ఒకసారి ఆడవాళ్లు, మరోసారి మగవాళ్ల మధ్య పంచాయతీ సీట్ల రొటేషన్…కీలక బిల్లు తీసుకొస్తున్నహర్యానా

  • Published By: venkaiahnaidu ,Published On : August 25, 2020 / 06:26 PM IST
ఒకసారి ఆడవాళ్లు, మరోసారి మగవాళ్ల మధ్య పంచాయతీ సీట్ల రొటేషన్…కీలక బిల్లు తీసుకొస్తున్నహర్యానా

హర్యానా ప్రభుత్వం త్వరలో కీలక బిల్లు ఒకటి తీసుకురావాలని ప్లాన్ చేస్తోంది. పంచాయతీ ఎన్నికలలో పురుషులు మరియు మహిళా అభ్యర్థులకు 50:50 రిజర్వేషన్లు కల్పించే బిల్లును తీసుకురావాలని, ప్రతి పదవీకాలం తరువాత పురుష, మహిళా ప్రతినిధుల మధ్య సీట్లను రొటేట్ చేయాలనీ హర్యానా ప్రభుత్వం యోచిస్తోంది.

ఇది స్త్రీ,పృరుషులకు సమాన అవకాశాలను కల్పించడానికి ఉద్దేశించినదని హర్యానా ఉప ముఖ్యమంత్రి దుష్యంత్ చౌతాలా అన్నారు. దేశంలో ఇటువంటి ఫార్ములాను ఎంచుకున్న మొదటి రాష్ట్రంగా హర్యానా మొదటి స్థానంలో ఉంటుందని చౌతాలా అన్నారు. రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం బిల్లును తీసుకువస్తుందని చౌతాలా చెప్పారు. కాగా, రెండు రోజుల అసెంబ్లీ సమావేశం బుధవారం ప్రారంభమవుతుంది.

సరి- బేసి(odd-even) ఫార్ములా కింద పురుషులు మరియు మహిళలు పంచాయతీ ఎన్నికలలో పోటీ చేయగలరు. సర్పంచ్‌లు మరియు గ్రామ వార్డుల సభ్యులు, బ్లాక్ సమితీలు మరియు జిలా పరిషత్‌ల కోసం ఇది అమలు చేయబడుతుంది. ఒక వార్డు లేదా గ్రామానికి ఒక పురుషుడు నాయకత్వం వహిస్తే, అది తర్వాతి టర్మ్( next term)లో ఒక మహిళ ప్రాతినిధ్యం వహిస్తుంది అని చౌతాలా అన్నారు.

ఈ బిల్లు మహిళలకు రిజర్వేషన్‌గా కాకుండా పురుషులు, మహిళలకు సమాన అవకాశాలు కల్పించడం అని డిప్యూటీ సీఎం అన్నారు. కొన్ని రాష్ట్రాల్లో పంచాయతీ సంస్థలలో మహిళలకు 67 శాతానికి పైగా ప్రాతినిధ్యం ఉందని, వారికి 50 శాతం రిజర్వేషన్లు ఇచ్చారని ఆయన తెలిపారు.

రాబోయే సమావేశంలో అసెంబ్లీ.. ఈ బిల్లును ఆమోదిస్తుందని చౌతాలా విశ్వాసం వ్యక్తం చేశారు. “పార్టీలకు అతీతంగా మద్దతు లభిస్తుందని ఆశిస్తున్నామన్నారు. అసెంబ్లీలో వివిధ పార్టీలకు చెందిన తొమ్మిది మంది మహిళా ఎమ్మెల్యేలు ఉన్నారు, కాని ఈ ప్రతిపాదనను అమలు చేసిన తరువాత పంచాయతీలలో వారి గొంతుకు 50 శాతం వాటా ఉంటుంది అని చౌతాలా అన్నారు.