Mixed Vaccines : యూపీలో తొలి డోసు కోవిషీల్డ్,సెకండ్ డోస్ కోవాగ్జిన్..వైద్యుల నిర్వాకంతో గ్రామస్థుల్లో ఆందోళన

ఉత్తరప్రదేశ్ లో ఓ గ్రామంలో కోవిడ్ వ్యాక్సిన్ మిక్సింగ్ జరిగిపోయింది.

Mixed Vaccines : యూపీలో తొలి డోసు కోవిషీల్డ్,సెకండ్ డోస్ కోవాగ్జిన్..వైద్యుల నిర్వాకంతో గ్రామస్థుల్లో ఆందోళన

20 Up Villagers Get Mixed Doses Of Covid Vaccines

Mixed Vaccines ఉత్తరప్రదేశ్ లో ఓ గ్రామంలో కోవిడ్ వ్యాక్సిన్ మిక్సింగ్ జరిగిపోయింది. తొలి డోస్ ఏ టీకా తీసుకుంటే రెండో డోస్‌ కూడా అదే తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తుండగా..సిద్ధార్థ్ నగర్ జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన దాదాపు 20 మందికి మాత్రం ఏప్రిల్ 1న ఫస్ట్ డోస్ కింద కోవిషీల్డ్ ఇవ్వగా..మే 14న వీరికి రెండో డోస్‌ కొవాగ్జిన్ ఇచ్చినట్టు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ 20 మంది ఇంతకూ టీకా తీసుకున్నట్టా లేక తీసుకోనట్టా? అంటే వారికి కోవిడ్ నుంచి రక్షణ లభిస్తుందా లేదా? అనేది ప్రశ్నగానే మిగిలిపోయింది.

అయితే ఇది పొరపాటున జరిగిందని ఎవరికీ ఎలాంటి సమస్యలూ రాలేదని అధికారులు తెలిపారు. రెండు రకాల టీకాలు కలిపి ఇవ్వమని ఎలాంటి ఆదేశాలు లేవు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించి నివేదిక కోరాం. ఈ నిర్వాకం చేసినవారికి వివరణ కోరాం. దీనిపై అవసరమైన చర్యలు తీసుకుంటాం అని సిద్ధార్థ్ నగర్ జిల్లా చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సందీప్ చౌధురి అన్నారు. మిక్సిడ్ వ్యాక్సిన్లు తీసుకున్న గ్రామస్థులందరితో తమ వైద్య బృందం మాట్లాడిందని, ఎటువంటి దుష్పరిణామాలు ఎదుర్కొలేదని చెప్పారని సందీప్ చౌధురి పేర్కొన్నారు.

కానీ ఓ గ్రామస్థుడు మాత్రం తమను ఎవరూ కలవలేదని తెలిపారు. నాకు ఆందోళనగానూ, భయంగానూ ఉంది. రెండో డోసు కోసం పోతే చూసుకోకుండా వేరే వ్యాక్సిన్ ఇచ్చారు. అధికారులు ఎవరూ వచ్చి చూసిన పాపాన పోలేదు అని రామూ సూరత్ అనే గ్రామస్థుడు చెప్పారు. ఇక,దేశంలో వ్యాక్సినేషన్ నెమ్మదిగా సాగుతున్న పెద్ద రాష్ట్రాల్లో యూపీ ముందు వరుసలో ఉంది. యూపీలోని 23 కోట్ల జనాభాలో ఇప్పటివరకు 33 లక్షల మందికి మాత్రమే టీకాలు వేశారు.