అట్లతద్ది నోము ఎవరు చేయాలి? ఎలా జరుపుకోవాలి?

  • Published By: veegamteam ,Published On : October 16, 2019 / 04:36 AM IST
అట్లతద్ది నోము ఎవరు చేయాలి? ఎలా జరుపుకోవాలి?

అట్లతద్ది అంటే ఆధ్యాత్మికతనే కాదు వినోదాన్నీ అందించే పండుగ. ముఖ్యంగా స్త్రీలు జరుపుకునే పండుగ. ఆంధ్రదేశంలో పెళ్ళయిన స్త్రీలు అట్లతద్ది జరుపుకోవడం ఆనవాయితీ. ఈ సంవత్సరం (2019) అక్టోబర్ 15న ప్రారంభమై.. 16న ముగిసింది. అసలైతే ఆశ్వయుజ పౌర్ణమి వెళ్ళిన మూడవ రోజు అట్లతద్ది. సాధారణంగా సెప్టెంబరు ఆఖరులో లేదా అక్టోబరు మొదటి వారంలో ఈ పండుగ వస్తోంది. ఈ పండుగ ఉద్దేశం ఏమిటో, ఎలా జరుపుకుంటారో తెలుసుకుందాం.

అట్లతద్ది జరుపుకునే ఆడవాళ్ళు తెల్లవారుజామున స్నానం చేసి, అన్నం తిని ఇక రోజంతా ఉపవాసం ఉంటారు. సాయంత్రం గౌరీదేవికి పూజ చేసుకుని, చంద్రుని దర్శించుకుంటారు. ఆ తర్వాత అట్లు తిని, ఉపవాసం విరమిస్తారు. ఈ పండుగ రోజు ఆడవాళ్ళు తమ భర్తలు ఆయురారోగ్యాలతో పదికాలాలపాటు సుఖంగా, సంతోషంగా ఉండాలని కోరుకుంటూ అట్లతద్ది జరుపుకుంటారు. 

ఇక అట్లతద్దికి ముందురోజు కాళ్ళు, చేతులకు అందంగా గోరింటాకు పెట్టుకుంటారు. గుమ్మాలకు తోరణాలు కడతారు. అట్లతద్దినాడు గౌరీదేవికి కుడుములు, పాలతాలికలు, పులిహోర నైవేద్యంగా సమర్పిస్తారు. ఆ తర్వాత అట్లతద్ది నోము నోచుకునే ఆడవాళ్ళు 11 మంది ముత్తయిదువలను ఆహ్వానించి..నోము నోచుకునే స్త్రీలతోబాటుతో వాయనం అందుకుంటారు.  
 
అంతేకాదు ఒక్కొక్కరికీ 11 అట్లు చొప్పున పెట్టి.. గౌరీదేవివద్ద పెట్టిన కుడుముల్లోంచి ఒక్కొక్కరికి ఒక్కొకటి పెట్టి, తాంబూలంతో వాయనం ఇస్తారు. అట్లతద్ది నోములో వాయనం అందుకున్న స్త్రీలు,  ఆ అట్లను వాళ్ళు లేదా వారి కుటుంబీకులు మాత్రమే తినాలి.