శివుడు మా కులం వాడే అంటున్న బీజేపీ మంత్రి

పిచ్చి ముదిరిందో? లేకుంటే ప్రచారం దొరుకుతుంది అనే తాపత్రయమో తెలియదు కానీ, రాజకీయ నాయకులు ఏవేవో కామెంట్లు చేసి వార్తల్లోకి ఎక్కేస్తున్నారు. ఇటీవలికాలంలో రాముడిది మా కులమే.. కృష్ణుడు మా వాడే అంటూ చెప్పుకునే నేతలు ఎక్కువ అవుతున్న క్రమంలో లేటెస్ట్ గా మరో బీజేపీ మంత్రి ఇటువంటి వ్యాఖ్యలే చేసి వార్తల్లోకి ఎక్కారు.
బీహార్ రాష్ట్రానికి చెందిన బీజేపీ మంత్రి, అక్కడి ప్రభుత్వంలో గనుల శాఖను నిర్వహిస్తున్న బ్రజ్ కిషోర్ బింద్.. శివుడుది మా కులమే అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. నోనియా-బింద్- బేల్దార్ మహాసంఘ్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి బ్రిజ్ కిషోర్ బింద్ శివుడు తమ కులం వాడేనంటూ వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. శివుడు బింద్ కులానికి చెందిన దేవుడని, అందుకు రుజువులు కూడా ఉన్నాయంటూ హిందీలో రాసి ఉన్న కొన్ని వాక్యాలను చూపించాడు.
శ్రీరాముడు క్షత్రియ కులంకు చెందిన వాడైనప్పుడు.. కృష్ణుడు యాదవ కులంకు చెందిన వాడైతే.. శివుడు బింద్ కులంకు చెందినవాడు ఎందుకు కాకూడదు అంటూ ప్రశ్నించారు. మన చరిత్ర చాలా పురాతనమైనదని, శివ పురాణంలో శివుడి యొక్క కులం గురించి ప్రస్తావించారంటూ చెప్పుకొచ్చారు. శివుడు బింద్ కులానికి చెందిన వాడని అందులో స్పష్టంగా ఉన్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ ఫగు చౌహాన్, ఆరోగ్య మంత్రి మంగల్ పాండే కూడా ఉన్నారు.
ఇదే సమయంలో బీహార్ సీఎం నితీష్ కుమార్‌ను ఉద్దేశించి పరోక్ష వ్యాఖ్యలు చేశారు. బీహార్ జనాభాలో కేవలం 2శాతం ఉన్న కులానికి చెందిన వారు 14శాతం ఉన్న కులం వారిపై ఆధిపత్యం చేస్తున్నారు అంటూ వ్యాఖ్యలు చేశారు. గతంలో శ్రీరాముడు మావాడే అంటూ కొందరూ మాట్లాడగా.. హనుమంతుడు దళితుడు అంటూ మరికొందరు మాట్లాడారు. ఇప్పుడు అదే తరహాలో శివుడు గురించి చేసిన వ్యాఖ్యలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.