బండి Vs ఈటల.. ఆగని ఆధిపత్య పోరు.. పొలిటికల్ హీట్ ఎందుకంటే?
బండి సంజయ్ ఆఫీస్ నుంచి విడుదలైన పత్రిక ప్రకటనపై పరోక్షంగా ఎంపీ ఈటల రాజేందర్ రియాక్ట్ అయ్యారు.
Panchayat Elections: కేంద్రమంత్రి బండిసంజయ్ వర్సెస్ ఈటల రాజేందర్. ఇది కొత్త ఎపిసోడేం కాదు. తెలంగాణ స్థానిక ఎన్నికలు రాబోతున్నాయన్న ప్రచారం స్టార్ట్ అయినప్పటి నుంచే ఇద్దరు నేతల మధ్య కోల్డ్ వార్ రచ్చకెక్కింది. నువ్వానేనా అన్నట్లుగా ఒకరిపై మరొకరు ఇండైరెక్ట్ కామెంట్స్‌తో హీటెక్కించారు. తన పార్లమెంట్ పరిధిలో తన అనుచరులే అభ్యర్థులుగా ఉంటారని సంజయ్..హుజురాబాద్ తన ఇలాకా..అక్కడ తన అనుచరులే బరిలో ఉంటారు..గెలిపించుకుని తీరుతానంటూ ఈటల హాట్ కామెంట్స్ చేసి చర్చకు తెరలేపారు.
ఆ తర్వాత ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేసింది. ఇలా ఫస్ట్ ఫేజ్ ఎన్నికలు పూర్తయ్యాయో లేదో..మరోసారి వార్ ఆఫ్ వర్స్డ్ హీటెక్కిస్తున్నాయి. స్వయంగా కేంద్రమంత్రి బండి సంజయ్ ఆఫీస్ నుంచి రిలీజ్ అయిన ఒక ప్రెస్ నోట్‌తో..పాత వివాదం కొత్త రచ్చకు దారితీసినట్లు అయింది. హుజురాబాద్ నియోజకవర్గం కమలాపూర్ మండలంలో బోణీ కొట్టిన బీజేపీ..బీజేపీ బలపర్చిన సర్పంచ్ అభ్యర్ధి ర్యాకం శ్రీనివాస్ 90 ఓట్లతో విజయం అంటూ కేంద్రమంత్రి బండిసంజయ్ ఆఫీస్ ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది.
సర్పంచ్ ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ అసంతృప్తిగా ఉందా? రిజల్ట్స్ బీఆర్ఎస్‌ను ఆశ్చర్యపర్చాయా?
ఇంత వరకు ఓకే. కానీ ఈటల రాజేందర్ బలపర్చిన అభ్యర్ధి ర్యాకం సంపత్ ఓటమి అంటూ ఆ పత్రికా ప్రకటనలో ఉండటమే రాద్దాంతం అవుతోంది. ఈ ప్రెస్ నోట్ హుజురాబాద్ బీజేపీలోనే కాదు రాష్ట్ర పార్టీలోనూ చర్చనీయాంశంగా మారింది. బీజేపీ బలపరిచిన అభ్యర్థి గెలిచాడు అంటే సరిపోయేది..ఈటల రాజేందర్ బలపరిచిన అభ్యర్థి ఓడిపోయాడని పత్రిక ప్రకటన రిలీజ్ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని చర్చించుకుంటున్నారట కొందరు నేతలు.
పరోక్షంగా ఎంపీ ఈటల రాజేందర్ రియాక్ట్
బండి సంజయ్ ఆఫీస్ నుంచి విడుదలైన పత్రిక ప్రకటనపై పరోక్షంగా ఎంపీ ఈటల రాజేందర్ రియాక్ట్ అయ్యారు. మరింత మంట పుట్టించేలా..అవగాహన లేని వారు పెడుతున్న సోషల్ మీడియా పోస్టులపై పార్టీ చర్యలు తీసుకుంటుందన్నారు. ఈ ఎన్నికలు ప్రజల్లో వారి వెనుకున్న నాయకుడు, పార్టీని చూసి అభ్యర్థులకు అండగా నిలుస్తున్నారు.
గెలిచిన తర్వాత ఐదు లక్షలు 10 లక్షలు ఇస్తాం..మా పార్టీకి రండి..మా పార్టీలో గెలిచినట్టు చెప్పుకోండి అని చిల్లర ప్రయత్నం కొనసాగుతోందన్నారు. ఎన్నికల ముందే తమకు ఫలానా నాయకుడి ఆశీర్వాదం ఉందని చెప్తే మంచిది కానీ..గెలిచిన తర్వాత ఆయన వెనక..ఈయన వెనక పోతామంటే..ప్రజలు విశ్వసించే అవకాశం ఉండదంటూ ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలు కాక పుట్టిస్తున్నాయి.
అయితే వర్గ విభేదాలు పక్కన పెట్టండి..తెలంగాణలో పార్టీ బలోపేతం కోసం కృషి చేయండి అంటూ..ప్రధాని మోదీ తెలంగాణ ఎంపీలపై ఆగ్రహం వ్యక్తం చేశారని ప్రచారం జరిగి రెండు రోజులు కూడా కాలేదు..అంతలోపే బండి, ఈటల ఎపిసోడ్‌లో పార్టీ క్యాడర్‌లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోందట. స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పినా ఇద్దరు కీలక నేతల తీరు మారదా అంటూ గుసగుసలాడుకుంటున్నారట. రాష్ట్ర అధ్యక్షుడు రామ్‌చందర్‌రావు కూడా బండి, ఈటల తీరుతో తల పట్టుకుంటున్నారట. ఇక అధిష్టానమే జోక్యం చేసుకుని ఇద్దరు నేతలకు సర్ధిచెప్పి..కలిసి పనిచేసేలా చేయాలని కోరుకుంటున్నారట నేతలు.
