బీజేపీకి మద్దతిస్తా…మాయావతి సంచలన ప్రకటనతో యూపీలో పొలిటికల్ హీట్

  • Published By: venkaiahnaidu ,Published On : October 29, 2020 / 05:41 PM IST
బీజేపీకి మద్దతిస్తా…మాయావతి సంచలన ప్రకటనతో యూపీలో పొలిటికల్ హీట్

Even If We Have To Vote BJP… Mayawati Attacks Ex-Ally Akhilesh గతేడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్ లో మాయావతి,అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని బీఎస్పీ,ఎస్పీ పార్టీలు విబేధాలను పక్కనబెట్టి బీజేపీ ఓటమే లక్ష్యంగా మహాకూటమిగా ఏర్పడి కలిసి పోటీచేసిన విషయం తెలిసిందే. అప్పటివరకు ప్రధాన ప్రత్యర్థులుగా ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకున్న వీరిద్దరూ చేతులు కలపడంతో ఇక వీరి కూటమికి తిరుగే ఉండదని,ఘన విజయం తథ్యం అని చాలామంది భావించారు. అయితే,ఈ ఇద్దరు ప్రత్యర్థులు చేతులు కలిపినా తమ ఓటు బీజేపీకే అని ప్రజలు కాషాయపార్టీకి మెజార్టీ సీట్లు కట్టబెట్టారు.



అయితే,మహాకూటమి ఘోరపరాజయం తర్వాత మళ్లీ అఖిలేష్,మాయావతి మధ్య విబేధాలు మెల్లగా మొదలయ్యాయి. ఎంతలా అంటే..చివరకు ఇప్పుడు మాయావతి బీజేపీకి కూడా మద్దతు ఇచ్చే వరకు వచ్చింది. ఉత్తరప్రదేశ్ భవిష్యత్లులో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో సమాజ్ వాదీ పార్టీ అభ్యర్థులను ఓడించేందుకు తాను బీజేపీకి ఓటు వేసేందుకు కూడా సిద్ధమేనని గురువారం బీఎస్పీ అధినేత్రి మాయావతి ప్రకటించింది. గత ఎన్నికల్లో ఎస్పీ-బీఎస్పీ కూటమి లబ్ధి కోసం తాను సమాజ్ వాదీ పార్టీపై 1995లో పెట్టిన కేసుని ఉపసంహరించుకోడం కూడా పెద్ద తప్పేనని ఈ సందర్భంగా మాయావతి అన్నారు.



ఎమ్మెల్సీ ఎన్నికల్లో సమాజ్ వాదీ పార్టీ అభ్యర్ధులను ఓడించడానికి..అవసరమైతే బీజేపీ అభ్యర్థి లేదా మరేఇతర పార్టీ అభ్యర్థికైనా తాము ఓటు వేసేందుకు సిద్ధమని మాయావతి సృష్టం చేశారు. సమాజ్ వాదీ పార్టీ అభ్యర్థిని డామినేట్ చేసే ఏ అభ్యర్థికైనా బీఎస్పీ ఎమ్మెల్యేల ఓటు తప్పనిసరిగా ఉంటుందని తాను మాటిస్తున్నానని మయావతి తెలిపారు. నవంబర్-9న ఉత్తరప్రదేశ్ లోని 10రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్న సమయంలో మాయావతి నోట బీజేపీకి మద్దతు అనే మాట ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.



అసెంబ్లీలో తగిన సంఖ్యాబలం లేనప్పటికీ బీఎస్పీ…రామ్ జీ గౌతమ్ అనే వ్యక్తిని రాజ్యసభ ఎన్నికల బరిలో నిలిపింది. బీజేపీయేతర పార్టీల నుంచి తమకు మద్దతు లభిస్తుందని బీఎస్పీ నేతలు చెప్పుకొచ్చారు. అయితే,ఇదే సమయంలో పెద్ద ట్విస్ట్ తెరపైకి వచ్చింది. రామ్ జీ గౌతమ్ ని రాజ్యసభ అభ్యర్థిగా ప్రపోజ్ చేసిన 10మంది బీఎస్పీ ఎమ్మెల్యేలలో నలుగురు ఎమ్మెల్యేలు..రామ్ జీ గౌతమ్ నామినేషన్ పేపర్ పై తమ సంతకాలు ఫోర్జరీ చేయబడ్డాయని ఆరోపించారు. తాము పార్టీ మారే అవకాశం ఉందంటూ పరోక్షంగా సిగ్నల్స్ ఇచ్చారు.

ఓ ఎమ్మెల్యే అయితే తాను సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ ని కలిసినట్లు ప్రకటించగా..అఖిలేష్ కి తన పార్టీ సభ్యులను ఎలా గౌరవించాలో తెలుసు అని మరో బీఎస్పీ ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు. ఈ చర్యలతో మాయావతి తీవ్ర ఆగ్రహం వచ్చింది. లోక్ సభ ఎన్నికల్లో అఖిలేష్ తో పొత్తు పెద్ద తప్పు అని వ్యాఖ్యానించింది. 1995 లో అఖిలేష్ పార్టీ తనపై దాడి కేసుని తాను ఉపసంహరించుకొని తప్పు చేశానని పేర్కొంది.



మరోవైపు,మాయావతి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు యూపీలో పొలిటికల్ హీట్ పెంచుతున్నాయి. బీజేపీకి మద్దతుపై మాయా చేసిన ప్రకటనను కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకగాంధీ తప్పుబట్టారు. ఇప్పుడు చెప్పడానికి ఇంకేమైనా ఉందా అంటూ ప్రియాంకగాంధీ కామెంట్ చేశారు.