టెక్కీ మరణం: ఫ్లెక్సీ ఏర్పాటు చేసిన నేత అరెస్టు

టెక్కీ మరణం: ఫ్లెక్సీ ఏర్పాటు చేసిన నేత అరెస్టు

కొద్ది రోజుల క్రితం చెన్నైలో రోడ్డు పక్కన ఏర్పాటు చేసిన అక్రమ హోర్డింగ్ కూలి ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని మృతి చెందిన విషయం తెలిసిందే. దీంతో అక్రమంగా ఏర్పాటు చేసిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. దీనిపై ఫోకస్ చేసిన పోలీసులు ఎట్టకేలకు దానికి కారణమైన రాజకీయ నాయకుడిని అదుపులోకి తీసుకున్నారు. 

గురువారం(సెప్టెంబర్-12,2019)సాయంత్రం దక్షిణ చెన్నైలో స్కూటీపై ఇంటికి వెళుతున్న సుభశ్రీపై అధికార పార్టీ ఏఐఏడీఎంకే పార్టీ బ్యానర్ ఒక్కసారిగా ఆ యువతిపై పడటంతో ఆమె బ్యాలెన్స్ కోల్పోయి రోడ్డుపై పడింది. అయితే, అప్పుడే వేగంగా వస్తున్న వాటర్ ట్యాంకర్ ఆమెపై నుంచి దూసుకెళ్లడంతో శుభశ్రీ ప్రాణాలు కోల్పోయింది.

కాంచీపురం తూర్పు ఎంజీఆర్ మండ్రం అసిస్టెంట్ సెక్రటరీ ఎస్ జయగోపాల్ కొడుకు పెళ్లికి ఈ ఫ్లెక్సీని ఏఐఏడీఎంకే కౌన్సిలరే ఏర్పాటు చేసినట్లు తేలింది. సోషల్ మీడియా వేదికగా రేగిన రచ్చ‌తో జయగోపాల్‌పై రెండు కేసులు నమోదు అయ్యాయి. బహిరంగ ప్రదేశాలను పాడు చేయడం, అక్రమంగా అడ్వర్టైజ్‌మెంట్‌లు ఏర్పాటు చేయడం అంశాల్లో అతనిపై కేసు నమోదు అయింది. 

ప్రతి చిన్న కార్యక్రమానికి ఫ్లెక్సీలు ఏర్పాటు చేయకూడదని కోర్టు పలుమార్లు వారించింది. అనుమతి లేకుండా హోర్డింగ్ లు ఏర్పాటు చేయొద్దని సూచించింది. ఘటన జరిగిన వెంటనే స్పందించిన స్టాలిన్.. అధికార దాహానికి, అరాచక పాలన కారణంగా రాష్ట్రంలో ఇంకెతమంది ప్రాణాలు కోల్పోవాలి అని  ప్రశ్నించారు.