగానే జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా పలు సూచనలు చేస్తోంది.

సోషల్ మీడియాలో చాలామంది బ్యాంకు ఖాతాదారులు తమ వ్యక్తిగత అకౌంట్ వివరాలను షేర్ చేస్తున్నట్టు ఎస్బీఐ దృష్టికి వెళ్లింది. అప్పటి నుంచి ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్బీఐ తమ ఖాతాదారులను అలర్ట్ చేస్తోంది. బ్యాంకు అకౌంటుకు సంబంధించి వివరాలను షేర్ చేయొద్దని గట్టిగా చెబుతోంది.

బ్యాంకు అకౌంట్ నెంబర్, మొబైల్ నెంబర్ లేదా ఇతర అకౌంట్ సంబంధిత వివరాలను సోషల్ మీడియాలో బహిర్గతం చేయరాదని వరుస ట్వీట్లతో హెచ్చరిస్తోంది. ఒకవేళ ఎవరైనా కస్టమర్.. తమ బ్యాంకు అకౌంట్ వివరాలను షేర్ చేసినట్టుయితే.. సోషల్ మీడియా నుంచి ఆ వివరాలను వెంటనే డిలీట్ చేయాలని సూచిస్తోంది.

ఒకవేళ ఎలాంటి అనుమానాస్పద లావాదేవీలు అకౌంట్ నుంచి జరిగినా.. నగదు కోల్పోయినా.. బ్యాంకుతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. అంతేకాదు.. ఎస్బీఐ బ్యాంకు నుంచి ఏ అధికారిగానీ, బ్యాంకు ఉద్యోగిగానీ కస్టమర్లకు ఫోన్ కాల్ చేసి వ్యక్తిగత వివరాలను అడగరు.

ఎలాంటి అనుమానాస్పద లింకులను మొబైల్ కు పంపించరు. VPA-UPI సంబంధిత వివరాలు, User ID, PIN, ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్ వర్డులు, CVV నెంబర్, OTPలను చెప్పమని అడగరు. మీకు ఫోన్ కాల్ లేదా SMS లేదా ఈమెయిల్ కూడా బ్యాంకు అధికారులు పంపరు’ అని ఎస్బీఐ క్లారిటీ ఇచ్చింది.