Drunk Buffaloes: మద్యం దాచుకున్న రైతులు..తాగేసిన గేదెలు..వింత వింత ప్రవర్తన

అసలే కోతి. పైగా కల్లు తాగింది అని..అంటాం. కోతి చేసేవన్నీ చిలిపి పనులే.అటువంటి కోతి కల్లు తాగితే ఇక ఆ పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవటం కష్టమే. కల్లు కోతి మాట పక్కన పెడితే.. మూడు గేదెలు 101 బాటిళ్ల మద్యం తాగేశాయి. ఇక వాటి పరిస్థితి ఎలా ఉందంటే..

Drunk Buffaloes: మద్యం దాచుకున్న రైతులు..తాగేసిన గేదెలు..వింత వింత ప్రవర్తన

Drunk Buffaloes In Gujarat

Drunk Buffaloes In Gujarat : అసలే కోతి. పైగా కల్లు తాగింది అని..అంటాం. కోతి చేసేవన్నీ చిలిపి పనులే.అటువంటి కోతి కల్లు తాగితే ఇక ఆ పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవటం కష్టమే. కల్లు కోతి మాట పక్కన పెడితే రెండు పెగ్గులేస్తే కొంతమంది మనుషులే తిక్క తిక్క చేస్తారు. అటువంటిది ఏకంగా గేదెలు మద్యం తాగితే ఎలా ఉంటుంది? కొంతమంది రైతులు చేసిన నిర్వాకం వల్ల పాపం కొన్ని గేదెల పరిస్థితి అలాగే అయ్యింది గుజరాత్ లో. పాపం తాగింది మద్యం అని తెలియన ఆ గేదెలు వింత వింతగా ప్రవర్తించిన విచిత్ర ఘటనగుజరాత్ లోని అహ్మదాబాద్ లో చోటుచేసుకుంది. ఒక్కటి కాదు.. రెండు కాదు ఏకంగా 101 బాటిళ్ల మద్యాన్ని తాగేశాయి మూడు గేదెలు. ఇక వాటి పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోండి..పిచ్చి లేచిపోయింది పాపం వాటికి. ఏం జరిగిందో కూడా అర్థం చేసుకోని ఆ మూగ జీవాల పరిస్థితి దబిడిదిబిడిగా మారిపోయింది.

గుజరాత్ లో పూర్తి మద్యపానం నిషేధం కొనసాగుతుంది. ఎవరైనా మద్యం తాగినట్లు గానీ, మద్యాన్ని అమ్మినట్లు గానీ తెలిస్తే పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. మద్యపాన నిషేధం ఉంటే రాష్ట్రంలో అంతా మద్యం తాగటం మానేస్తారని అనుకోవటానికి లేదు కదా. ఎలాగోలా దొరకబుచ్చుకుని అయినా తాగుతారు. పక్క రాష్ట్రానికి వెళ్లి మరీ తెచ్చుకుంటారు. అయితే అహ్మదాబాద్ కు చెందిన గాంధీనగర్ చిలోడా పోలీస్ స్టేషన్ పరిధిలోని దినేష్ ఠాకూర్, అంబరం ఠాకూర్, రవి ఠాకర్‌ అనే ముగ్గురు రైతులు రూ.35 వేలు విలువ చేసే 101 మద్యం బాటిళ్లను ఎక్కడ నుంచి సంపాదించారో తెలియదు గానీ సారా వంటి మద్యాన్ని సంపాదించారు. అలా తెచ్చిన మద్యాన్ని ఎక్కడ దాచోలో వారికి అర్థం కాలేదు. ఎవ్వరికీ తెలియకుండా ఉండే చోట దాచి పెట్టాలనుకున్నారు.

ఇంట్లో దాస్తే పోలీసులు పట్టుకుంటారనే భయంతో ఆ ముగ్గురు రైతులు తమ పొలం వద్ద ఉన్న నీటి కాలువ తూము వద్ద దాచిపెట్టుకున్నారు. అవసరమైనప్పుడు ఎవ్వరికి తెలియకుండా తాగుదామనుకున్నారో లేదా అధిక ధరకు అమ్ముకుందామనుకున్నారో తెలీదు గానీ..వాటిని కాలువ తూములో దాచిపెట్టారు. ఈ విషయం ఎవ్వరికీ తెలియలేదని సంబరపడ్డారు. కానీ ఊహించనివిధంగా బాటిళ్ల మూతలు విరిగిపోయి..బాటిళ్లలో ఉన్న కాలువ తూములో ఉన్న నీటిలో మద్యం కలిసిపోయింది. ఆ విషయం వారు గుర్తించారు. కానీ ఈ విషయం బైటకు తెలిస్తే తమ గుట్టు బయటపడిపోతుందని గుట్టు చప్పుడు కాకుండా ఉండిపోయారు.

కాలువలోని మద్యం కలిసిన నీటిని దినేష్ ఠాకూర్ తన రెండు గేదెలతో పాటు ఒక దూడ తాగాయి. ఆ తరువాత కొద్దిసేపటి తర్వాత అవి వింతగా ప్రవర్తించాయి. అటూ ఇటూ తూగుతూ నడిచాయి. గెంతులేశాయి. పిచ్చెత్తినట్లుగా అటూ ఇటూ తిరిగాయి. ఆ తరువాత కొద్దిసేపటికి వాటి నోటి వెంట నురగ కూడా వచ్చింది. అది గమనించిన రైతులు ఆందోళన చెందారు. వెంటనే పశుల డాక్టర్ వద్దకు తీసుకెళ్లారు. వాటిని పరీక్షించిన డాక్టర్ ఏం జరిగిందని రైతుల్ని అడుగగా..ఇలా కాలువలో నీరు తాగిన తరువాత ఇలా ఉన్నాయని తెలిపారు.

పొలాల వద్ద దాచిన మద్యం బాటిళ్లు ఆ నీటిలో కలిసి కులుషితం అయ్యాయని డాక్టర్ కు చెప్పాడు. ఆ నీటిని తాగడం వల్లనే గేదెలు ఇలా ప్రవర్తిస్తున్నాయని తెలిపారు. చివరకు డాక్టర్ పోలీసులు ఫిర్యాదు చేశాడు. పోలీసులు వచ్చి ఆ ముగ్గురు రైతుల్ని అరెస్టు చేశారు. మద్యం తాగిన గేదెలకు చికిత్స అందించడంతో కోలుకుంటున్నాయి. దీనిపై కేసు నమోదు చేసుకున్న చిలోడా పోలీస్ స్టేషన్ పీఎస్ఐ ఎన్ జి పర్మార్ ఈ కేసుపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు. వారు ఆ మద్యం ఎక్కడనుంచి తెచ్చారు? ఎవరు అమ్మారు? వీరికి అసలు అది ఎక్కడనుంచి లభించింది? అనే పలు కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.