అయోధ్య రామ మందిర నిర్మాణం కూడా సంప్రదాయ పద్ధతుల్లోనే.. ప్రకృతి వైపరీత్యాలకు తట్టుకునేలా ఇంజినీర్ల ప్లాన్

అయోధ్య రామ మందిర నిర్మాణం కూడా సంప్రదాయ పద్ధతుల్లోనే.. ప్రకృతి వైపరీత్యాలకు తట్టుకునేలా ఇంజినీర్ల ప్లాన్

అయోధ్య రామ మందిర నిర్మాణ పనులు ప్రారంభమైపోయాయి. ప్రధాని నరేంద్ర మోడీ చేతులు మీదుగా జరిగిన భూమి పూజ కార్యక్రమం తర్వాత గురువారం నుంచి పనులు మొదలుపెట్టినట్లు శ్రీ రామ్ జన్మభూమి తీర్థ్ క్షేత్ర వెల్లడించింది. ఈ మేరకు అధికారికంగా ట్విట్టర్ ద్వారా తెలియజేసింది. ఆలయాన్ని నిర్మించే ప్రాంతంలో ప్రస్తుతం ఎల్ అండ్ టీ సంస్థతో కలిసి ఐఐటీ మద్రాస్, సీబీఆర్ఐ రూర్కీ ఇంజనీర్లు మట్టి స్వభావాన్ని పరీక్షిస్తున్నారు.



ఇదే సందర్భంగా ఆలయ నిర్మాణ పనులను 36 నుంచి 40 నెలల కాలంలో పూర్తవుతుందంటూ అంచనా వేస్తున్నారు. ‘పురాతన, సంప్రదాయబద్ధమైన నిర్మాణ నైపుణ్యాలను అనుసరించి మందిర నిర్మాణం జరుగుతుంది. భూకంపాలు, తుపానులతో పాటు అన్ని ప్రకృతి వైపరీత్యాలను తట్టుకునే విధంగా ఆలయాన్ని నిర్మిస్తున్నాం. మందిర నిర్మాణంలో ఐరన్ వాడటం లేదు’ అంటూ ట్వీట్‌ చేసింది.



రామాలయ నిర్మాణం కోసం కొన్ని దశాబ్దాల పాటు కోర్టుల్లో మహా సంగ్రామమే నడిచింది. చివరికి మార్గం సుగమైంది. కలియుగాన అయోధ్య మరోమారు పట్టం కడుతోంది. దాదాపు 500 సంవత్సరాల పాటు విశ్వాసాలు, విధ్వంసాల చరిత్ర గొడవల్లో నలిగి… అత్యున్నత న్యాయస్థానం తీర్పుతో అందరికీ ఆమోదయోగ్యంగా.. సయోధ్యకు ప్రతీకగా… మళ్లీ సరయూ తీరంలో.. అదే అయోధ్యలో ఘనంగా కొలువు తీరబోతున్నాడు శ్రీరాముడు.