కేంద్ర బడ్జెట్ 2019 : తూచ్ అంటున్న విపక్షాలు

  • Published By: madhu ,Published On : February 2, 2019 / 12:41 AM IST
కేంద్ర బడ్జెట్ 2019 : తూచ్ అంటున్న విపక్షాలు

హైదరాబాద్ :  కేంద్ర బడ్జెట్‌పై  భిన్న స్పందనలు వ్యక్తమవుతున్నాయి. బీజేపీ నేతలు తమది ప్రజాకర్షక బడ్జెట్‌ అని చెప్పుకుంటున్నారు. ఈ బడ్జెట్‌ మరో పదేళ్ల పాటు ప్రజల అవసరాలను తీరుస్తోందని ప్రశంసిస్తున్నారు. మరోవైపు కేంద్ర బడ్జెట్‌పై విపక్షాలు పెదవి విరుస్తున్నాయి. కేంద్ర బడ్జెట్‌ బీజేపీ ఎన్నికల మానిఫెస్టోగా ఉందని విమర్శిస్తున్నాయి. 
కేంద్ర ఆర్థికమంత్రి పీయూష్‌ గోయెల్‌ ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను ప్రధాని మోదీ ప్రశంసించారు. ఈ బడ్జెట్‌ మరో పదేళ్ల వరకు ప్రజల అవసరాలు తీరుస్తుందని చెప్పారు.

రైతులు, పేదలు, కార్మికులకు ప్రయోజనం చేకూర్చుతుందన్నారు. మధ్య తరగతి ప్రజల కలలను సాకారం చేస్తుందని ప్రశంసించారు. నవ భారత నిర్మాణానికి ఈ బడ్జెట్‌ ఎంతోఉపకరిస్తుందన్నారు. కేంద్ర బడ్జెట్‌పై కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ అసంతృప్తి వ్యక్తం చేశారు. రైతులకు రోజుకు 17 రూపాయలు ఇవ్వడం ద్వారా మోదీ ప్రభుత్వం రైతులను అవమానించిందని విమర్శించారు. 15మంది పారిశ్రామిక వేత్తలకు 3 లక్షల 50వేల కోట్ల రుణాలు మాఫీ చేసిన మోదీ ప్రభుత్వం.. రైతులకు కేవలం రోజుకు 17 రూపాయలే ఇస్తారా అంటూ ప్రశ్నించారు.  కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ కేవలం ఎన్నికల మానిఫెస్టోగా ఉందన్నారు టీడీపీ ఎంపీ అశోక్‌ గజపతిరాజు. అభివృద్ధి చేశామంటూనే ఆర్ధిక పరిస్థితిని దెబ్బతీశారని విమర్శించారు.. కేంద్రం బడ్జెట్ ఎన్నిల కోసమే అన్నట్లుగా ఉందని ఎద్దేవా చేశారు.

రైతు బంధు పథకాన్ని కేంద్ర బడ్జెట్‌లో ఆచరించడం సంతోషంగా ఉందని టీఆర్‌ఎస్‌ ఎంపీ జితేందర్‌రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్‌ రోల్‌ మాడల్‌ ఆఫ్‌ కంట్రీ అనడానికి ఈ బడ్జెట్‌ ఓ ఉదహారణ అన్నారు. గతంలో మాదిరిగా ప్రజలను మభ్య పెట్టే విధంగా కాకుండా బడ్జెట్‌ లో పేర్కొన్నట్లుగా కేంద్రం వ్యవహరిస్తే ప్రజలు హర్షిస్తారన్నారు. కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి అన్యాయం జరిగిందని వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మండిపడ్డారు. బడ్జెట్‌లో ప్రత్యేక హోదా .. రైల్వేజోన్‌, పోలవరం నిధుల కేటాయింపుల ఊసే లేకపోవడం దారుణమన్నారు. మొత్తానికి కేంద్ర బడ్జెట్‌పై బీజేపీ నేతలు ప్రజాకర్షక బడ్జెట్‌ ప్రవేశపెట్టామని చెబుతోంటే… విపక్షాలు మాత్రం ఈ బడ్జెట్‌ను ఎన్నికల స్టంట్‌లా అభివర్ణిస్తున్నాయి.