Budget 2019 : సౌత్ సెంట్రల్ రైల్వేకి మొండి చేయి

  • Published By: madhu ,Published On : February 2, 2019 / 12:52 AM IST
Budget 2019 : సౌత్ సెంట్రల్ రైల్వేకి మొండి చేయి

హైదరాబాద్ : మ‌ధ్యంత‌ర బ‌డ్జెట్‌లో ద‌క్షిణ మ‌ధ్య రైల్వేకు కేంద్రం మొండి చేయి చూపింది. ఈ ఏడాదైనా ఎంఎంటీఎస్ ఫేజ్2 అందుబాటులోకి వస్తుందనుకున్న భాగ్యప్రజల ఆశలపై నీళ్లు చల్లింది. బడ్జెట్‌లో కేవలం 10లక్షలు కేటాయించింది. రైల్వేకు అధిక ఆదాయాన్ని తెచ్చిపెట్టే సౌత్ సెంట్రల్ రైల్వేకు.. కేవ‌లం 5వేల 924 కోట్లు కేటాయించి దక్షిణాదిపట్ల మరోసారి వివక్ష కనబరిచింది. 

రైల్వే బ‌డ్జెలో కేంద్ర ప్ర‌భుత్వం కొత్త ప్రాజెక్టుల జోలికిపోకుండా.. పాత ప్రాజెక్టులపైనే దృష్టి సారించింది. గతేడాది కంటే స్వల్పంగా కేటాయింపులు పెంచింది. అక్కన్నపేట- మెదక్, కొత్తపల్లి- మనోహరాబాద్ మార్గాలకు బడ్జెట్‌లో నిధులు కేటాయించారు. రైల్వే క్యాపిటల్ ఎక్స్ పెండేచర్ 1 లక్ష 46వేల 500 కోట్లు కాగా.. దక్షిణ మధ్య రైల్వేకు 5,924 కోట్లు కేటాయించారు. రూ.834 కోట్లు కొత్త లైన్లకు , రూ.1,905కోట్లు డబ్లింగ్ పనులకు, రూ. 138 కోట్లు ట్రాఫిక్ ఫెసిలిటీలకు, రూ.229 మౌళిక వసతులు కోసం కేటాయించారు.

తెలంగాణాలో : – 
తెలంగాణలో రాష్ట్ర్రంలో అక్కన్నపేట్ – మెదక్ లైన్ కోసం రూ.10 కోట్లు కేటాయించారు. ఓబులవారిపల్లి – క్రిష్ణపట్నం కొత్తలైను కోసం రూ. 30కోట్ల తోపాటు.. మిగిలి ఉన్న 93 కిలో మీటర్ల దూరాన్ని ఈ ఏడాది పూర్తి చేస్తామని చెప్పారు. హైద‌రాబాద్ ప్రజ‌లు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఎంఎంటీఎస్ ఫేజ్‌2 ఈ ఏడాది కూడా అందుబాటులోకి రావ‌డం అనుమానంగానే ఉంది. ఈ బడ్జెట్‌లో కేవలం 10లక్షలు కేటాయించి నిరాశపరిచారు. తెల్లాపూర్ – రామచంద్రాపురం మధ్య 5 కిలోమీటర్లు.. మౌలాలి – ఘట్ కేసర్ మధ్య 12.2కిలోమీటర్ల లైన్లు ఇప్పటికే పూర్తి కాగా డిఫెన్స్, రాష్ట్ర ప్రభుత్వం మ‌ధ్య కొనసాగుతున్న వివాదానికి రాష్ట్రప‌తి తెర‌దించినట్టు…రైల్వే అధికారులు తెలిపారు. ముద్‌ఖేడ్ – పర్బాని ప్రాజెక్టుకు రూ.34.5కోట్లు, మనోహరాబాద్- కొత్త పల్లి మధ్య 150 కిమీ కొత్త లైన్ కోసం రూ.200 కోట్లు, మునీరాబాద్ – మహబూబ్‌నగర్‌ల మధ్య 246 కి.మీ. రైల్వే లైను కోసం రూ.275 కోట్లు, భద్రాచలం-సత్తుపల్లి మధ్య 56 కి.మీ. కొత్తలైన్ కోసం రూ.405కోట్లు కేటాయింపులు చేశారు. కాజీపేట -బల్లార్ష మధ్య 202 కి.మీ. థర్డ్ లైన్ ప్రాజెక్ట్ కోసం రూ.265 కోట్లు, సికింద్రాబాద్ – మహబూబ్‌నగర్ మధ్య 85కిమీ మేర చేపడుతున్న డబ్లింగ్ కోసం రూ.200 కోట్లు – ఘట్‌కేసర్ – యాదాద్రి ఎంఎంటీఎస్ కోసం రూ.20 కోట్లు – బైపాస్ లైన్ల కోసం రూ.143 కోట్లు – చర్లపల్లి శాటిలైట్ టెర్మినల్ అభివృద్ధి కోసం రూ.5 కోట్లు బడ్జెట్‌ల్ కేటాయించినట్లు.. దక్షిణ మధ్యరైల్వే అడిషనల్ జనరల్ మేనేజర్ జాన్ థామస్ తెలిపారు.

