బ్రహ్మోస్ యాంటీ షిప్ మిసైల్ ప్రయోగం విజయవంతం

  • Published By: venkaiahnaidu ,Published On : December 1, 2020 / 09:57 PM IST
బ్రహ్మోస్ యాంటీ షిప్ మిసైల్ ప్రయోగం విజయవంతం

India test-fires anti-ship version of BrahMos బ్రహ్మోస్ మిసైల్​ నావల్ వెర్షన్‌ “యాంటీ షిప్​ మిసైల్​( నౌకా విధ్వంస క్షిపణి)” ని భారత నావికా దళం మంగళవారం విజయవంతంగా పరీక్షించింది. అండమాన్​-నికోబార్ దీవుల నుంచి ఈ ప్రయోగాన్ని నిర్వహించారు.

త్రివిధ దళాలు వరుసగా చేపడుతున్న సూపర్ సోనిక్ క్రూయిజ్ మిసైల్ ప్రయోగాల్లో భాగంగా ఇవాళ బంగాళాఖాతంలో భారత నౌకాదళంకి చెందిన ఐఎన్ఎస్ రన్ విజయ్ నౌక నుంచి ఈ ప్రయోగం చేపట్టినట్టు అధికారులు వెల్లడించారు.



కాగా,గత ఆరు వారాల క్రితం అరేబియన్ సముద్రంలో కూడా భారత నావికాదళం ఇదే తరహా క్షిపణి పరీక్షను విజయవంతంగా నిర్వహించిన విషయం తెలిసిందే. మరోవైపు, గత నెల 24న భారత ఆర్మీ… ధ్వని వేగానికి మూడురెట్ల వేగంతో ఉపరితల లక్ష్యాలను ఛేదించగల బ్రహ్మోస్ క్షిపణిని విజయవంతంగా ప్రయోగించిన విషయం తెలిసిందే. 400 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాన్ని క్షిపణి సులువుగా ఛేదించింది. ఈ క్షిపణిని రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ(డీఆర్​డీఓ) రూపొందించింది.



ప్రపంచంలోనే అత్యధిక వేగంతో బ్రహ్మోస్​ క్షిపణి లక్ష్యాన్ని ఛేదిస్తుంది. ఇటీవల క్షిపణి లక్ష్యాన్ని 290కి.మీ నుంచి 400కి.మీ వరకు డీఆర్​డీఓ పెంచింది. వాస్తవాధీన రేఖ పొడవునా లద్దాక్, అరుణాచల్ ప్రదేశ్ సహా చైనా కాలుదువ్వుతున్న పలు వ్యూహాత్మక ప్రదేశాల్లో భారత్ ఇప్పటికే భారీగా బ్రహ్మోస్ మిసైళ్లు సహా ఇతర కీలక ఆయుధ సంపత్తిని మోహరించింది.