‘ఆహా’లో మెయిల్.. కంబాలప‌ల్లి క‌థ‌ల్లో ఓ కథ రివ్యూ!

‘ఆహా’లో మెయిల్.. కంబాలప‌ల్లి క‌థ‌ల్లో ఓ కథ రివ్యూ!

పెళ్లిచూపులు సినిమాతో తెలుగుతెరకు దొరికిన మేటి కమెడియన్ ప్రయదర్శి.. మ‌ల్లేశం సినిమాలో హీరోగా న‌టించి ప్రేక్ష‌కుల నుంచి మంచి మార్కులు కొట్టేశాడు.. త‌న‌దైన శైలిలో కామెడీ ట‌చ్‌తో అంద‌రినీ అల‌రించే ప్రియ‌ద‌ర్శి ఇపుడు “కంబాలప‌ల్లి క‌థ‌లు” పేరుతో వెబ్ సిరీస్ చేస్తున్నాడు. ఉద‌య్ గుర్రాల ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌మవగా.. వ‌రంగ‌ల్ స‌మీపంలోని కంబాల‌ప‌ల్లి అనే కుగ్రామం నేప‌థ్యంలో వెబ్ సిరీస్ తెర‌కెక్కుతోంది.

‘2005.. అప్పుడప్పుడే ఊర్లల్లో కంప్యూటర్ పరిచయం అవుతున్న రోజులు’ అంటూ ఫస్ట్ ఛాప్టర్‌ను ఇటీవలే చిత్రయూనిట్.. తెలుగు ఓటీటీ యాప్ ‘ఆహా’‌లో విడుదల చేసింది. జనవరి 12న ఆహాలో విడుదలైన ఈ చిత్ర ఫస్ట్ పార్ట్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ప్రియదర్శితో పాటు.. హర్శిత్ మల్గిరెడ్డి, గౌరి ప్రియ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా గురించి తెలుసుకోవాలంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే.

కంబాలప‌ల్లి క‌థ‌ల్లో ఫస్ట్ చాప్టర్ ‘మెయిల్’గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సంక్రాంతి కానుకగా ఈ సినిమా ఆహాలో జనవరి 12న విడుదలైంది.

కథ విషయానికి వస్తే.. రవి కుమార్ (హర్షిత్ రెడ్డి) అప్పుడప్పుడే కంప్యూటర్లు గ్రామాల్లోకి వస్తున్న రోజుల్లో కంప్యూటర్లపై ఎక్కువగా ఇష్టాన్ని పెంచుకుంటాడు. కంప్యూటర్ కోర్స్ చేయాలని నిశ్చయించుకుని, కంబాలపల్లిలో కొత్తగా కంప్యూటర్ ట్రైనింగ్ సెంటర్ ప్రారంభం అవగా.. ఆ కంప్యూటర్ ట్రైనింగ్ సెంటర్ రవికుమార్ జీవితంలో ఎలాంటి మార్పులు తెస్తుందనేది సినిమాలో చూపించారు. ప్రపంచవ్యాప్తంగా ఐటీ విప్లవం మొదలవుతున్న సమయంలో కంప్యూటర్ కోర్సు మీద పల్లెటూరి జనాలకు క్రేజ్ ఎలా ఉండేదో బాగా చూపించారు. తెలంగాణలోని కంబాలపల్లి అనే ఓ పల్లెటూరిలో రవికుమార్ అనే కుర్రాడు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కావాలనే లక్ష్యంతో ఉంటే.. కంప్యూటర్ అంటే ఎంత ఇష్టమో.. తాను ఇష్టపడ్డ అమ్మాయిని మించి దాని పట్ల ప్రేమ పెంచుకున్నాడో.. అదే ఊరికి చెందిన హైబత్(ప్రియదర్శి) కొత్తగా ఊరికి తెచ్చిన కంప్యూటర్‌లో రవి కంప్యూటర్ నేర్చుకోవాలని అనుకోవడం.. ఇదే ‘మెయిల్’ కథ.

కథనం ఎలా ఉందంటే? ఆవకాయలో నెయ్యేసుకుని అన్నం తింటే నాలుకకు ఎంత రుచి వస్తుందో? ఈ సినిమా చూస్తే అంత తృప్తి కలుగుతోంది అన్నట్లుగా ఉంది. పూర్తిగా తెలంగాణ గ్రామీణ వాతావరణంలో తెరకెక్కిన ఈ సినిమాలో రెగ్యులర్ ఫార్ములాలు ఏం లేవు.. నాలుగు ఫైట్లు.. ఆరు పాటలు.. అందులో ఓ ఐటమ్ సాంగ్ అనే పద్దతులు అసలే కనిపించవు.. కంటి నిండా ఆనందం.. కడుపుబ్బ నవ్వు.. కంప్యూటర్ పై హీరోకి ఉన్న ఇష్టం.. అందుకు సంబంధించిన కోర్సు నేర్చుకోవడానికి పడే తాపత్రయం.. ఆ రోజుల్లో పరిస్థితులు దర్శకుడు చాలా నేచురల్‌గా తెరకెక్కించాడు.

