పల్లె కోయిలమ్మ పాడిన ఫస్ట్ సినిమా సాంగ్ వచ్చేసింది

  • Published By: vamsi ,Published On : August 29, 2019 / 03:12 AM IST
పల్లె కోయిలమ్మ పాడిన ఫస్ట్ సినిమా సాంగ్ వచ్చేసింది

ఓ చెలియా నా ప్రియ సఖియా పాట పాడి.. సోష‌ల్ మీడియా ప్ర‌భావంతో ఓవ‌ర్‌నైట్ స్టార్‌గా మారిపోయిన తూర్పుగోదావరి జిల్లా వడిశలేరుకు చెందిన ప‌ల్లె కోయిల‌మ్మ  బేబి. మట్టిమనిషి నండి నేనూ.. పల్లె కోయిలమ్మ తెల్లవారె కూసే కూతే నా పాట అని పాడి పల్లె మట్టి వాసనలను తన గానామృతంతో వీనుల విందు చేసిన బేబీ తొలిసారి సినిమాలో కూడా పాట పాడింది.

‘ఓ సోగసరి’ అంటూ సాగే పాటను ‘పలాస 1978’ సినిమా కోసం బేబి పాడగా.. లేటెస్ట్ గా పాటను విడుదల చేసింది చిత్రయూనిట్. పల్లె కోయిలమ్మ పాటతో తన గానామృతాన్ని ప్రపంచానికి పరిచయం చేయించిన ప్రముఖ సంగీత దర్శకులు రఘుకుంచే సంగీత దర్శకత్వంలోనే ఈ పాట కూడా ”పలాస” సినిమా కోసం బేబీ పాడడం విశేషం.

కూలి ప‌నులు చేసుకుంటూ కాలం గడుపుతూ ఉండే బేబి ఇప్పుడు సెల‌బ్రిటీగా మారిపోయింది. ఈ పాట వింటే మనసు గుర్రంలా పరిగెత్తకమానదు అంటూ సంగీత దర్శకుడు రఘు కుంచె పాటను సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. ఈ పాటకు సాహిత్యాన్ని రచయిత లక్ష్మి భుపాల అందించగా.. ఈ పాటలో మేల్ వాయిస్ ను ప్రముఖ గాయకులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడడం విశేషం.

ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ సమర్పణలో ధ్యాన్ అట్లూరి నిర్మాతగా కరుణ కుమార్ దర్శకత్వంలో పిరియాడిక్ క్రైమ్ స్టోరీగా తెరకెక్కుతున్న సినిమా ‘పలాస 1978’.