పాంగోంగ్ సరస్సు వద్ద ప్రతిష్టంభన.. చైనా కుట్రలకు భారత్ బ్రేక్!

  • Published By: sreehari ,Published On : September 2, 2020 / 08:19 PM IST
పాంగోంగ్ సరస్సు వద్ద ప్రతిష్టంభన.. చైనా కుట్రలకు భారత్ బ్రేక్!

India-China standoff: ఇప్పటి వరకు ఇండియా, చైనా మధ్య సరిహద్దు ఘర్షణలు పాంగోంగ్ సరస్సు ఉత్తరం ఒడ్డుకు పరిమితంగా ఉండేవి. తాజాగా చైనా దళాలు సరస్సు దక్షిణం ఒడ్డున కూడా భారత భూభాగం వైపు చొచ్చుకొచ్చే ప్రయత్నం చేశాయి. చైనా కుయుక్తులను ముందే పసిగట్టిన భారత దళాలు దురాక్రమణను అడ్డుకున్నాయి.

చైనా కుట్రలకు బ్రేక్ వేశాయి. అప్పటి నుంచి పాంగోంగ్ సరస్సు వద్ద ప్రతిష్టంభన కొనసాగుతూనే ఉంది. ఆగస్టు 29న రాత్రి చైనా దళాలు పాంగోంగ్ సరస్సు దక్షిణ ఒడ్డున వాస్తవాధీన రేఖ దాటి లోపలి చొచ్చుకు వచ్చే ప్రయత్నం చేశాయి . భారత భద్రతా దళాలు దాన్ని గట్టిగా అడ్డుకున్నాయి. వాస్తవానికి ఉద్రిక్తతలు తగ్గించే దిశగా రెండు దేశాల మధ్య మిలటరీ స్థాయి చర్చల్లో ఓ అంగీకారం కుదిరింది.



దాన్ని ఉల్లంఘిస్తూ చైనా తన దళాలను తరలించే ప్రయత్నం చేసింది. లద్దాఖ్ లోని ఐదారు కీలక ప్రాంతాల్లో రెండు దేశాల మధ్య నాలుగు నెలలగా ప్రతిష్టంభన కొనసాగుతోంది. వీటిలో పాంగోంగ్ సరస్సు ప్రాంతం చాలా ముఖ్యమైంది . ఇప్పటి వరకూ రెండు దేశాల మధ్య ఘర్షణలు సరస్సు ఉత్తర ఒడ్డుకు మాత్రమే పరిమితం అయ్యాయి . దక్షిణ ఒడ్డున రెండు దేశాల సైనిక దళాల మధ్య ఘర్షణ ఇదే మొదటిసారి. ఇంతకీ ఈ పాంగోంగ్ సరస్సు ఎక్కడ ఉంది ? భారత , చైనా సరిహద్దుల్లో దాని ప్రాముఖ్యత ఎంత?

ఆమిర్ ఖాన్ సినిమా త్రి ఇడియట్స్ విడుదల అయ్యాకే పాంగోంగ్ సరస్సు పేరు చాలా మందికి తెలిసింది .ఆ తరువాతే అది భారతీయులకు పర్యాటక కేంద్రంగా కూడా మారింది .అక్కడకు సరైన రోడ్లు లేకున్నా ఇండియా సహా అనేక దేశాల నుంచి బైకర్లు పాంగోంగ్ సరస్సుకు క్యూ కట్టారు .సముద్ర మట్టానికి 4,270 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ ప్రాంతం ప్రకృతి అందాలకు నెలవు.

మొత్తం 600 చదరపు కిలోమీటర్లలో విస్తరించి ఉన్న పాంగోంగ్ సరస్సు అత్యధిక భాగం కొండల మధ్య చాలా సన్నగా ప్రవహిస్తూ ఉంటుంది . 135 కిలోమీటర్ల పొడవునా అదొక సన్నని పాయలాగుంటుంది . ఒక్క చోట మాత్రమే ఆరు కిలోమీటర్ల వెడల్పు ఉంటుంది.



చైనా నుంచి ఇండియా, పాకిస్తాన్, ఆఫ్గనిస్తాన్, తజికిస్తాన్ మీదుగా వెళ్లే కారకోరం రహదారి పాంగోంగ్ ఉత్తర ఒడ్డున ముగుస్తుంది. కారకోరం రహదారి కొన్ని చోట్ల సముద్ర మట్టానికి ఆరు వేల మీటర్ల ఎత్తులో ఉంటుంది .ప్రపంచంలో రెండో ఎత్తైన పర్వత ప్రాంతం K-2 మీదుగా ఈ రహదారి వెళుతుంది. పాంగోంగ్ సరస్సు దక్షిణ ఒడ్డు కూడా మొనదేలిన పర్వతాలతో నిండి ఉంటుంది.

దిగువనున్న స్పంగుర్ సరస్సు వైపునకు ఈ పర్వతాలు ఒరిగి ఉంటాయి . పాంగోంగ్ సరస్సులో నీరు స్వచ్ఛంగా , స్పటికంలా ఉంటుంది . కానీ , తాగడానికి పనికిరాదు.శీతాకాలంలో సరస్సు గడ్డకడుతుంది. అప్పుడు సరస్సుపై నుంచి కూడా వాహనాలు ప్రయాణిస్తుంటాయి.



సరస్సులో మూడింట రెండొంతుల భాగం చైనా అధీనంలో ఉంది. కేవలం 45 కిలోమీటర్లు మాత్రమే భారత పరిధిలో ఉంది. ఇక్కడే వాస్తవాధీన రేఖ ఇండియా , చైనా మధ్య వివాదాస్పదంగా మారింది . వాస్తవాధీన రేఖ పైనా రెండు దేశాల మధ్య భిన్నాభిప్రాయాలున్నాయి. ఇండియా చెప్పే వాస్తవాధీన రేఖ సరస్సు కు తూర్పు ప్రాంతంలో , సరస్సు ఉత్తర ఒడ్డునున్న ఫింగర్ నంబర్ ఎనిమిది వద్ద ఉంది . చైనా చెబుతున్న వాస్తవాధీన రేఖ సరస్సు పశ్చిమ ప్రాంతం లో ఒకటో నంబరు ఫింగర్ వద్ద ఉంది.



ఈ మధ్యలోని ప్రాంతాన్ని గ్రే ఏరియా అంటున్నారు . ప్రస్తుతం సరస్సు ఉత్తరం ఒడ్డున నాలుగో నంబరు ఫింగర్ కు అటూ ఇటూ రెండు దేశాల సైనిక శిబిరాలున్నాయి . ఫింగర్ ఎనిమిది నుంచి నాలుగు వరకు చైనా నాలుగు సైనిక శిబిరాలు ఏర్పాటు చేసుకుంది . ఫింగర్ ఒకటి వరకు తమ భూభాగమేనని చైనా చెబుతోంది . ఎనిమిదో నంబరు ఫింగర్ వరకూ తమ భూభాగమేనని ఇండియా చెబుతోంది …