కేరాఫ్ కంచరపాలెం మిడిల్ క్లాస్ మెలోడీస్ లాంటి సినిమాలు అయిన తర్వాత ఇటువంటి సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తారనే అభిప్రాయంతో నేచురాలిటీకి దగ్గరగా.. జాగ్రత్తగా సినిమాను తీశాడు దర్శకుడు. సీన్లు కూడా సరదాగా చాలా బాగా తీశారు. ప్రస్తుతం పల్లెటూర్ల నుంచే లక్షలాది మంది సాఫ్ట్ వేర్ ఇంజినీర్లుగా ఎదిగిన తర్వాత.. అప్పట్లో జనాలు కంప్యూటర్లు.. సాఫ్ట్‌వేర్లు అంటే ఏమీ తెలియకుండా అమాయకంగా ఉండేవారు అనే విషయాలను చాలా బాగా చూపించారు.. పండుగ వాతావరణంలో ఇళ్లకు వచ్చిన పాతతరం సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లకు కచ్చితంగా ఈ సినిమా కనెక్ట్ అవ్వొచ్చు. కంప్యూటర్‌తో ప్రేమలో పడ్డ కుర్రాడి జీవితాన్ని ఎంతో సహజంగా పల్లెటూరు వాతావరణంలో అందంగా చూపించారు.

స్పామ్ మెయిళ్లు పంపించి చేస్తున్న స్కామ్‌లు, సైబర్ క్రైమ్‌లు ఆ రోజుల్లో తక్కువ అయినా కూడా.. ఇప్పుడు ఉన్నంత అవగాహన ఆ రోజుల్లో లేకపోవడంతో.. కోట్లు గెలుచుకున్నారంటూ మెయిల్స్ పంపి.. ప్రాససింగ్ ఫీ అంటూ లక్షలు కొట్టేసే కాన్సెప్ట్‌ను బాగా మేనేజ్ చేశాడు దర్శకుడు.. తనకు ఏదో ఒక మెయిల్ వస్తే బాగుండని చూస్తున్న హీరోకు ఏకంగా రెండు కోట్ల లాటరీ తగిలిందని మెయిల్ వస్తే ఎలా ఉంటుంది.. దాని ఉచ్చులో పడి అతను ఎటువంటి సమస్యల్లో చిక్కుకున్నాడు.. చివరకు ఎలా బయటపడ్డాడనే కథనంతో ద్వితీయార్ధాన్ని నడిపించాడు. హీరో ప్రేమ కథ.. అవసరానికి డబ్బులిచ్చి హీరో కుటుంబాన్ని మోసం చేసే వడ్డీ వ్యాపారి వ్యవహారాల్ని కూడా ఈ కంప్యూటర్ కథతో చక్కగా ముడిపెట్టి వాటిని కూడా సమాంతరంగా చక్కగా నడిపించాడు.

ఎవరెలా చేశారంటే?
తెలంగాణ యాస, బాసను ఎక్కడా తక్కువ చెయ్యకుండా.. సహాజమైన పదాలను వాడుకుంటూ రాసిన డైలాగులు మెప్పిస్తాయి. మనుషులకు రోగం ఎట్లనో.. కంప్యూటర్‌కి వైరస్ అట్లా.. అంటూ ప్రియదర్శి చెప్పిన డైలాగుల్లో.. తన అమాయకత్వాన్ని బయటపడకుండా.. అర్థం కాకుండా.. చాలా బాగా నటించాడు. ప్రియదర్శి పాత్ర నిడివి తక్కువే కానీ.. కనిపించిన ప్రతి సన్నివేశంలోనూ ఆకట్టుకున్నాడు. కొత్త కుర్రాడైన హర్షిత్ రెడ్డి రవికుమార్ పాత్రను చక్కగా పోషించాడు. గౌరి పాత్రలో హీరోయిన్ సహజంగా కనిపించింది.

ఓవరాల్‌‌గా సంక్రాంతి వేళ థియేటర్లలో పెద్ద సినిమాలు పెద్దగా ఆకట్టుకోలేకపోయినా ఓటీటీలో మాత్రం మెయిల్ ‘ఆహా’ అనిపిస్తోంది.