పూర్తిస్థాయి రాష్ట్ర హోదా కోసం : కేజ్రీవాల్ ఆమరణ దీక్ష

  • Published By: madhu ,Published On : February 23, 2019 / 12:15 PM IST
పూర్తిస్థాయి రాష్ట్ర హోదా కోసం : కేజ్రీవాల్ ఆమరణ దీక్ష

మళ్లీ దీక్షల కాలం వచ్చేసింది. రాష్ట్రాలకు చెందిన హక్కుల కోసం నేతలు దీక్షల బాట పడుతున్నారు. కేంద్రం వివక్ష చూపిస్తోందని..తమకు రావాల్సిన హక్కులు కల్పించడం లేదంటూ దీక్షలు చేస్తున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇందులో మొదటి వరుసలో ఉంటారని చెప్పవచ్చు. కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఆయన ధర్మపోరాటం పేరిట దీక్షలు చేపడుతున్నారు. ఇటీవలే దేశ రాజధానిలో దీక్ష చేశారు. తాజాగా ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ దీక్ష చేపట్టాలని నిర్ణయించారు. తాను దీక్ష చేపడుతున్నట్లు అసెంబ్లీలో కేజ్రీవాల్ స్వయంగా ప్రకటించారు. 

మార్చి 1వ తేదీ నుండి ఆమరణ నిరహార దీక్ష చేయనున్నట్లు, ఢిల్లీకి పూర్తిస్థాయి రాష్ట్ర హోదా ఇవ్వాలనే డిమాండ్‌తో దీక్ష చేయనున్నట్లు ప్రకటించారు. చావనైనా చస్తాను కానీ 
కేంద్రం దిగొచ్చే వరకు పోరాడుతానని స్పష్టం చేశారు. ఢిల్లీలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని, ప్రజలు ఓట్లు వేసి తమను గెలిపించారని గుర్తు చేశారు కేజ్రీ. అయితే ఇక్కడ తమ ప్రభుత్వానికి మాత్రం అధికారాలు లేవని సభలో ఆవేదన వ్యక్తం చేశారు. పూర్తిస్థాయిలో రాష్ట్ర హోదా కావాలని ఢిల్లీ ప్రజలు కోరుకుంటున్నారని, అందుకే మార్చి 1 నుండి ఆమరణ దీక్ష చేయాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. 

ఢిల్లీ కేంద్రపాలిత ప్రాంత హోదా కలిగి ఉంది. లెఫ్టినెంట్ గవర్నర్ కీలక పాత్ర పోషిస్తున్నారు. గత కొంతకాలంగా కేంద్ర ప్రభుత్వం, లెఫ్టినెంట్ గవర్నర్‌తో కేజ్రీ ప్రభుత్వం ఢీకొంటోంది. ప్రభుత్వం తీసుకొనే నిర్ణయాలు లెఫ్టినెంట్ గవర్నర్ ఆమోదించాల్సినవసరం లేదని ఢిల్లీ హైకోర్టు అభిప్రాయం వ్యక్తం చేయడం..సుప్రీం కోర్టు ఆదేశాలు పాటించాలని కోరుతూ ఇటీవలే కేజ్రీ ధర్నా కూడా చేశారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుండి కేంద్రం ఇబ్బందులు పెడుతూనే ఉందని ఆప్ విమర్శలు గుప్పిస్తోంది. అన్ని అధికారాలు లెఫ్టినెంట్ గవర్నర్‌కు ఇవ్వడం సమంజసం కాదంటోంది. ఈ కారణంగా ప్రజలకు ఆశించినస్థాయిలో సేవలందించకపోతున్నట్లు కేజ్రీ పేర్కొంటున్నారు. మరి కేజ్రీవాల్ దీక్ష వార్నింగ్‌తో కేంద్రం దిగొస్తుందా ? లేదా ? అనేది చూడాలి.