2000 Notes: బ్యాంకులకు తిరిగొచచ్చిన 93 శాతం 2 వేల రూపాయల నోట్లు.. నోట్ల మార్పుకు ఈ నెలే లాస్ట్
ఎవరైనా సరే సమీపంలోని తమ బ్యాంకు బ్రాంచును సంప్రదించి అకౌంట్ వివరాలను తెలియజేసి 2,000 రూపాయల నోట్లు మార్చుకోవచ్చు. అయితే ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం.. బ్యాంకు అకౌంట్ లేనివారు సైతం 2,000 రూపాయల నోట్లను మార్చుకోవచ్చు.

2000 Notes- RBI: పెద్దనోట్ల రద్దు అనంతరం 2,000 నోటు వాడుకలోకి వచ్చిన ఆరేళ్ల తర్వాత ఈ నోటును కూడా వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఈ ప్రకటన చేసిన 20 రోజులకు దేశంలో వినియోగంలో ఉన్న సుమారు 50 శాతం 2,000 రూపాయల నోట్లు వెనక్కి వచ్చాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ (ఆర్బీఐ) శక్తికాంత దాస్ జూన్ లో ప్రకటించారు. ఇక బ్యాంకు డిపాజిట్ల రూపంలో 85 శాతం కరెన్సీ వెనక్కి వచ్చిందని ఆయన స్పష్టం చేశారు.
కాగా, రూ.2 వేల నోట్లు మార్చుకోవడానికి ఈ నెల చివరి తేదీ. అయితే ఈ నెల ప్రారంభం నాటికే 93 శాతం కరెన్సీ వెనక్కి వచ్చినట్లు ఆర్బీఐ వెల్లడించింది. తిరిగొచ్చిన 2 వేల రూపాయల నోట్ల విలువ రూ.3.32 లక్షల కోట్లని, రూ. 0.24 లక్షల కోట్లు విలువ చేసే రూ.2,000 నోట్లు ప్రజల దగ్గర ఉన్నాయని ఆర్బీఐ పేర్కొంది. తిరిగొచ్చిన నోట్లలో 87 శాతం డిపాజిట్ల రూపంలోనే వచ్చాయట. మిగిలిన వాటిని ప్రజలు బ్యాంకుల్లో తక్కువ విలువ గల నోట్లలోకి మార్చుకున్నారట. ఇక ఈ ఏడాది మే 19వ తేదీన ఈ నోట్లను ఉపసంహరించుకుంటున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది.
వాస్తవానికి రూ.2,000 నోటు ఉపసంహరణకు ముందే చెలామణి తగ్గింది. 2018 నుంచి 2023 వరకు చూసుకున్నట్లైతే ఈ కరెన్సీ వినియోగం 46 శాతం తగ్గినట్లు అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 2018లో 6.73 లక్షల కోట్ల రూపాయల రెండు వేల నోట్లు చెలామణిలో ఉండగా అది 2023 నాటికి 3.62 లక్షల కోట్ల రూపాయలకు తగ్గింది. మార్చి నాటికి చలామణిలో ఉన్న మొత్తం కరెన్సీలో రెండు వేల రూపాయల నోట్లు కేవలం 10 శతమేనని సెంట్రల్ బ్యాంక్ తెలిపింది.
రూ.2,000 నోట్లను ఎలా మార్చుకోవాలి?
ఎవరైనా సరే సమీపంలోని తమ బ్యాంకు బ్రాంచును సంప్రదించి అకౌంట్ వివరాలను తెలియజేసి 2,000 రూపాయల నోట్లు మార్చుకోవచ్చు. అయితే ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం.. బ్యాంకు అకౌంట్ లేనివారు సైతం 2,000 రూపాయల నోట్లను మార్చుకోవచ్చు. అంతకంటే ముందు కస్టమర్లు తమ పేరు, డినామినేషన్ వివరాలు, లొకేషన్, మార్చుకునే తేదీ వంటి వివరాలతో బ్యాంక్ వద్ద రిక్వెస్ట్ స్లిప్‌ను ఫిల్ చేయాలి. కస్టమర్లు తమ 2,000 రూపాయలను నోట్లు ఎక్స్ఛేంజ్ చేయడానికి సమీపంలోని బ్యాంక్‌కి వెళ్లి ఫారమ్‌ను సమర్పించవచ్చు.
INDIA 3rd Meet: ఇండియా కూటమి 2024 ఎన్నికల వ్యూహం ఇదే.. ఈ 5 కమిటీలతో బీజేపీని కొట్టాలని ప్లాన్
2,000 రూపాయల వేల నోట్ల మార్పిడికి సంబంధించి ఎలాంటి ఐడెంటిటీ ప్రూఫ్ ఇవ్వాల్సిన అవసరం లేదని, ఎలాంటి ఫారమ్‌ను ఫిల్ చేయనక్కర్లేదని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పష్టం చేసింది. రిక్విజిషన్ స్లిప్ లేకుండా గరిష్ఠంగా 20 వేల రూపాయల విలువ చేసే రెండు వేల రూపాయలు నోట్లను మార్పిడి చేసుకోవచ్చని తెలిపింది. ఈ నోట్లను ఒకరి ఖాతాలో డిపాజిట్ చేయడానికి నిర్దిష్ట పరిమితి అంటూ ఏదీ లేదు. అయితే ఇది KYC నిబంధనలు, ఇతర చట్టపరమైన అవసరాలకు అనుగుణంగా ఉండాలి.
ఈ నిర్ణయం ఎందుకు తీసుకోవడానికి గల కారణం
నల్లధనం నిల్వలను అరికట్టేందుకు 2,000 రూపాయల నోట్ల ముద్రణను నిలిపివేయాలని ఆర్బీఐ కొన్నేళ్ల క్రితమే నిర్ణయం తీసుకుందట. ఇక ఇప్పుడు ఈ నోట్లు చాలా అరుదుగా చెలామణిలో ఉన్నందున వీటిని వెనక్కి తీసుకోవాలని నిర్ణయం తీసుకుంది. రెండు వేల రూపాయల నోట్లను 2016 నవంబరులో ప్రవేశ పెట్టారు. 1934 ఆర్బీఐ చట్టంలోని సెక్షన్ 24(1) ప్రకారం ఈ నోట్లను చెలామణిలోకి తీసుకువచ్చారు. ఈ చట్టం ప్రకారం 10 వేల రూపాయలలోపు సందర్భాన్ని బట్టి పెద్ద నోట్లను ముద్రించవచ్చు.