క్లీన్ ఇండియా: బస్సులను మహిళల టాయిలెట్లుగా మార్చేసిన పూణే సంస్థ 

  • Published By: sreehari ,Published On : February 21, 2020 / 09:50 PM IST
క్లీన్ ఇండియా: బస్సులను మహిళల టాయిలెట్లుగా మార్చేసిన పూణే సంస్థ 

పబ్లిక్ పార్కులకు వెళ్లిన సమయంలో ప్రధానంగా ఎదురయ్యే సమస్య.. టాయిలెట్లు లేకపోవడమే. దీని కారణంగా చాలామంది ఎక్కడికి వెళ్లాలో తెలియక ఇబ్బంది పడుతుంటారు. అదే మహిళలయితే మరి ఇబ్బంది పడతారు. పిల్లలు లేదా పురుషులు అయితే ఏదోలా కానిచ్చేయొచ్చు. కానీ, మహిళల విషయానికి వస్తే.. పబ్లిక్ పార్కుల దగ్గర టాయిలెట్ సమస్యతో చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతుంటారు. ప్రత్యేకించి మహిళల కోసం పబ్లిక్ పార్కుల్లో బస్పు టాయిలెట్లు అందుబాటులోకి వచ్చాయి.

పుణెకు చెందిన ఓ సంస్థ పబ్లిక్ టాయిలెట్ల సదుపాయాన్ని అందిస్తోంది. మహిళలు ఎవరైనా ఈ బస్సు టాయిలెట్లను వినియోగించుకోవాలంటే రూ.5 చెల్లిస్తే చాలు.. ఈ సదుపాయాన్ని పొందవచ్చు. అంతేకాదు.. చంటిపిల్లల తల్లులు కూడా పబ్లిక్ పార్కుల్లో తమ శిశువులకు చనుబాలు ఇవ్వాలంటే ఇబ్బందిపడిపోతుంటారు. ఈ బస్సుల్లో తల్లిపాలు తమ బిడ్డలకు పాలిచ్చేందుకు ప్రత్యేకమైన గదులు ఉన్నాయి. అంతేకాదు.. శానిటరీ న్యాప్ కిన్స్, డైపర్లు ఇలా మహిళలకు అవసరమైన వస్తువులన్నీ ఈ బస్సు టాయిలెట్లలో లభిస్తాయి.

పబ్లిక్ పార్కుల దగ్గర మహిళల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఈ తరహాలో టాయిలెట్ సర్వీసులు అందిస్తోంది. దేశవ్యాప్తంగా పలు ప్రధాన పార్కుల్లో టాయిలెట్ల కొరత అధికంగా ఉంది. మహిళలు ఎక్కువగా టాయిలెట్ల విషయంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొవాల్సిన పరిస్థితి వస్తోంది. ప్రధాని నరేంద్ర మోడీ ప్రధాన క్లీన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా లక్షలాది మరుగుదొడ్ల కార్యక్రమానికి స్పూర్తిగా పోర్టబుల్ టాయిలెట్ల ప్రాజెక్టును టి టాయిలెట్ పేరుతో పారిశ్రామికవేత్తలు ఉల్కా సదల్కర్, రాజీవ్ ఖేర్‌లు 2016లో ప్రారంభించారు.

టి టాయిలెట్.. ఇందులో టి.. అంటే.. మరాఠీలో ‘ఆమె’ అని అర్థం.. పబ్లిక్ టాయిలెట్ బస్సుల్లో మొత్తం 12 మొబైల్ వాష్ రూములు ఉంటాయి. సగటున 200 మంది మహిళలు ఈ బస్సు టాయిలెట్లను వినియోగిస్తున్నారు. బస్సులు.. వాహనంపైన అమర్చిన సోలార్ ప్యానెల్స్ సాయంతో పనిచేస్తున్నాయి. పోర్టబుల్ పారిశుధ్య వ్యాపారాన్ని నిర్వహిస్తున్న ఈ జంట పూణెలో పరిశ్రుభ్రతను మెరుగుపర్చడంలో భాగంగా ఈ ఆలోచనతో వచ్చినట్టు ఎంఎస్ సదల్కర్ తెలిపారు. మహిళలు శుభ్రమైన, సురక్షితమైన వాష్ రూమ్ లకు ప్రాప్యత పొందాలని తాము విశ్వసిస్తున్నామని చెప్పారు.

అది వారి ప్రాథమిక హక్కుగా పేర్కొన్నారు. రాబోయే ఐదేళ్లలో భారతదేశమంతటా 1,000 మరుగుదొడ్లను ప్రారంభించాలని ఈ జంట లక్ష్యంగా పెట్టుకున్నట్టు చెబుతోంది. ఈ మొబైల్ టాయిలెట్లలో శుభ్రమైన మరుగుదొడ్లు, టెలివిజన్ సెట్లు, ఉష్ణోగ్రత మానిటర్ అంటెండర్లను కూడా ఏర్పాట్లు చేశారు. అక్టోబర్ లో ప్రధాని మోడీ భారతదేశాన్ని బహిరంగ మలవిసర్జన రహితంగా ప్రకటించిన సంగతి తెలిసిందే.