హాస్యపు జల్లు ‘అల్లు’ 99వ జయంతి..

Allu Ramalingaiah Jayanthi: తెలుగు తెరపై హస్యపు జల్లు అల్లు అనే నానుడి కొన్ని సంవత్సరాలుగా వుంటూనే వుంది. ఆయన మనమధ్య లేకున్నా ఆయన వదిలిన పదాలు బాడి లాంగ్వేజి మరవలేని జ్ఞాపకాలు. ఆయన నటించే ప్రతిపాత్ర ఆయనకే స్వంతమా అనే రీతితో నటించి నవ్వించిన ఘనాపాటి పద్మశ్రీ.. శ్రీ అల్లు రామలింగయ్య గారు. హాస్యానికి తను చిరునామా అయ్యారు. హాస్యానికి పెద్ద పీట వేశారు… కానీ… ఏ పాత్రలోకైనా పరకాయప్రవేశం చేసి మెప్పించారు.
కామెడీ పాత్రలతో పాటు ఇతర పాత్రల‌్లోనూ రొమాంటిక్ కామెడీ చేయడం, భాద్యత కలిగిన తండ్రి పాత్రలు, విలన్ పక్కన వుండే కామెడీ విలన్ పాత్రలు, విలన్ పాత్రలు, స్నేహితుడి పాత్రలు, జమిందారు పాత్రలు, బంట్రోతు పాత్రలు, పోలీస్ ఆఫీసర్ పాత్రలు ఇలా ఒకటేమిటి.. సమాజంలో కనిపించే ప్రతి పాత్రలో ఆయన నటించి ఆ పాత్రల్ని బ్రతికించారు. అలాగే దర్శకుల, రచయితన పెన్ను నుండి జాలువారిన ప్రతి ఊహాజనిత పాత్రలకి కూడా ప్రాణం పోసిన మహానటుడు శ్రీ అల్లు రామలింగయ్య గారు.
ఆయన 1000 కి పైగా చిత్రాల్లో నటించారు. చివరిదాకా నటించి సినిమాపై తన ప్రేమని చాటుకున్న కళామతల్లి ముద్దుబిడ్డ అల్లు రామలింగయ్య గారు… ఎక్కువ చిత్రాల్లో నటించి సినీ జగత్తులో చాలా మంది నటీనటులకి మార్గదర్శకుడయ్యారు.. తెలుగు సినిమా చరిత్రలో వున్న గొప్ప క్లాసిక్స్‌లో అల్లు రామలింగయ్య గారి పాత్రలు వుండటం విశేషం.
హోమియోపతి డాక్టర్‌గా పలు సేవాకార్యక్రమాలు అందించారు. తరువాత తెలుగు సినీ పరిశ్రమలో నటుడిగా ఎంత బిజీగా వున్నా కూడా తన వృత్తిని మాత్రం వదల్లేదు. వీలున్నప్పుడల్లా సినిమా నటీనటులకు కూడా తన వైద్యాన్ని అందించారు. నిర్మాతగా మారి గీతా ఆర్ట్స్ బ్యానర్ స్థాపించి అనేక సూపర్‌హిట్స్ అందించారు. అలాంటి మహానటుడు, నిర్మాత శ్రీ అల్లురామలింగయ్య గారు పుట్టినరోజు అక్టోబర్ 1న కావటం విశేషం అయితే, ఈ సంవత్సరం పుట్టినరోజుకి మరో ఘనత వుంది.
ఇది ఆయన 99వ పుట్టినరోజు కావటం అలాగే 2021తో 100 సంవత్సారాలు పూర్తిచేసుకోబోతుండడం మరో విశేషం. ఈ సందర్బంగా ఒక ఫంక్షన్‌లో అల్లు అరవింద్ గారు మాట్లాడుతూ.. ‘‘మా నాన్న గారు స్వర్గీయ శ్రీ అల్లు రామలింగయ్య గారి తర్వాత నేను, నా తరువాత మా అబ్బాయిలు ఈ సినిమా ఇండస్ట్రీలోకి వచ్చాము. ఈ మధ్య ఎయిర్‌పోర్ట్‌లో ఒకావిడ నన్ను చూసి ‘నమస్కారం అరవింద్ గారు’.. అంటూ నమస్కరించింది. అక్కడే వున్నవాళ్ళ అమ్మకి ‘అల్లు రామలింగయ్య గారి అబ్బాయి’ అని నన్ను పరిచయం చేసింది. నాన్నగారు తరతరాలకు మా ఫ్యామిలీకి గుర్తింపునిచ్చారు’’.. అన్నారు.