RIP : బతికుండగానే చావు వార్తలు చదువుకున్న వేణుమాధవ్

RIP : బతికుండగానే చావు వార్తలు చదువుకున్న వేణుమాధవ్

ఓ మనిషి బతికుండగానే చనిపోయాడు అంటే ఎలా ఉంటుంది.. అందులోనూ సెలబ్రిటీ అయితే.. ఇది వేణుమాధవ్ విషయంలో చాలాసార్లు జరిగింది. ఎన్నోసార్లు ఆయన్ను చంపేసింది మీడియా. బతికుండగానే చంపేసి మానసిక క్షోభకు గురి చేసింది మీడియా. కొద్దికాలంగా ‘అనారోగ్యంతో ఉన్న వేణుమాధవ్ ఇక మనకు లేడు. నిమ్స్ ఆస్పత్రిలో చివరిసారిగా మాట్లాడిన వేణుమాధవ్’ అంటూ  కొన్ని మీడియాలు, సోషల్ మీడియా పెద్దఎత్తున కథనాలు రాశాయి. 

వీటిపై ఆయనే స్వయంగా స్పందించారు కూడా. ‘నా చావును నాకే చూపించారు’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా ఒక్కసారి కాదు. వేణుమాధవ్ ఆస్పత్రిలో జాయిన్ అయిన ప్రతిసారీ చనిపోయాడంటూ రాసేశారు. అంతెందుకు నిన్నటికి నిన్న సికింద్రాబాద్ లోని ఓ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు అని వార్తలు వస్తే.. వేణుమాధవ్ ఇకలేరు, చనిపోయారు అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అయ్యింది. 

Read Also :  వేణు మాధవ్ ఆత్మకు శాంతి చేకూరాలి : పవన్ కళ్యాణ్..

చివరకు కుటుంబ సభ్యులు బయటకు వచ్చి.. వేణుమాధవ్ బతికే ఉన్నారు.. ఇంకా చనిపోలేదు అని ప్రకటించాల్సిన దుస్థితి తీసుకొచ్చారు. వేణుమాధవ్ విషయంలోనే చాలాసార్లు ఇలా జరగటం అతని కుటుంబాన్ని తీవ్ర మనోవేదనకు గురి చేసింది. బతికున్న మనిషిని ఎలా చంపేస్తారండీ అని కూడా ప్రశ్నించారు. తన చావు వార్తలను తానే చదువుకున్న వేణుమాధవ్ క్షోభ అంతాఇంతా కాదు. తుది శ్వాస విడిచే 24 గంటల ముందు కూడా.. చనిపోయారు అంటూ వార్తలు రాసేశారు. 

ఎందుకో తెలియదు కానీ.. వేణుమాధవ్ బతికి ఉన్నప్పుడే తన చావు వార్తలను తానే చదువుకున్న వ్యక్తిగా చరిత్రలో నిలిచిపోయారు.. ఇన్నిసార్లు ఇంకెవరి విషయంలోనూ జరగకపోవటం కూడా విచిత్రం.. విశేషం.