ప్రాణాలు పోయినా కదిలేది లేదు… ఆంక్షలు లెక్కచేయకుండా రైతుల ఆందోళన

ప్రాణాలు పోయినా కదిలేది లేదు… ఆంక్షలు లెక్కచేయకుండా రైతుల ఆందోళన

Farmers’ protest, high tension in Ghazipur : పోలీసులు, సర్కార్‌ హెచ్చరికలను లెక్కచేసేది లేదని అన్నదాతలు తేల్చిచెప్పారు. రాత్రిలోగా ఘాజీపూర్‌ బోర్డర్‌ను ఖాళీ చేయాలన్న యూపీ సర్కార్‌, పోలీసుల హెచ్చరికను బేఖాతర్‌ చేశారు. ప్రాణాలు పోయినా ఇక్కడి నుంచి కదిలేది లేదని తెగేసి చెప్పారు. బోర్డర్‌లో పోలీసులు, కేంద్ర బలగాలు భారీగా మోహరించడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఖాళీ చేసేది లేదంటూ రైతులు ఖరాఖండిగా చెప్పడం.. వారిని ఖాళీ చేయించేందుకు పోలీసు బలగాలు ప్రయత్నించడంతో.. ఢిల్లీ సరిహద్దు ప్రాంతమైన ఘాజీపూర్‌లో నిన్న సాయంత్రం నుంచి హైడ్రామా కొనసాగుతోంది.

ఎర్రకోట ఘటనను కేంద్రం సీరియస్‌గా తీసుకుంది. అన్నదాతల ట్రాక్టర్‌ ర్యాలీ హింసాత్మకంగా మారడంతో.. రైతు ఉద్యమకారులపై కేంద్రం అన్నివైపుల నుంచి ఉచ్చు బిగుస్తోంది. ఆందోళన చేస్తున్న రైతులపై రకరకాల కేసులు పెట్టడంతో పాటు ఎక్కడికక్కడ దీక్షా శిబిరాలను భగ్నం చేయడానికి చర్యలు చేపట్టింది. శిబిరాల్లో ఉన్నవారికి కనీస సౌకర్యాలు అందకుండా చేస్తోంది. ఈ పరిణామాలతో ఢిల్లీ సరిహద్దుల్లో ఎప్పుడేం జరుగుతుందోనన్న ఉత్కంఠ, ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

ఇవాళ్టి నుంచి పార్లమెంట్‌ సమావేశాలు జరగబోతుండటంతో.. కేంద్రం ఒక్కసారిగా కొరడా ఝళిపించింది. సరిహద్దుల నుంచి రైతులను ఖాళీ చేయాలని హెచ్చరించింది. అయితే రైతు నేతలు మాత్రం దీక్షలు సడలించేది లేదని తెగేసి చెబుతున్నారు. నోటీసులు, కేసులు, ఇతర నిర్బంధ చర్యలకు తాము ఎంతమాత్రం భయపడేది లేదని కర్షకులు ఇప్పటికే ప్రకటించారు. చట్టాల రద్దు వరకు ఆందోళను విరమించేది లేదని సంయుక్త కిసాన్‌ మోర్చా ప్రకటించింది.

ఘాజీపూర్ ప్రాంతాన్ని వెంటనే ఖాళీ చేయాలంటూ.. అల్టిమేటం జారీ చేయడంపై రైతు సంఘాల నేతలు మండిపడుతున్నారు. ఆందోళన ప్రాంతాన్ని ఖాళీ చేసేందుకు నిరాకరిస్తున్నారు భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేష్ టికాయత్. రైతులపై దాడి చేయవద్దని కన్నీటి పర్యంతమయ్యారు. మూడు చట్టాలను రద్దు చేసేవరకు ఘాజీపూర్ ఖాళీ చేయబోమని స్పష్టం చేశారు. బుల్లెట్లనైనా ఎదుర్కొంటా కానీ.. శాంతియుతంగా తమ ఆందోళన కొనసాగిస్తామని స్పష్టం చేశారు. బలవంతంగా ఖాళీ చేయాలని చూస్తే ఉరి వేసుకుంటానని రాకేశ్‌ టికాయత్ హెచ్చరించారు.