‘ఆకాశం నీ హద్దురా!’ – రివ్యూ

  • Published By: sekhar ,Published On : November 12, 2020 / 02:32 PM IST
‘ఆకాశం నీ హద్దురా!’ – రివ్యూ

Aakaasam Nee Haddhu Ra: వెర్సటైల్ యాక్టర్ సూర్య, అపర్ణ బాలమురళి జంటగా .. ఎయిర్ డెక్కన్ వ్యవస్థాపకుడు జి.ఆర్.గోపినాథ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం Soorarai Pottru.. తెలుగులో ‘ఆకాశం నీ హద్దురా’ పేరుతో డబ్ చేశారు.

‘గురు’ ఫేం సుధ కొంగర దర్శకత్వంలో సూర్య 2డి ఎంటర్‌టైన్‌మెంట్, సిఖ్యా ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా నిర్మించారు.

భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమాని థియేటర్‌లోనే విడుదల చేయాలని తమిళనాడు సినీ పరిశ్రమలో కొందరు వివాదం చేసినా, వాళ్లందరినీ ఎదిరించి, ఓ‌టీటీలోనే రిలీజ్ చేశారు సూర్య. సినిమా ఎలా ఉందో చూద్దాం..



కథ..
చంద్ర మహేష్ (సూర్య) అనే ఒక పైలెట్ 2003లో విమానం ల్యాండింగ్ కోసం ప్రయత్నిస్తాడు. దానికి ఏవియేషన్ అధికారులు అంగీకరించరు.

అధికారులతో గొడవపడి మరీ ఆ విమానాన్ని ల్యాండ్ చేయిస్తాడు. ఇది ఎందుకు జరిగింది.. తరువాత అధికారులు చంద్ర మహేష్ పై తీసుకున్న చర్యలు ఏమిటి? దానికి అతని రియాక్షన్ ఏమిటి?

అసలు ఎందుకు ఆ విమానాన్ని అత్యవసరంగా కిందికి దించాడు? ఇక ఇందులో అతని భార్య సుందరి (అపర్ణ బాలమురళి), పరేష్ గోస్వామి (పరేష్ రావెల్), భక్తవత్సలం నాయుడు (మోహన్ బాబు) ఏం చేశారు అనేదే సినిమా.

నిజ జీవిత కథను తెరమీద ప్రేక్షకులకు వినోదాన్ని పంచే విధంగా అందించడంతో అటువంటి సినిమాలకు ఆదరణ దక్కుతోంది.

సరిగ్గా ‘ఆకాశం నీ హద్దురా’ కూడా అలానే వినోదాన్ని పంచుతూనే విషయాన్ని చెబుతుంది.
ఎలా ఉందంటే..


నిజజీవిత కథల్ని తెరమీద చెప్పేటప్పుడు ఒక ఆర్డర్ ప్రకారం చెబుతూ వెళ్తారు. కానీ, ఈ సినిమా ప్రత్యేకత ఏమిటంటే.. ఈ కథను వెనక్కి.. ముందుకీ అనే పద్ధతిలో చెప్పారు.

సరిగ్గా ఇక్కడే జాగ్రత్తగా సినిమాటిక్ అంశాలను జోడించడానికి స్పేస్ తీసుకున్నారు దర్శకురాలు. అందులో వినోదాన్ని చేర్చడానికి అవకాశాన్ని కల్పించుకున్నారు.

అంటే ఒక నిజమైన కథను.. సినిమాటిక్‌గా మార్చారాన్నమాట స్క్రీన్‌ప్లే తో. ఇక్కడే సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.

ఫస్ట్ హాఫ్ అంతా పూర్తి కమర్షియల్ హంగులతో పాటలు.. వినోదంతో నడిచిపోతుంది. ఇక రెండో భాగంలో అసలు కథ మొదలవుతుంది.

హీరో విమానయాన సంస్థ ఏర్పాటు చేయాలనుకోవడం.. దానికోసం పడే కష్టాలు.. అన్నీదాటి విజయవంతం కావడం..

వీటి మధ్యలో హీరో హీరోయిన్ల మధ్య నడిచే సన్నివేశాలు సినిమాని ఒక క్యూరియాసిటీతో చూసేలా చేస్తాయి. దీంతో సినిమా చూసిన ప్రతి ఒక్కరూ కూడా మంచి సినిమా చూసిన అనుభూతికి లోనవుతారు.
నటీనటులు..


ఈ సినిమా సూర్య సినిమా. ఇది పూర్తిగా వన్ మేన్ షో..ఈ పాత్రలో సూర్యను తప్పితే మరొకర్ని ఊహించలేం అన్నంతగా చంద్ర మహేష్ పాత్రలో ఇమిడిపోయారు సూర్య.

కొన్ని సన్నివేశాల్లో అయితే.. అప్రయత్నంగా సూర్య నటనకు మనం చప్పట్లు కొట్టేస్తాం.. అంత అద్భుతంగా చేశారు సూర్య.

ఇక విలన్‌గా పరేష్ రావెల్.. భక్తవత్సలంగా మోహన్ బాబు.. తమ పాత్రల పరిధి మేరకు చక్కని నటన కనబరిచారు. అపర్ణ ఈ పాత్రకు సరిగ్గా సరిపోయింది. ఇతర పాత్రలు ఇలా వచ్చి.. అలా వెళ్ళిపోయినా ఆకట్టుకునేలా చేశారు..


సాంకేతికంగా..

ఈ సినిమా క్రెడిట్ పూర్తిగా సుధా కొంగరదే. సూర్య లాంటి స్టార్ హీరోతో నిజ జీవిత కథ అంటే ఎంతో బ్యాలెన్సింగ్ ఉండాలి.

సూర్య ఇమేజ్‌ని హ్యాండిల్ చేయగలగాలి. ఈ రెండిటినీ సుధా కొంగర చక్కగా బ్యాలెన్స్ చేసుకున్నారు. సినిమాటిక్‌గా కథను చెప్పడానికి చేసిన ప్రయత్నమే సగం విజయానికి కారణం..

స్క్రీన్‌ప్లే సూర్యను పాత్రలో ఒదిగిపోయేలా చేసింది కానీ ఈ క్రమంలో సినిమా నిడివి ఎక్కువగా అనిపిస్తుంది. కొంత తగ్గించిఉంటే బాగుండనిపిస్తోంది కూడా. ఇది చిన్న మైనస్ అంతే..

ఇక సినిమా అంతా సాంకేతికంగా ఉన్నత విలువలతో ఉంది. జీవీ ప్రకాశ్‌ కుమార్‌ సంగీతం బాగుంది. రెండు పాటలు మాత్రం చాలా బావున్నాయి. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ సినిమాకు అదనపు బలాన్నిచ్చింది.

అలాగే కెమెరామెన్‌ నికేత్‌ బొమ్మిరెడ్డి సినిమాటోగ్రఫీ సినిమాకు ఆకర్షణీయంగా నిలిచింది. రాకేందు మౌళి రాసిన చక్కని మాటలు ఆకట్టుకుంటాయి. ఓవరాల్‌గా చెప్పాలంటే ‘ఆకాశం నీ హద్దురా’ ఒక స్ఫూర్తివంతమైన సినిమా.. సూర్య సినిమా..