ఆంధ్రప్రదేశ్ : –
ఇక ఆంధ్రప్రదేశ్‌ లోని గుంటూరు -తెనాలి మధ్య ఎలక్ట్రిఫికేషన్ కోసం రూ.5 కోట్లు, నడికుడి – శ్రీకాళహస్తి మధ్య 309 కి.మీ. కొత్త లైన్ ప్రాజెక్ట్ కోసం రూ.700 కోట్లు, కడప – బెంగుళూరు మధ్య 225 కి.మీ. మేర కొత్త లైన్ నిర్మాణానికి రూ.210 కోట్లు కేంద్రం కేటాయించింది. గుంతకల్ – కల్లూరు మధ్య 40.60 కి.మీ. మేర నిర్మిస్తున్న డబుల్ లైన్ కోసం రూ.15 కోట్లు, గుంటూరు – గుంతకల్ మధ్య 443 కి.మీ. మేర నిర్మిస్తున్న డబ్లింగ్ లైన్ కోసం రూ.280 కోట్లు, విజయవాడ – భీమవరం – నిడదవోలు మధ్య 221 కి.మీ. మేర నిర్మిస్తున్న డబ్లింగ్ కోసం రూ.175 కోట్లు, కొత్తపల్లి – నర్సాపూర్ మధ్య 57 కిమీ మేర నిర్మిస్తున్న కొత్తలైన్ కోసం రూ.200 కోట్లు కేటాయింపులు చేసింది. గుత్తి – ధర్మవరం మధ్య 90 కిమీ మేర నిర్మిస్తున్న డబ్లింగ్ ప్రాజెక్టు కోసం రూ.126 కోట్లు, కాజీపేట – విజయవాడ మధ్య 219 కిమీ డబ్లింగ్ పనుల కోసం రూ.110 కోట్లు, విజయవాడ – గుంటూరు మధ్య మూడో లైన్ నిర్మాణానికి రూ.350 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించింది. కర్నూలులో నిర్మిస్తున్న మిడ్ లైఫ్ రిహ్యాబిలిటేష‌న్ ఫ్యాక్ట‌రీ కోసం 80 కోట్లు, తిరుప‌తి రైల్వే స్టేష‌న్ లో రెండో ప్ర‌వేశ మార్గం కోసం 12.45 కోట్లు, తిరుచానూరు రైల్వే స్టేష‌న్ అభివృద్ది కోసం 6కోట్లు కేటాయించింది కేంద్ర ప్ర‌భుత్వం. ఈ ఏడాది ద‌క్షిణ మ‌ధ్య రైల్వేకు కేంద్రం మొండి చెయ్యి చూపింది. కొత్త ప్రాజెక్టుల ఊసే ఎత్త‌కుండా… ఉన్న ప్రాజెక్టులకు కూడా అర‌కొర నిధులు కేటాయించింది. ఈ నిధులతో ప్రాజెక్ట్‌లు పూర్తవ్వాలంటే.. ఏళ్ల తరబడి ఎదురు చూడాల్సిందేనంటున్నారు నిపుణులు.