Mamata Banerjee : అవమానం జరిగింది.. కోవిడ్ మీటింగ్ లో ప్రధాని తనను మాట్లాడనివ్వలేదన్న దీదీ

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ మరోసారి ప్రధానమంత్రి నరేంద్రమోడీపై ఫైర్ అయ్యారు.

Mamata Banerjee : అవమానం జరిగింది.. కోవిడ్ మీటింగ్ లో ప్రధాని తనను మాట్లాడనివ్వలేదన్న దీదీ

Mamata Banerjee

Mamata Banerjee పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ మరోసారి ప్రధానమంత్రి నరేంద్రమోడీపై ఫైర్ అయ్యారు. ప్ర‌ధానితో కొవిడ్-19పై జ‌రిగే స‌మావేశాల్లో ముఖ్య‌మంత్రుల‌ను క‌నీసం మాట్లాడేందుకూ అనుమ‌తించ‌డం లేద‌ని ఆరోపించారు. ప్ర‌ధాని న‌రేంద్ర మోదీతో భేటీల్లో ముఖ్య‌మంత్రుల‌ను అన్నింటికీ త‌ల‌లూపే తోలుబొమ్మ‌ల స్థాయికి దిగ‌జార్చార‌ని మ‌మ‌తా బెన‌ర్జీ ఆరోపించారు. ప్రధానితో జరిగిన సమావేశంలో..తనను మాట్లాడటానికి అనుమతించకపోవడాన్ని అవమానంగా భావించానని చెప్పారు. కరోనా వైరస్ ప్రభావం అధికంగా ఉన్న ప‌ది రాష్ట్రాల అధికారులు, సీఎంల‌తో గురువారం ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ నిర్వ‌హించిన‌ స‌మావేశంలో పాల్గొన్న అనంత‌రం దీదీ ఈ వ్యాఖ్య‌లు చేశారు.

ఈ సమావేశంలో ప్రధాని, కొందరు బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులకు తప్ప వేరే రాష్ట్రాల సీఎంలకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదని మమత ఆరోపించారు. ప్రధాని నియంతలా వ్యవహరిస్తున్నారన్నారు. ప్రధాని మోడీకి అభద్రతా భావం ఎక్కువని, అందుకే తమ మాటలను ఆయన వినట్లేదని మండిపడ్డారు. సీఎంల‌ను మాట్లాడేందుకు అనుమ‌తించ‌క‌పోతే ఇక‌ వారిని ఎందుకు పిలిచార‌ని మమత ప్ర‌శ్నించారు. సీఎంల‌తో ప్ర‌ధాని స‌మావేశం దారుణంగా విఫల‌మైంద‌ని ఇది సీఎంల‌ను అవ‌మానించేలా ఉంద‌ని ఆమె పేర్కొన్నారు. ప్ర‌ధానితో భేటీల్లో మాట్లాడేందుకు అనుమ‌తించ‌క‌పోవడంపై అన్ని రాష్ట్రాల సీఎంలు నిర‌స‌న తెల‌పాల‌ని దీదీ పిలుపు ఇచ్చారు.

సమావేశంలో భాగంగా వ్యాక్సిన్ల గురించిగానీ, రెమ్ డెసివిర్ మందులపైగానీ ఒక్క మాట కూడా మాట్లాడలేదని ఆమె మండిపడ్డారు. పెరిగిపోతున్న బ్లాక్ ఫంగస్ కేసుల గురించీ వివరాలు అడగలేదన్నారు. దేశంలో క‌రోనా కేసుల సంఖ్య త‌గ్గుముఖం ప‌ట్టింద‌ని ఈ స‌మావేశంలో ప్ర‌ధాని వ్యాఖ్య‌ల‌ను ప్ర‌స్తావిస్తూ అలాగైతే దేశ‌వ్యాప్తంగా భారీ సంఖ్య‌లో మ‌హ‌మ్మారి బారిన‌ప‌డి ప్ర‌జ‌లు ఎందుకు మ‌ర‌ణిస్తున్నార‌ని దీదీ నిల‌దీశారు. తాను కరోనా టీకాల కొరత గురించి నిలదీద్దామని అనుకున్నా నోరెత్తనివ్వలేదని మమత ఆరోపించారు. దేశంలో కరోనా కొత్త కేసులు తగ్గుతున్నాయన్న ప్రధాని మోదీ వ్యాఖ్యలపై కూడా మమత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంతకుముందు కూడా ఇలాగే కేసులు తగ్గాయన్నారని, కానీ, ఆ తర్వాత కేసులు విపరీతంగా పెరిగాయని అన్నారు.

అయితే,ముఖ్యమంత్రులతో ఇంతకుముందు ప్రధాని జరిపిన సమావేశాలకు హాజరుకాకపోవడంలో ఫెయిల్ అయిన మమతాబెనర్జీ.. ప్రధాని మోడీతో సమావేశాన్ని రాజకీయం చేయడంలో బిజీగా ఉన్నారని మాజీ టిఎంసి నేత,ప్రస్తుత బీజేపీ ఎమ్మెల్యే సువేందు అధికారి ఎదురుదాడికి దిగారు. ఈ మేరకు ఆయన వరుస ట్వీట్ లు చేశారు. ఈ రోజు, మా గౌరవనీయ సిఎం మమతా బెనర్జీ మరోసారి పరిపాలన పట్ల తనకున్న ఆసక్తిని చూపించలేదు. ఆమె శైలికి అనుగుణంగా, గౌరవనీయ పీఎం నరేంద్ర మోడీ కోవిడ్ -19 తో పోరాడటానికి క్షేత్ర స్థాయి పద్ధతులపై చర్చించేందుకు జిల్లా అధికారులతో నిర్వహించిన సమావేశాన్ని రాజకీయం చేశారని సువెందు ఓ ట్వీట్ లో పేర్కొన్నారు.